అసలే కరోనా టైం. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో తెల్వదు. అప్పటి వరకు ఆన్ లైన్ క్లాసులే దిక్కు. అర్థం అయినా.. కాకపోయినా. ప్రశ్నలకు నివృత్తి దొరకకపోయినా. అలా సర్ధుకుపోతున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన సౌమ్య సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. పొద్దున్నే తల్లిదండ్రులతో కలసి పత్తి చేను పోయింది. చేను పనుల్లో ఆసరా అయ్యింది. ఆలోగా ఆన్ లైన్‌కు టైం అయ్యింది. అక్కడే కూచుని స్మార్ట్ ఫోన్లో జూమ్ ఓపెన్ చేసింది. ఈ చేనే తరగతి గదైంది. పత్తి మొలకలే తోటి విద్యార్థులయ్యారు. అలా ఆన్లైన్ పాఠాలలో లీనమైపోయింది. ఆ తర్వాత పత్తి చేను పనుల్లో నిమగ్నమైంది. ఈ ఫోటోను .. సాక్షి, నిజామాబాద్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ రాజ్‌కుమార్ తీశాడు. అభినందనలు.