ఆన్లైన్ చదువులకే పిల్లలు మొగ్గు చూపారు. తల్లిదండ్రలు తమ పిల్లలను బళ్లకు పంపేందుకు ఇష్టపడలేదు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభించినా.. ప్రభుత్వం రా రాండంటూ పిలిచినా అటువైపు ఎవరూ వెళ్లలేదు. హాస్టళ్లు లేవు. గురుకులాలు తెరవలేదు. ప్రైవేటు స్కూలు బస్సులు రోడ్డెక్కలేదు. రవాణా వ్యవస్థ లేదు. దీంతో పదిశాతానికి మించి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లలేదు. ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం 25 శాతం నుంచి 30 శాతం వరకు హాజరయ్యారు. ఎందుకంటే వారికి ఆన్లైన్ సదుపాయాలు లేవు. మొన్నటి వరకూ వారి చదువు అటకెక్కింది. ఇప్పుడన్నా స్కూళ్లు తెరిస్తే చదువుకోవచ్చనే భావనలో వారున్నారు.దీంతో సర్కారు స్కూళ్లకు వెళ్లేందుకు ఎక్కువ మంది పిల్లలు మొగ్గు చూపారు. కొన్ని రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.
ఇక ప్రైవేటు బడి మెట్లెక్కేందుకు కరోనా కన్నా.. ఫీజులు ముప్పు పొంచి ఉందనే భయమే పేరెంట్స్‌కు ఎక్కువగా ఉంది. ఆన్లైన్ పేరుతో చదువులు ఎలాగోలా నడస్తున్నాయి. నెలవారీ ఫీజులు వసూలు చేస్తున్నారు. కొంచెం లేటైనా కట్టేస్తున్నారు. కానీ బడి మెట్లెక్కితే మాత్రం.. ఫీజులు చెల్లించాలి. లేదంటే రానీయం.. లాంటి ఆంక్షలు, బ్లాక్‌మెయిలింగ్ షరా మాములుగా మారుతుంది. ప్రభుత్వమే మీ ఇష్టం అన్నప్పుడు.. ఆన్లైన్కూ అవకాశం ఇచ్చినప్పుడు.. ఆదాయమే దిక్కు లేనప్పుడు.. ఫీజుల బారి నుంచి తప్పించుకునే మార్గం దొరికినప్పుడు….
బడికి పంపడమెందుకు?
ఇలా ఆన్‌లైన్‌తో నడిపేద్దాం బండి…అనుకుంటున్నారట తల్లిదండ్రులు.