టీఆరెఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం మరో రెండ్రోజుల్లో ముగియనుంది. మొన్నటి వరకు జిల్లా కమిటీలు లేవు. జిల్లా అధ్యక్ష పదవులు లేవు. కేసీఆర్ మొత్తం ఎమ్మెల్యేల మీద భారం వేశాడు. వారినే నమ్ముకున్నాడు. దీంతో అన్ని జిల్లాల్లో పార్టీ ఆగమైంది. ఎమ్మెల్యేల ఒంటెత్తు పోకడతో పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా చోట్ల అసంతృప్తితో ఉన్నారు. చాలా మంది పార్టీకి దూరమయ్యారు. దూరమయ్యేందుకు రెడీగా ఉన్నారు. ఈ విషయం కేసీఆర్ తెలుసుకోవడానికి ఆలస్యమైనప్పటికీ తప్పుని చక్కదిద్దుకునేందుకు జిల్లా కమిటీల కూర్పు పై దృష్టి పెట్టాడు. జిల్లా అధ్యక్షుల నియామకం పార్టీకి ఈ పరిస్థితిల్లో అనివార్యమని కేసీఆర్ గుర్తించాడు. ఈ నెల 20న జిల్లా కమిటీల కూర్పు ముగుస్తుంది. ఏకగ్రీవంగా ఆ జిల్లా నేతలు ఎవరిదైనా ఒకరి పేరు సూచిస్తే ఓకే. లేదంటే కేసీఆర్ డిసైడ్ చేసి సీల్డ్ కవర్‌లో పేరు పంపుతాడు.
అందరూ దీన్ని శిరసావహించాల్సిందే. మొదటి సారి గెలిచిన వారికే రెండో సారి కూడా కేసీఆర్ టికెట్ ఇచ్చాడు. మధ్యంతరానికి వెళ్లిన నేపథ్యంలో కేసీఆర్ అప్పుడు రిస్క్ తీసుకోలేదు. కానీ రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఇక తమకు అడ్డులేదనుకున్నారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. అవినీతి పెరిగిపోయింది. విచ్చలవిడితనం ఎక్కువైంది. మూడో సారి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్తే ఆ నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన క్యాడర్ మొత్తం పార్టీ మారే అవకాశం ఉంది. ఒక హుజురాబాద్‌లో దీన్ని కంట్రోల్ చేయగలిగారు కానీ రేపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంటే పార్టీ అదుపు తప్పుతుందనే భయం కేసీఆర్‌కు ఉంది. దీంతో జిల్లా అధ్యక్షులను నియమించి వారి చేతికి పవర్‌ను కూడా ఇచ్చి పార్టీని పూర్తిగా అదుపాజ్ఞలో పెట్టుకునేలా చేయాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తున్నది.
ఇప్పుడు నియమింపబడే జిల్లా అధ్యక్షులు పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నారు. రేపు ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఎవరు గెలుస్తారు అనే సర్వే రిపోర్టుకు వీరు మూలాధారం కానున్నారు. ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇకపై పరిస్థితి పూర్తిగా మారనున్నది. జిల్లా అధ్యక్షులు ఇక డమ్మీలుగా ఉండరు. ఆ జిల్లా పార్టీని తమ కంట్రోల్‌లో ఉంచుకుని ఎప్పటికప్పుడు బాస్‌కు సమాచారం అందిస్తూ.. రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా పని చేయించే అధ్యక్షుడై ఉండాలి. ఇప్పుడు వారి కోసమే అన్వేషణ.