చిన్నారి రేప్‌, హ‌త్య కేసు నిందితుడి ఆత్మ‌హ‌త్యతో ఈ క‌థ ముగియ‌లేదు. పోలీసులే చంపి, రైల్వే ట్రాక్ పై ప‌డేశార‌ని అనుకుంటున్నారంతా. ఇది ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించి తుపాకికీ మ‌ట్టి అంట‌కుండా ప‌ని చ‌క్క‌బెట్టార‌నేది అంద‌రి అభిప్రాయంగా ఉంటుంది. ఇంత‌టితో ఈ చ‌ర్చ ముగుస్తుంద‌నుకున్నారు. హ‌క్క‌లు సంఘాలు కూడా ఏమీ చేయ‌లేక‌.. చూస్తుండిపోవాల్సిందేన‌ని అనుకున్నారు. కానీ వాళ్లూ దీనిపై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇక ఇది ఇంకొంత కాలం జ‌నాల్లో నానుతూ ఉండే అంశంగానే మారింది. ఎన్ని రోజులో తెలియ‌దు.

ఇక దారుణం జ‌రిగిన త‌ర్వాత ప‌ట్టించుకోని మీడియాకు సోష‌ల్ మీడియా చివాట్లు బాగానే వేసింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ హాస్పిట‌ల్ వ‌ద్ద అహోరాత్రులు ప‌డిగాపులు కాసి కుక్క తిట్లు తిన్న త‌ర్వాత గానీ మీడియాకు బుద్ది రాలేదు. వెంట‌నే సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీ వైపు ప‌రుగులు తీసింది. స‌రే, ఇప్పుడు వాడు చ‌నిపోయాడు. మ‌రి త‌ర్వాత క‌వ‌రేజీ మాటేంటీ? ఏం చెయ్యాలి? య‌థా ప్ర‌కారం త‌మ‌దైన శైలిలో విభిన్నంగా దీనిపై ఏదైనా చూపాలి క‌దా! ఎలా…? ఏం చూపాలి? ఇప్పుడు సుధీర్ఘంగా మ‌న టీవీ ఛాన‌ళ్లు ఇవే ఆలోచిస్తున్నాయి. హ‌క్కుల సంఘాలు ఎలాగూ బ‌య‌ట‌కు వ‌చ్చాయి కాబ‌ట్టి వారితో ఆత్మ‌హ‌త్య‌పై అనుమానాలు అనే అంశంపై ఓ ప‌ది రోజులు డిబేట్లు పెట్టి అలా లాగించేస్తే… ఇలాంటి ఆలోచ‌న‌ల‌తో కూడా మ‌న తెలుగు మీడియా ఉంద‌ని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

నిన్న ఫ‌ణికుమార్ కె అనే వ్య‌క్తి త‌న వాల్‌పై ఓ అల్టిమేట్ సెటైర్ ఒక‌టి పోస్టు చేశాడు. అది టీవీ9 గురింది. అదేంటంటే.. నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది రైల్ ట్రాక్‌పై కాబ‌ట్టి, బాలిక హ‌త్యాచార కేసుల బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు.. అనే అంశంపై టీవీ9 ఓ స్టోరీ చేయ‌ద‌ల్చుకుంటే.. వారి కోసం కోణార్క్ రైల్ టైమింగ్స్ అని .. ఆ రైలు ఎప్పుడెప్పుడు ఎక్క‌డి నుంచి ఎన్ని గంట‌ల‌కు వ‌స్తుందో టైమింగ్స్ చార్ట్‌ను పోస్టు చేశాడు. ఇదేంటీ? టీవీ9కు ఆ రైలు టైమింగుల‌తో ఏం ప‌ని అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది అస‌లైన సెటైర్‌. ఇది అల్టిమేట్ సెటైర్‌. మ‌న టీవీల వింత పోక‌డ‌ల‌ను ఎత్తి చూపే ఎత్తిపొడుపు ఇద‌న్న‌మాట‌.

వైర‌ల్‌గా మారిన ఏ సంఘ‌ట‌నైనా త‌మ‌దైన కోణంలో ప్ర‌జెంట్ చేయ‌డానికి టీవీలు నానా తంటాలు ప‌డుతుంటాయి. రేటింగ్ కోసం.. పోటీలో ప‌డి కొత్త‌గా ఏదైనా చెప్పాల‌నుకుని న‌వ్వుల‌పాల‌వుతూ ఉన్నాయి. శ్రీ‌దేవీ చ‌నిపోతే.. బాత్‌ట‌బ్‌లో ప‌డుకొని ఎలా చ‌నిపోయిందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు మ‌న‌కు చూపిన‌ట్టుగా. సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ ఎలా జ‌రిగిందో చెప్పేందుకు బైక్ గురించి వివ‌రించి చెప్పిన‌ట్టుగా. సినీ న‌టుడు హ‌రిక్రిష్ణ కారు యాక్సిడెంట్ ఎలా జ‌రిగిందో చెప్పేందుకు ప‌క్క‌నే ఉన్న వాట‌ర్ బాటిల్ ఎలా అందుకోబోయాడు. ఎలా స్టీరింగ్ కంట్రోల్ త‌ప్పింది అని అందులో కూర్చుని చెప్పిన‌ట్టుగా. ఇప్పుడు రాజు ఆత్మ‌హ‌త్య ఎలా చేసుకున్నాడో చెప్పేందుకు కూడా మ‌న టీవీ వాళ్లు రైలు ప‌ట్టాల‌పై ప‌డుకుంటారేమోన‌ని పాపం మ‌న నెటిజ‌న్లు తెగ ఇదై పోతున్నారు.

ఒక‌వేళ ప‌ట్టాల‌పై ప‌డుకొని స్టోరీ ఇవ్వాల‌నుకుంటే.. మ‌రి అప్పుడు ట్రైన్ వ‌చ్చే టైం అయితే? పాపం మ‌న విలేక‌రి కూడా రాజులా పైకి పోవాల్సి వ‌స్తుంది. అందుకే ఈ భ‌యం. అందుకే ఈ టైమింగ్స్‌. ఎందుకైనా మంచిది.. ట్రైన్ టైమింగ్స్ చూసుకుని అటువైపు అది రాని స‌మ‌యంలో ఎంచ‌క్కా ప‌ట్ట‌లపై ప‌డుకోండి. ఎన్నైనా టేక్‌లు తీసుకోండి. ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌కండి. మీ సొల్లు జ‌ర్న‌లిజం కోసం మాత్రం మీ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప‌ట్టాల‌పై ప‌డుకొని పైకి పోకండి.

 

You missed