హైదరాబాద్‌లో పెరుగుతున్న నేరాలు, ఘోరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం అపసోపాలు పడుతున్నది. సీసీ కెమెరాల వినియోగంతో చాలా మట్టుకు నేరాలను చేధించగలుతున్నది. క్షణాల్లో నిందితులను కనిపెట్ట గలుగుతున్నారు. కానీ సీసీ కెమెరాలకు అందని నేరాలు మహా నగరంలో నిత్యం చోటు చేసుకుంటునే ఉన్నాయి.
మనుషులను నమ్మబలికి, దగ్గర చేరి, విశ్వాసంగా ఉన్నట్లు నటించి నేరాలకు, ఘోరాలకు పాల్పడే బృందాల ఉనికి ఇంకా సజీవంగానే ఉంది. దీన్ని నిలువరించడం పోలీసుల తరం కావడం లేదు. మంచితనం, మానవత్వం ఈ దొంగలకు పెట్టుబడి. సెంటిమెంట్, విశ్వాసం ఈ దోపిడీ ముఠాలకు తిరుగులేని అస్త్రం. అందుకే ఈ తరహా దోపిడీలు ఎవర్‌గ్రీన్గా ఉంటున్నాయి. ఆఖరికి ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు మోసపోయిన, బాధితుల సహకారంతోనే సాధ్యమనే విషయాన్ని హైదరాబాద్ సీపీ అంజన్‌కుమార్ గుర్తించాడు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు.
ఇంటి యజమానులకు సూచనలు చేశాడు. ఏమంటే.. ఇంట్లో పనివారు లేదా డ్రైవర్లు, కొత్తగా అద్దెకు దిగిన వారి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లలో ఇవ్వాల్సిందిగా కోరాడు. తగు విచారణ చేసిన తర్వాత మాత్రమే కొత్తగా పనివాళ్లను తీసుకోవాలని పేర్కొన్నాడు. తెలియని వారిని పనిలో పెట్టుకోవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశాడు. అంటే.. ప్రతి ఒక్కరి వివరాలు పోలీస్ స్టేషన్‌లలో ఉంటే దోపిడీ, నేరాలకు ఆస్కారముండదనే ముందు చూపు బహుశా పోలీసులకు ఉన్నట్లు ఉంది. ఈ విధంగానైనా నేరాలు నియంత్రణలోకి వస్తాయనేది పోలీసుల ప్రయత్నం. అందుకే ఇక పై హైదరాబాద్‌లో ఎవరినీ నమ్మొద్దు. అందరినీ అనుమానించాలి. హైదరాబాద్‌లో అంతే.