రాష్ట్ర రాజకీయాల్లో నేతలంతా దళిత జపం చేస్తున్నారు. కేసీఆర్ దళితబంధు పథకం పేరెత్తుకోగానే కాంగ్రెస్ దీనికి కౌంటర్‌గా దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు నిర్వహిస్తూ.. ఆ మైలేజీ పూర్తిగా టీఆరెస్‌కు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే ఇంద్రవెల్లి, రావిర్యాలలో జరిగిన రెండు సభల్లో దళితుల పట్ల సీఎంకు చిత్త శుద్ధి లేదని రేవంత్ చెప్పే ప్రయత్నం చేశాడు. మరోవైపు దీన్ని కింది స్థాయి కార్యకర్తల వరకు తీసుకువెళ్లి, ప్రజల్లో తమదైన శైలిలో ప్రచారం చేసి కేసీఆర్ దళితబంధు పథక ఉద్దేశ్యానికి గండి కొట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది.
ఇందులో భాగంగానే ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ హైదరాబాద్‌లోని ఇందిర భవన్లో నిర్వహించిన నియోజకవర్గ సమన్వయ కర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి దళితబంధు పైనే సుధీర్ఘ చర్చలు చేశారు. ప్రతి ఒక్కరికి దళితబంధు ఇస్తానని ప్రకటించిన కేసీఆర్.. అందరికి ఇవ్వాలంటే రూ. 1.70 లక్షల కోట్లు అవసరం పడతాయానే విషయాన్ని హైలెట్ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చగలదా? ఇది అసాధ్యం.. దీన్నే జనాల్లోకి తీసుకువెళ్లి చైతన్యపర్చాలి అనేది కాంగ్రెస్ కొత్త వ్యూహరచన చేస్తున్నది.