బిగ్‌బాస్ ఫైవ్ మచ్ కాదు.. టూ మచ్‌గానే ఉండబోతున్నది షరా మామూలుగా. ఈసారి ఇంకొంచెం స్పైసీగా కూడా. మొత్తం 19మంది హౌజ్ మేట్లలో ఇకరిద్దరు తప్ప మిగిలిన వారంతా పెద్దగా వెల్‌నోన్ ఏం కాదు. అంతా కొత్త ముఖాలతో కూడుకున్న హౌజ్ అన్నమాట. ఇంట్రడక్షన్ సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. స్క్రిప్ట్ రైంటింగ్ కూడా బాగుంది. కొత్తదనం కనిపించింది. హౌజ్‌మేట్స్ ఎంపిక అంతా సోసోగానే ఉంది. సెవన్ ఆర్ట్స్ సరయూ స్పెషల్ అట్రాక్షన్. పాపం బిగ్‌బాస్ ఈమెను ఏరికోరి తెచ్చుకున్నట్టున్నారు. ఆమే ప్రధాన భూమిక పోషించబోతున్నట్టుగా కనపిస్తున్నది. నాగార్జున ఈ షో కోసం రెండు మూడు మెట్లు దిగాడు. తప్పదు. తప్పలేదు. సరయుతో ఏవో డైలాగులు చెప్పించాడు. ఆమె ముద్దుగా తన నుంచి వారేం ఆశిస్తున్నారో తెలినట్టుగా.. మింగెయ్ రా.. మింగెయ్ అని ముద్దుగా పచ్చిబూతులు పలికి అందరినీ అలరించింది. నాగ్ కూడా ఎంజాయ్ చేశాడు. ఆమె పచ్చి బూతుల డైలాగుల మీదే ఈ షో ఆధారపడి ఉందనంత బిల్డప్ కనిపించింది.
ఉమదేవీ కూడా కొంచెం గ్లామరస్‌ను తోడు తీసుకొచ్చింది. యాంకర్ రవి. లోబో స్పెషల్ అట్రాక్షన్. మిగిలిన వారంతా సోసో… ఈ షోకు ముందు దయచేసి పిల్లలను దూరంగా ఉంచండి అని వేస్తే బాగుంటుందేమో. భార్యభర్తలు మాత్రమే చూసే షో ఇది. అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్లు, పిల్లాపాపలు, చిన్నాపెద్దలు కలిసి చూసేది కాదని చూస్తే తెలిసిపోతుంది. తెలంగాణ యాస, భాషను ఈ షోలో కూడా వాడుకుందామనే ఆలోచనలున్నట్టున్నాయి. తెలంగాణ భాష పేరుతో సరయూ పచ్చి బూతుల మాటలు విచ్చలవిడిగా దొర్లబోతున్నాయి. యాంకర్ రవి కూడా తెచ్చిపెట్టుకున్న తెలంగాణ యాసను మాట్లాడే ప్రయాస చేశాడు. నయ్యం… మన పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్య వీళ్ల దృష్టిలో పడలేదు. అప్పటికీ భీమ్లా నాయక్ పాట రాలేదు కాబట్టి సరిపోయింది.