అబ్బాయిల్లోనే కాదు.. అమ్మాయిల్లో కూడా శాడిస్టులుంటారు. సైకో ప్రేమలుంటాయి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాలలో జరిగిన ఓ సంఘటన .. ‘ఓ సైకో ప్రేమ’ సినిమా కథకు తక్కువ కాకుండా ఉంది. ఇది తమిళుల కంటపడితే వెంటనే ఓ సైకో లవర్ పేరుతో సినిమా కూడా తీసేస్తారు కావొచ్చు. మనోళ్లు ప్రయోగాల జోలికి వెళ్లరు కదా. సరే.. అసలు కథలోకి.. కాదు కాదు ‘సైకో ప్రేమ కథ’లోకి వెళ్దాం.
ఆ సైకో ప్రేమికురాలి పేరు స్రవంతి. ఈ సైకో ప్రేమకు బలై బలవన్మరణం చెందిన వాడిపేరు సందీప్‌కుమార్. తన చెల్లెలి దోస్తులా పరిచయం పెంచుకుని ప్రేమ ముగ్గులోకి దింపింది స్రవంతి. టైం పాస్‌కే ప్రేమించిందో.. ఆట పట్టించేందుకు తెలియదు కానీ.. కొన్ని రోజులు ప్రేమ వ్యవహారం నడిపింది. ఆ తర్వాత తన సైకో బుద్ది బయటకు వచ్చింది. ఓ రెండు కొత్త నెంబర్లు తీసుకొని ‘మనీషా, కావ్య’ల పేర్లతో కొత్త నాటాకానికి తెరతీసింది. నేను ప్రేమిస్తున్నానంటే.. నేను ప్రేమిస్తున్నానని రోజూ సతాయింపులు. త్రిపాత్రాభినయాన్ని బాగా పండించింది. అందులో తన శాడిష్టు ఆనందాన్ని వెతుక్కుంది. ఈ సైకో ప్రేమికురాలికి పెళ్లైపోయింది.
అయినా మనోడిని విడవలేదు. అసలు పాత్ర స్రవంతిని కిల్ చేసి.. నకిలీ పాత్రలు మనీషా, కావ్యల వి మాత్రం తెరపై రోజూ రన్ చేసింది. చెవిన గూడు కట్టుకున్నట్టు.. ‘నన్ను ప్రేమించు..’ ‘నన్ను ప్రేమించు..’ రోజూ ఇదే పోరు. ‘నేను స్రవంతినే ప్రేమించాను. ఇంకెవర్నీ ప్రేమించలేను’ అని మన భగ్నప్రేమికుడు గడ్డం పెంచుకుని తిరిగాడు. ఈ డైలాగ్ వినేసరికి మన సైకో ప్రేమికురాలికి ఒక్కసారిగా మనస్సు లావాల ఎగిసిపడినట్టుంది. ‘అయ్యో ఇన్ని రోజులూ నిన్ను ఏడిపిస్తే.. నన్ను ఇంత సిన్సియర్‌గా ప్రేమించావా?’ అని అనుకున్నట్టుంది. మొగుడికి గుడ్ బై చెప్పి ఓ రోజు చక్కా వచ్చేసింది. ఇప్పుడు కొత్త ఆటకు తెరతీసింది. కొత్త పథకం రచించింది.
ఆ ఇద్దరూ నకిలీల నిత్య వేధింపుల డైలాగులను మార్చేసింది. ఆ నకిలీలు ఇక రోజూ.. ‘స్రవంతి మొగుడితో విడిపోయింది కదా.. పాపం ఆమెను చేసుకో’ అని బుజ్జగించసాగాయి. ఈ భగ్న ప్రేమికుడు గుండె భగ్గుమన్నది. ఇగో దెబ్బతిన్నది. ‘ఛస్.. అది నన్ను పెళ్లి చేసుకోకుండా.. నా ప్రేమను పట్టించుకోకుండా వేరొకడిని చేసుకుంది. ఇప్పుడు నేనెందుకు చేసుకోవాలి.. డోంట్ కేర్’ అన్నాడు. మన సైకో ప్రేమికురాలికి చిర్రెత్తుకొచ్చింది. సైకో కాస్తా ఇప్పుడు ‘డ్రకులా’ లా మారింది. ఇక రక్తం పీల్చడం మొదలుపెట్టింది తన రెండు నకిలీ పాత్రల మాటల ద్వారా. ‘చేసుకుంటావా? ఛస్తావా?’ అంటూ రోజు చావు బెదిరింపులతో భగ్న ప్రేమికుడికి కాలరాత్రే మిగిల్చింది. సైకో ప్రేమికురాలి టార్చర్‌ను తట్టుకోలేక… ఓ ఫైన్ మార్నింగ్ తను బలవన్మరణం పొందాడు. సైకో స్రవంతి మనస్సు శాంతించింది. ఇప్పుడు ఆ స్రవంతికి
మరో సందీప్ కావాలి.