కొత్తరకం_ఎన్కౌంటర్.. !

అమానుష అత్యాచార ఘటనల్లో, ఎలా స్పందించాలో ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు.. కరవమంటే కప్పకు కోపం, విడువమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. వరంగల్ యాసిడ్ దాడి కేసులో, మొన్నటి దిశ ఘటనలో సజ్జనార్ తీసుకున్న నిర్ణయం సామాన్య పౌరులకు నచ్చినా, చట్టం దృష్టిలో అది ముమ్మాటికీ తప్పే అనే వాదన తెర పైకి వచ్చింది. ఇలా చంపుకుంటూ పోతే చట్టమెందుకు, న్యాయ వ్యవస్థెందుకు.. ఇది ఆటవిక న్యాయం అన్నారు..

పోలీసుల పై హత్యానేరం మోపాలి అనే డిమాండ్స్ వచ్చాయి. ప్రజలు ఇలాంటి పాశవిక సందర్భాల్లో సత్వర న్యాయం కోరుకుంటున్నారు. మృగ ప్రవృత్తిని, నీచాతి నీచమైన ప్రవర్తనను జీర్ణించుకోలేక పోతున్నారు.

సదరు సంఘటనలు కూడా నిందితున్ని అప్పటికప్పుడు అంతమొందించాలి అనే విధంగానే ఉంటున్నాయి.. ఇప్పుడు ప్రజల్ని తృప్తి పరచాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. పోలీసులపైకి రాకూడదు. అందుకే పది లక్షల రివార్డు ప్రకటించారు. పది లక్షల రివార్డు ప్రకటించినపుడే ఎత్తుగడ అర్థమైంది. (ఆరోజే నేను ఫెస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాను. రెండు రోజుల్లో రాజు ఆత్మహత్య, లేదా అనుమానాస్పద మృతి అనే వార్త వస్తుందని. అక్షరాలా అదే జరిగింది).

ఎందుకంటే కేటీఆర్ అంటే రెండో సీఎం లా ఉన్న మంత్రి. ఆయనకు తప్పుడు సమాచారం వస్తుందా.. తప్పుడు సమాచారాన్ని ట్వీట్ చేస్తాడా.. అనేది ఆలోచించదగ్గ విషయం. మొదట రాజును అదుపులోకి తీసుకున్నారని అన్ని ఛానెల్స్ మొత్తుకున్నాయి. రెండు రోజుల తర్వాత రివార్డ్ వార్త వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆత్మహత్య వార్త వెలుగు చూసింది.. ఆత్మహత్య కు పాల్పడుతుంటే చూశాము అని చెప్పిన సాక్షులు కూడా సిద్ధంగా ఉన్నారు.

ఏదేమైనా చిన్నారి చైత్రకు ఈ రాజ్యం న్యాయం చేసిందా లేదా అనేది ప్రజలే నిర్ణయించాలి. ఓ పసిబిడ్డ ఆ ఇంట్లోనే ఉంది అన్నా వినకుండా, నిర్లక్ష్యం చేసి దబాయించిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాణం విలువైనది.. ఇది ప్రాణాలతో చెలగాటం. రాజు ఆత్మహత్య ఉదంతంతో చైత్రకు న్యాయం జరిగినట్టు కాదు..

సజ్జనార్ ఆర్టీసీ బస్సులపై అశ్లీల ప్రకటనలు తొలగించాలని ఆదేశించారు. అదే విధంగా, ఫెస్ బుక్ వంటి సోషల్ మీడియాలో శృంగారం తో రెచ్చగొట్టే మినీ వీడియోలు నిషేదించాలి. అర్ధనగ్నంగా నాట్యం చేసే వీడియోలు, లిప్ లాక్ వీడియోలు ఏమాత్రం హద్దు అదుపు లేకుండా పోస్ట్ చేస్తున్నారు. ప్రతి పిల్లాడి చేతిలో మొబైల్. పిల్లలకు, యువకులకు చిన్న వయసులోనే కొరికల్ని రెచ్చగొట్టే వీడియోలకు కొదవలేదు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, ఈ విషయం లో శ్రద్ధ పెట్టాలి. సినిమాల్లో రెండు ముద్దు సీన్స్ ఉంటే ఏ సర్టిఫికెట్ ఉండేది.. ఆ స్థాయి నుంచి బరితెగించి, బరిబాత నృత్యాలు పోస్ట్ చేసే కల్చర్ వచ్చింది. వాటిని నిషేదించాలి. పశు వాంఛలను రెచ్చగొట్టే మారకద్రవ్యాలపై (గంజాయి)ఉక్కు పాదం మోపాలి. టన్నుల టన్నుల గంజాయి దొరుకుతుంది. మనిషి ప్రవర్తనలో మార్పు రావాలంటే, సమాజ నడవడికలో మార్పు రావాలి..

ఎన్కౌంటర్ చేయాల్సింది ఈ వికృత చేష్టలని.. ఈ చీకటి మారక ద్రవ్య వ్యాపారాన్ని.. ఆత్మహత్య చేసుకోవాల్సింది, అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు కొత్త నాటకం ఆడే వ్యవస్థ. ఓ ఫ్రెండ్ అన్నట్టు.. ఉరి శిక్షతో నేరాలు ఆగితే మొదటి ఉరి దగ్గరే నేరాలు ఆగిపోవాలి. ఎన్కౌంటర్ తో మానభంగాలు ఆగుతాయి, అత్యాచారాలు ఆగుతాయి అనుకుంటే మొదటి ఎంకౌంటర్ తోనే ఆగిపోవాలి.

రాజు ఆత్మహత్య వార్త పక్కనే సేమ్ చైత్ర లాంటి రెండు ఐదేళ్ల బాలిక అత్యాచార స్టోరీలు. అవెందుకు హైలెట్ కాలేదో తెలీదు. ఈ దేశంలో వెలుగులోకి రాని చైత్రలు ఎందరో చరిత్రలో కనిపించకుండా పోయారు. మానవత్వాన్ని నేర్పే ప్రయత్నం చేద్దాం. శిథిలమవుతున్న మానవత్వాన్ని పునరుద్ధరించి మనుషులుగా మార్చుదాం.. దిశ నుంచి చైత్ర వరకు దశ మార్చే ప్రయత్నం చేద్దాం…

(From: Journalist Janardhan, via నవ జీవన ప్రియ )
— Rajeshwer Chelimela , Jvv Telangana

You missed