ఒక నజియా కోసం నవల చదవడం ఇప్పుడే పూర్తయింది… ఒక అద్భుతమైన ప్రేమ కథ తెలంగాణ చారిత్రక నేపథ్యంలో గుండెకి హత్తుకునేలా ఉంది. ఒకవైపు నజియా- రామస్వామి ప్రేమ కథని చదువుతున్నంతసేపు ఉద్వేగము ఉప్పొంగితే, మరోవైపు నిజాం కాలం నాటి చరిత్రను అక్షరాలతో తవ్వి తీస్తున్నప్పుడు అంతే స్థాయిలో అవేశం కట్టలుతెంచుకుంటుంది.
ప్రేమంటే జీవితాంతం కలిసి ఉండటం కాదు, నిన్ను నువ్వు నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవడం ఎప్పటికీ వీలు కాదు ఈ రెండు పాయింట్స్ ని తీసుకొని ఒక గొప్ప ప్రేమ కథను అల్లుకోవడం బాగుంది. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉన్నా, వివిధ కారణాలతో విడిపోయి జీవితంలో ముందుకు పోతున్నా పాత జ్ఞాపకాలు మనసు దొంతరలలో ప్రాణంతోనే ఉంటాయి. ప్రాణం పోయేంతవరకు నీతోనే ఉంటాయి. నిజమైన ప్రేమ నిరంతరం నీతోనే ఉంటుంది, మీ మనసులోనే దాగుఉంటుంది. రామస్వామి-నజియ మాదిరి తిరిగి ఎన్నడూ కలుసుకోకున్నా నిన్ను నడిపిస్తుంది. కార్తీక్ మాదిరి తిరిగి కలిసినాక సైతం నీ దారి మార్చి నడిపిస్తుంది. నిజమైన ప్రేమ తెలిసినాక కూడా కలుసుకోలేక పోవడం కార్తీక్ జీవితం అయితే, విడిపోయినా కూడా ఆలోచనల్లో కలిసి ఉండడం రామస్వామి -నజియా జీవితం. ఇలా ఓకే నవలలో ప్రేమ అనే భావనకు వివిధ నిర్వచనాలు ఇచ్చిన ప్రత్యేక కథనం బాగుంది.
తెలంగాణ గ్రామీణ యాస, భాష పట్ల ఇష్టమున్న వాళ్లకి ఈ పుస్తక పఠనం బాగా నచ్చుతుంది. అద్భుతమైన భాష, కథ, కథనంతో ఈ నవల రాసిన రచయిత నగేష్ బీరెడ్డికి అభినందనలు.
ముందుమాటగా కట్టా శేఖర్ రెడ్డి రాసిన అత్యంత స్వల్ప వ్యాఖ్యానం చాలా బాగుంది. ఆయన మాటల్లో చెప్పాలంటే …
గతం ఒక స్మృతిగా వెంటాడుతుంది. మనసు పొరలలో నిక్షిప్తమైన ప్రేమపాశాలు ఒకప్పుడు మధురంగా, మరోసారి దుర్భరంగా మెలిపెడుతూ ఉంటాయి. తీరని రుణ శేషాలై వేధిస్తుంటాయి, తీయని జ్ఞాపకాలై సాధిస్తుంటాయి. చాలాసార్లు మన జీవిత అన్వేషణ నాస్టాల్జియా కోసం అన్వేషణ.. విస్మృత దారుల వెంట ఎడతెగని ప్రయాణం… ఎక్కడ ఎలా ముగుస్తుందో అసలు ముగుస్తుందో లేదో తెలియని ఉద్వేగాల యాత్ర…
ఒక నజియా కోసం నగేష్ బీరెడ్డి చూపిన అన్వేషణలో జ్ఞాపకాలు, ఆలోచనలు, ఉద్వేగాలు ఉవ్వెత్తున మనల్ని ముంచిపోతాయి, చివరగా నిన్ను నువ్వు తెలుసుకోవడం నీకు ఎప్పటికీ సాధ్యం కాదన్న నగేష్ నవల ముగింపు వాక్యం వద్దనే అనేక ప్రశ్నలు మనలని ప్రశ్నిస్తాయి. అయినా అన్వేషణ ఆపకుండా ముందుకు పోవాలన్న స్ఫూర్తిని, ఆశనిస్తాయి
Mahesh manikya
