రాజారెడ్డికి పెద్దగా రుచించలేదు. నాలుగు బుక్కలు తిని అయిందనిపించాడు. అప్పటికే పిల్లలు, భార్య తిని లక్ష్మితో మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
తను వెళ్తానంటూ వారిద్దరికీ చెప్పి బయట పడ్డాడు రాజారెడ్డి. ఇంటికి వచ్చి ఆరు బయటే కూర్చున్నాడు. తాళం చెవి భార్య దగ్గర ఉంది. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.
గణేశ్ గుర్తొచ్చాడు. కరోనాతో ప్రైవేటులో చికిత్స తీసుకొని మొన్ననే ఇంటికి వెళ్లాడని నారాయణ చెప్పిన విషయం గుర్తొచ్చి ఫోన్ చేశాడు. రెండు రింగులకే అవతల ఫోన్ లిఫ్ట్ అయ్యింది.
” గణేశ్ బాగున్నావా?”
” మంచిగున్న భయ్యా….” అన్నాడు గణేశ్. గొంతులో ఇంకా నీరసం పోలేదు. బావిలోంచి వచ్చినట్లుగా వినిపించింది అతని మాట.
“ఇంట్లో వాళ్లకు ఎలా ఉంది?” “పర్వాలేదన్నా”
గణేశ్ భార్యకు, అమ్మకు, అతని కొడుకుకు కూడా కరోనా అంటుకున్నది. గణేశ్ కరోనాతో ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ కాగానే ఈ ముగ్గురికీ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో గణేశ్ నరకం అనుభవించాడు. నిద్ర లేని రాత్రులు గడిపాడు. ఎప్పుడెప్పుడు దవాఖానల నుంచి బయటపడ్తానా? అని గంటలు, రోజులు లెక్కబెడుతూ కాలం గడిపాడు. అతని మనసంతా ఇంటి చుట్టే తిరుగుతున్నది. గంట గంటకు ఫోన్ చేస్తూ వారి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నాడు. తెలిసిన డాక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటూ మందులు వాడమని వారికి చెప్తున్నాడు. వారం రోజుల నరకం తర్వాత మూడు నాలుగు లక్షల బిల్లు వసూలు చేసి గణేశ ను బయటకు పంపారు. ఇంట్లో వాళ్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
“మనోళ్లెవరన్నా ఫోన్ చేశారా?” మనోళ్లంటే పత్రికలో పనిచేసే సహచరులు. ఇన్ చార్జిలు అని.
“నేనే చేశాను.” అన్నాడు. “నువ్వెందుకు చేశావు?… వాళ్లు కదా నీకు చేయాల్సింది… క్షేమ సమాచారాలు అడగాల్సింది” అన్నాను. “ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యానని చెప్పడం కోసం చేశాను” అన్నాడు.
” ఏమన్నారు?”
“……………..” అక్కడ్నుంచి వెంటనే ఆన్సర్ రాలేదు. ” గణేశ్ ఏమైంది? “ రెట్టించాడు రాజారెడ్డి. “వాళ్లకు మానవత్వం లేదు రాజన్న” అర్థం కాలేదు రాజిరెడ్డికి. కొన్ని క్షణాల తర్వాత గణేషే చెప్పసాగాడు.
“ ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో ఒక్కడు కూడా నన్ను పలుకరించలేదు. ఇప్పుడు నేను డిశ్చార్జి అయ్యానని నా అంతల నేను ఫోన్ చేస్తే .. బాగున్నావా? ఆరోగ్యం ఎట్లుంది? అంటు కుశల ప్రశ్నలేస్తున్నారు” అని అన్నాడు బాధగా. ” పోనీలే బాధ పడకు.. ” అన్నాడు రాజారెడ్డి సముదాయిస్తున్నట్లు.
“అంతే కాదు……” అని కొద్దిసేపాగి, ” పత్రికకు చందాలు, యాడ్స్ టార్గెట్ విషయంలో ఏమైనా ఫాలో అప్ చేస్తావా అని అడుగుతున్నారు. ఫోన్లోనే కదా అడిగేది… రోజు మెల్లగా మెల్లగా ఫాలో అప్ చేసుకొని రిపోర్ట్ ఇవ్వు. పైన సీరియస్ గా ఉన్నారు.. ప్లీజ్ అర్థం చేసుకో అని నిర్దయగా మాట్లాడారన్నా……”
అతని గొంతు చివరలో గద్గదంగా మారింది.
“ ఛీ ఏం బతుకులన్నా ఇవి. అప్పుడు కూడా ఇంతే. నాన్న చనిపోయి వారం కాలేదు…. ఆఫీసుకు వచ్చి యాడ్ పైసలు మొత్తం కట్టేయ్యాలి అని కటువుగా మాట్లాడారు. మనం ఏమై పోయిన పర్వాలేదు. వాళ్లకు దోచి పెట్టాలి. అంతే…” అన్నాడు. అతని ఆవేదన కట్టలు తెంచుకున్నది.
” ఘర్ కా నా ఘాట్ కా… మనవి ఎటూ కాని బతుకులైపోయాయన్నా” అన్నాడు హీనస్వరంతో. ” బాధపడకు గణేశ్ …” అవి ఓదార్పు మాటల్లా లేవు…. తనూ బాధపడుతన్నట్లే అన్నాడు రాజారెడ్డి. “ అంతా మాట్లాడి వాట్సాప్ గ్రూపులో ఓ మెసేజ్ పెట్టాడు చివరకు… నువ్వు చూశావా?” అన్నాడు గణేశ్. “ఎప్పుడు?” ” ఇప్పుడు గంట క్రితం” “నేను చూసుకోలేదు…. ఎవరిది?” ” ఎడిటర్ పెట్టాడంట… దాన్ని మనకు పంపాడు.” ” ఉండు.. ఇప్పుడే చూస్తా”
ఫోన్ పెట్టేసి… నెట్ ఆన్ చేసి వాట్సప్ చూశాడు. తమ గ్రూపులో తమ బాస్ చండశాసనుడు పెట్టిన మెసేజ్ కనిపిస్తున్నది. అప్పటికే కొందరు ఎస్ సార్, ఒకే సార్, అలాగే సార్, మంచిది సార్ … అంటూ రిప్లైలు ఇస్తున్నారు.
“ వార్తలు బాగా రాయగలిగిన వారే యాడ్స్, సర్క్యూలేషన్ చేయిస్తారు. అందరు విలేకరులకు కరోనా కష్టకాలంలా దాపురిస్తే…. కేవలం మీకు మాత్రమే ఓ కొత్త సువర్ణవకాశాన్ని కలిగించింది. వార్తలు రాస్తూనే నెలకు మీరు 45వేల రూపాయలు సంపాదించుకొనే చాన్సిచ్చింది. అవకాశాన్ని అందిపుచ్చుకోండి……. ఇంకా ఏదేదో ఉంది.
ఆ తర్వాత చదవలేకపోయాడు రాజారెడ్డి. ఆ మెసేజ్ చూసి న‌వ్వాలో ఏడ్వాలో తెలియలేదు.
అప్పుడే భార్య,పిల్లలు ఇంటికి వచ్చారు. తాళం తీసి లోనికి వెళ్లారు. రాజారెడ్డి మాత్రం ఆ మెసేజ్ చూసి అక్కడే కూర్చున్న చోట నుంచి లెవ్వలేదు. బీరిపోయి శూన్యంలోకి చూస్తున్నాడు.
తన మిత్రుడు శ్రీధర్ గుర్తుకొచ్చాడు. శ్రీధర్ సొంతంగా ‘చైతన్యం’ అనే పత్రిక నడుపుతున్నాడు. తొలత మాసపత్రిక, తర్వాత వారపత్రిక, తర్వాత దినపత్రికగా మార్చుకొని పత్రిక నడుపుతున్నాడు.
అతనికి ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు రాజారెడ్డి. అతను పక్కున నవ్వాడు. నవ్వుతూనే ఉన్నాడు. పడీ పడీ నవ్వుతున్నాడు. రాజారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. ఏమైందసలు వీడికి? ..”అట్లనవ్వుతున్నావ్ ఎందుకు ?” అన్నాడు.
” మరి ఏందీ రెడ్డి…? ఈ సమయంలో రిపోర్టర్లు ఇలా సంపాదించవచ్చని మనకే ఉచిత సలహా ఇస్తాడా? ఒక్కసారి మీ వోడిని బయట పరిస్థితి ఎలా ఉందో వచ్చి చూడమను.”
మళ్లీ తనే ….. “ ఏం సలహాలిచ్చాడ్రా నాయనా? వాడికి మొక్కాలి?” అన్నాడు కచ్చగా శ్రీధర్.
” ఏడాది కిందటి డ్యూస్ అమౌంట్ కోసం చెప్పులరిగేలా తిరిగితే ఒక్కడూ ఇయ్యలే.. వందల సార్లు ఫోన్లు చేస్తే ఒక్కడూ లేపడు. ఆ బాధలు అక్కడ ఏసీ రూమ్ లో కూర్చుని ఆయాచితంగా నెలకు వేలకు వేలు జీతాలు జేబులేసుకునేటోళ్లకు ఏడ తెలుస్తయ్?” అన్నాడు వ్యంగ్యంగా “పెండ్లాం మీద పుస్తెలు కూడా తాకట్టు పెట్టి మరీ పత్రిక నడిపిస్తున్న భయ్ ఎవరికి చెప్పుకోవాలె. సిగ్గు పోతది. మొన్న ఫంక్షన్ కు మా అత్తగారు పిలిస్తే కూడా పోలేదు. ధీనమ్మ జీవితం… ఇదీ ఓ బతుకేనా? అని నా మీద నాకే విరక్తి పుడుతుంది రెడ్డి…!”
అప్పటి వరకు నవ్వుకుంటూ మాట్లాడిన గొంతు జీరబోయింది.
“బుద్దున్నవాడెవ్వడైనా ఇంత కఠినమైన టార్గెట్లు మెడ మీద కత్తిలా వేలాడదీస్తాడా? ఈ రోజుల్లో బతికి బట్టకట్టుడే కష్టమైపోయింది… పొద్దున లేచి వాట్సాప్ ఓపెన్ చేస్తే ఎవడి చావు చూడాల్సి వస్తుందో? ఏ ఘోరం వినాల్సి వస్తుందో? తెలియకుండా ఉంది.” శ్రీధర్ చెప్తూ పోతున్నాడు.
” మామూలు రోజుల్లో అంటే ఏదో కిందామీద పడి చేసేస్తరు. ఈ కరోనా కాలంలో ఈ టార్గెట్లేంది రెడ్డి? అసలు వీళ్లు మనుషులేనా?” అసహనంగా అన్నాడు.
రాజారెడ్డి మౌనంగా వింటున్నాడు. అతని మెదడు మొద్దుబారిన ఫీలింగ్ కలుగుతున్నది. ” సరే రెడ్డి మరి రేపు కలుద్దాం… ఇది ఒడవని ముచ్చట ” అని ఫోన్ పెట్టేశాడు శ్రీధర్. అలాగే కొద్ది సేపు అరుగుపై అచేతనంగా కూర్చుండిపోయాడు రాజారెడ్డి.
చల్లటి గాలులు వీస్తున్నాయి. వేరే సమయంలోనైతే ఈ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవాడు రాజారెడ్డి. గాలి వేగంగా వీస్తుండటంతో వాకిలిలో ఏపుగా పెరిగిన వేపచెట్టు లయబద్దంగా అటు ఇటూ ఊగుతున్నది.
వేరే సమయంలోనైతే ఆ దృశ్యం రాజారెడ్డికి కనువిందుగా కనిపించేది. కానీ ఇపుడు మనసంతా కకావికలమై ఉన్నది.
గాలికి వయ్యారంగా ఊగుతున్న వేపచెట్టు తన కళ్లకు దెయ్యం పట్టిన చెట్టులా కనిపిస్తున్నది. ప్రేతం ఆవహించి శిగమూగినట్లుగా తోస్తున్నది.
వెంటనే తేరుకొని అక్కడ్నుంచి ఇంట్లోకి వెళ్లాడు. – పిల్లలు ఇంకా పడుకోలేదు. టీవీలో ‘ఖతర్నాక్’ కామెడీ షో చూస్తున్నారు. స్కిట్ల పేరుతో వాళ్లు చెప్పే బూతు జోకులకు జడ్జీలు పడీపడీ నవ్వుతున్నారు.
అది కామెడీ షో ల అనిపించలేదు రాజారెడ్డికి. ఎవరెన్ని బూతులు చెప్తే అంత కామెడీ అన్నట్లుగా ఉంది. మహిళలను ఎంత కించపరిస్తే అంత కామెడీ పండుతుందన్న మాట.
“ వీటిని చూస్తున్నారా పిల్లలు..? ” అని కోపం వచ్చింది రాజారెడ్డికి. భార్యతో మాట్లాడాలనిపించలేదు.
అందుకే.. ” అనన్యా…. అదేం ప్రోగ్రామ్ అమ్మా? దాన్ని చూసి నేర్చుకునేదేమిటీ? వేరే చానల్ మార్చండి” అన్నాడు.
అనన్య ఏం మాట్లాడకుండా టీవీ రిమోట్ ను తండ్రి చేతికిచ్చింది. లుంగీ కట్టుకుని తీరిగ్గా కుర్చీలో కూర్చుని టీవీ రిమోట్ ను అందుకున్నాడు రాజారెడ్డి.
కొద్దిసేపు టీవీ చూస్తేనైనా మానసిక ఆందోళన తగ్గుతుందేమోనని అనుకున్నాడు. వరుసగా చానల్స్ మారుస్తున్నాడు.
ఒక చానల్ లో ఏదో సినిమా హీరో హీరోయిన్ ను ముద్దు పెట్టుకునే సీన్… వెంటనే మార్చేశాడు.
మరో చానల్ హీరోయిన్ అంగాంగాన్ని తడిమే మరో వానపాట సీన్….. చానల్స్ చేంజ్ చేస్తూనే పోతున్నాడు.
పిల్లలతో కలసి చూసే ప్రోగ్రాములే లేవా? ఇంటిల్లిపాది కలిసి కూర్చుని చూసే సినిమాలెవడైనా తీస్తున్నాడా?” కసిగా మనసులోనే తిట్టుకున్నాడు.
“చేతిలో స్మార్ట్ ఫోన్లు, టీవీల్లో చెత్త ప్రోగ్రాములు… ఇలా అయితే పోరగాళ్ళు చెడిపోక ఏమైతరు? ” అని మనసులోనే కసిగా తిట్టుకుంటున్నాడు.
ఆ కోపం రిమోట్ మీద ప్రదర్శిస్తూ … దాన్ని చేతితో గట్టిగా కొడుతూ… “ఇదొకటి సరిగ్గా పనిచేయడం లేదు” అని విసుక్కున్నాడు.
చివరికి కామెడీ చానల్ పెట్టాడు. దాంట్లో వచ్చినవే వస్తున్నాయి. రోజు చూపించినవే చూపిస్తున్నాడు. రాజారెడ్డి కి చిరాకెత్తింది.
“మీరింకా నిద్రపోరా..? రోజు లేట్ నైట్ దాక టీవీలు చూడటం.. ఏ అర్ధరాత్రో నిద్రపోవడం.. పొద్దున 9 గంటల వరకు ముసుగుతన్ని పడుకోవడం….
బాగా అలవాటైంది మీకు.” అరిచాడు రాజారెడ్డి.
(ఇంకా ఉంది)

 

You missed