అసలే వాటి రేట్లు ఫిరం. ఏ దావతైనా.. ఇంట్లో సండే వచ్చినా.. ఈ మసాల దినుసులు కంపల్సరీ. ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క.. ఇవన్నీ మంచి సుగంధ ద్రవ్యాలు. మాంసాహారంలో మంచి ఘాటును, రుచిని అందించి జిహ్వచాపల్యాన్ని తీర్చేవి. ఇవెప్పుడూ మార్కెట్లో ఫిరమే . కానీ ఈ మధ్య మరింత రేటు పెరిగి స్టాకు కూడా లేకుండా పోతుందట. టీవీల్లో వచ్చే కొన్ని షోలు.. ఇప్పుడు ధనం సంపాదించడం కోసం, వాటిని కాపాడుకోవడం కోసం, ధనాన్ని వశీకరణ చేసుకోవడం కోసం .. చెప్పే సూత్రాలన్నీ ఈ మసాలా దినుపుల చుట్టే తిరుగుతున్నాయి. ఒకరంటారు… ఐదు ఇలాచీలు పర్సులో పెట్టుకుంటే ఆ సువాసనకు డబ్బు ఆకర్షింపబడుతుందట. మరొకడంటాడు.. ఆ వచ్చిన డబ్బు నిలవాలంటే.. దాల్చిన చెక్క, ఎర్రమందారం పెట్టాలంట.. ఇంకొకడంటాడు..లవంగాలతో ఎ వరినైనా ఈజీగా వశీకరణ చేసుకోవచ్చట. ఎన్ని షార్ట్ కట్లో. ఇంత ఈజీగా మనీ సంపాదించే మార్గం ఉండగా.. కష్టపడి పనిచేయడం.. కష్టపడి చదవడం.. ఇవన్నీ అవసరమా? అందుకే ఇప్పుడంతా వీటి కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కిచెన్లో పోపుల డబ్బాలో నిలవ ఉండటం లేదు. బీరువాల్లో, పర్సుల్లో మూలుగుతున్నాయి. అవి తెరవగానే గుమ్మని కమ్మటి వాసన వేస్తున్నాయి. పైసలు మాత్రం ఉండటం లేదు. అవి తర్వాత వస్తాయోమో గానీ, చాలా మంది మాత్రం దీన్ని ఫాలో అవుతున్నారు. అందుకే వీటి రేట్లు పదింతల రెట్లు పెరిగి కూర్చున్నాయట. నమ్మేవాళ్ల సంఖ్య అంతలా ఉంటే… మరి రేట్లు పెరగవా ఏందీ?
చైనీస్ వాస్తు పేరుతో గతంలో కూడా ఇలాంటి ట్రిక్కులే ప్లే చేశారు. మాములు వాస్తు.. ఈశాన్యంలో బరువుండొద్దంటుంది. అక్కడ ఏమున్న తీసేయాలంటుంది. కానీ చైనీస్ వాస్తేమో.. అక్కడ ఏమీ తీయనక్కరలేదు.. ఓ బొమ్మ పెడితేనో.. ఇంకేదో బిళ్ల తగిలిస్తేనో దోషం ఉండదని చెప్పడంతో అంతా ఎగబడి కొనుక్కున్నారు. వ్యాపారం వృధ్ది చెందాలంటే లాఫింగ్ బుద్దా, భుజాన ధనం సంచితో వస్తున్న బుద్దా విగ్రహాలను కూడా పెట్టుకునేది. అసలు వాస్తుకే శాస్త్రీయత లేదు. ఇక చైనీస్ వాస్తైతే జనం చెవిలో పెట్టింది. అది కొన్ని రోజులు నడిచింది. తర్వాత మరిచారు. ఇప్పుడిలా షార్ట్ కట్లో తక్కువ సమయంలో ధనవంతులయ్యేందుకు ఇలాచీలు, లవంగాలు ఉపయోగిస్తే చాలు అని చెప్పడం ఏదైతే ఉందో.. నాభూతో నా భవిష్యత్……