ఇప్పుడు తిట్ల తెలంగాణ నడుస్తుంది. రాజకీయ నాయకులు పరిపక్వత చెందారు. పరిణతి పొందారు. అందుకే కొత్త ట్రెండ్ ను అందుకున్నారు. మేం దేశంలోనే నెంబర్ వన్, నెంబర్ వన్.. అని మాటకు ముందు మన పాలకుడు అంటుంటే.. దీంట్లో కూడా ఎందుకు నెంబర్ వన్ కాకూడదు అనుకున్నారు ఏమో మన నేతలు. ఇప్పుడు బూతుల తెలంగాణ అనే కొత్త నినాదాన్ని ఎంచుకున్నారు.
అందరి దృష్టిని ఆకర్షించాలంటే ఏదో ఒకటి చెయ్యాలె. ఎవరినైనా తిట్టాలె. అదీ గట్టిగా, ఘాటుగా. అప్పుడే అంతా మనవైపు చూస్తారు. అబ్బా భలేగా తిట్టాడు కదా..! అని మనం చెప్పే మిగిలిన సోదంతా ఓపిగ్గా వింటాడు. ఈ దోరణిలో ప్రతిపక్షాలు ముందుకు సాగుతుండగా.. దీన్ని తిప్పికొట్టేందుకు పాలకపక్షాలు ఇంకా మరింత మరింతగా దిగజారిపోతున్నారు. దీనికీ శభాష్.. ఆ.. అదీ.. అలా .. తిట్టు.. ఇంకా.. అని ఎంకరేజ్ చేసే టీంలు కూడా ఉన్నాయి. అంతే.. ఇక వీరిని మార్చే పరిస్థితి లేదు.
సోషల్ మీడియాలో ఓ జర్నలిస్టు పెట్టిన పోస్టు ఆసక్తికరంగా ఉంది. ఫ్యూచర్ తెలుగు న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ ఎలా ఉంటాయో? మీరేమైనా గెస్ చేయగలరా? అని ఓ ప్రశ్నను సంధించాడు ఎఫ్బీలో తన వాల్ పై. లఫూట్ నా కొడుకా అని ఒకరు, తోపు అని మరొకరు, సాలే అని ఇంకొకరు, గాండు అని మరొకరు గెస్ చేసి రాశారు. మొత్తానికి రాజకీయ నాయకుల్లాగా మన పేపర్లు కూడా ట్రెండ్ మార్చుకుంటున్నాయి మరి. వాళ్లెంత తిట్టుకుంటే వీరికంత రాసుకునే వెసులుబాటు. దీనికే ఎక్కువ రీడబులిటీ కదా. ఇక ఎలక్ట్రానిక్ మీడియాకైతే పండగే. వీ6లో అయితే మధ్యలో టూ.. టూ అని బూతును కట్ చేస్తూ ఎంచక్కా మొత్తం వీడియో ప్లే చేసి తీన్మార్ పండుగ చేసుకున్నారు. జనాలు కూడా విరగబడి, ఎగబడే చూశారు లెండి..! అదంతే. ఇప్పుడిదో ట్రెండ్. బహుశా జనం నాడి తెలుసుకునే మన నేతలు ఇలా దిగజారి.. నోరు జారి … పాతళంలోకి జారిపోయి మాట్లాడుతున్నారేమో!!