పెరుగుతున్న ఆధునిక సాంకేతిక టెక్నాలజీ నేరాల నియంత్రణలో కీలకంగా పని చేస్తున్నది. చాలా కేసుల్లో పోలీసులను తప్పుదారి పట్టించే విధంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఏది నిజం? ఏది అబద్ధం? అని తేల్చుకోలేని పరిస్థితుల్లో పోలీసు రంగం ఉంది. ఇలాంటి ఉదంతాల్లో వాస్తవాలు వెలుగు చూపేందుకు సీసీ కెమెరాలు కీలకంగా పని చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎక్కడా చూసిన గల్లీ గల్లీకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పెరుగుతున్న జనాభాతో పాటే నేరాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు పోలీసుల కంటే ఎక్కువగా సీసీ కెమెరాలను నమ్ముకుంటున్నారు.
గంటల, రోజుల వ్యవధిలోనే నిజాన్ని నిగ్గుతేల్చి నేరస్తులకు బేడీలు పడేలా చేస్తున్నాయి ఈ నిఘా నేత్రాలు. మొన్నటి ‘గాంధీ ఆస్పత్రి’ సంఘటనలో ప్రపంచమంతా అక్కాచెల్లెళ్లు గ్యాంగ్‌రేప్‌కు గురయ్యారని ప్రపంచమంతా కోడై కూసింది. మీడియా దీని పై చిలువలుపలవలు చేసి మరింత గాంధీ పత్రిష్ఠ దిగజారేలా కథనాలు అల్లింది. మరో ఘటనలో ఆటో డ్రైవర్లు తనను గ్యాంగ్ రేప్ చేశారంటూ మరో యువతి ఫిర్యాదు చేసిన ఉదంతం పై వాస్తవాలను సీసీ కెమెరాలు బయట పెట్టాయి.
మొన్న గుంటూరులో జరిగిన యువతి కత్తిపోట్ల ఘటన కూడా సీసీ కెమెరా ద్వారా వెలుగు చూసింది. నిందితుడు ఏవడో క్షణాల్లో తెలిసిపోయింది. హైదరాబాద్‌లో చాలా వరకు చైన్‌స్నాచింగ్, ఈవ్ టీచింగ్ కేసులు కూడా చాలా వరకు అదుపులోకి వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో సీసీ కెమెరాల ఆవశ్యకత హైదరాబాద్‌లో మరింత ఉందనే విషయాన్ని జనాలు కూడా గమనిస్తున్నారు. సిటీలోనే కాకుండా పల్లెల్లో కూడా సీసీ కెమెరాల నిఘా పెరుగుతున్నది.