ఒలంపిక్ క్రీడ‌ల్లో 130 కోట్ల మంది భార‌తీయులు స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసిన గోల్డ్‌మెడ‌ల్ విన్న‌ర్ నీర‌జ్ చోప్రా ఈ స్థాయికి రావ‌డానికి ఎన్నో అష్ట‌క‌ష్టాలు ప‌డ్డాడు. ఒక ద‌శ‌లో ఇక త‌ను ఆట‌ల‌కు ప‌నికిరాన‌ని డిసైడ‌య్యాడు. ప‌డిలేచిన కెర‌టంలా అనుకున్న ల‌క్ష్యం కోసం దూసుకెళ్లాడు. చివ‌ర‌కు గోల్ సాధించాడు. భార‌తావ‌ని త‌లెత్తుకొని నిల‌బ‌డి గోల్డ్‌మెడ‌ల్‌తో పాటు అంద‌రి మ‌న‌సుల‌ను గెలిచాడు.

జావెలిన్ త్రో విభాగంలో ఇండియ‌న్ అథ్లెట్ నీర‌జ్ చోప్రా (23) ఫైన‌ల్‌కు చేరుకుని బంగారు ప‌త‌క‌మే సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ఫైన‌ల్ మ్యాచ్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శించి మొద‌టి రౌండ్‌లో 87.03 మీట‌ర్లు, రెండ‌వ రౌండ్‌లో 87.58 మీట‌ర్లు, మూడ‌వ రౌండులో 76.79 మీట‌ర్ల దూరం విసిరాడు. ప్రారంభం నుంచే చోప్రా టాప్ వ‌న్‌లో కొన‌సాగుతూ వ‌చ్చాడు. చివ‌రి రౌండ్‌లో 84.24 మీట‌ర్ల దూరంలో విస‌ర‌గా నీర‌జ్ బంగారు ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఇండియాకు మొట్ట‌మొద‌టి గోల్డ్‌మెడ‌ల్ సిద్ధించింది. వందేళ్ల త‌ర్వాత అథ్లెటిక్స్ విభాగంలో భార‌త్‌కు బంగారు ప‌త‌కం రావ‌డంతో యావ‌త్ భార‌తావ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఈ కృషి వెనుక చోప్రా అలుపెర‌గ‌ని ప‌ట్టుద‌ల , సాధించి తీరాల‌నే అకుంఠిత దీక్ష ఉన్నాయి.

హ‌ర్యానా రాష్ట్రంలోని పానిప‌ట్ స‌మీపంలో ఖాంద్రా గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో చోప్రా జ‌న్మించాడు. 2012లో బాస్కెట్‌బాల్ ఆడుతుండగా నీరజ్ మణికట్టుకు గాయమైన సంద‌ర్భంలో ఇక తాను ఆటకు పనికిరానని అనుకున్నాడు. 2019 నీరజ్‌కు కలిసిరాలేదు. భుజానికి గాయం కావడంతో ఆడలేకపోయాడు. సర్జరీ తరువాత కొన్ని నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. గాయాల పాలవడం, మళ్లీ పైకి లేవడం నీరజ్‌కు కొత్తేం కాదు. ప‌డిలేచిన కెర‌టంలా అనుకున్న‌ది సాధించి చూపాడు నీర‌జ్ చోప్రా. అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నాడు. నేటి యువ‌త‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచాడు.

సుబేదార్‌కు స‌లాం…
నీర‌జ్ చోప్రా ఇండియ‌న్ ఆర్మీలో 2016 నుంచి సుబేదార్ (స‌ర్వీస్ నంబ‌ర్ జేసీ -471 869ఏ) గా సేవ‌లందిస్తున్నాడు. రాజ్‌పుత్‌నా రైఫిల్స్ విభాగంలో ఐదేండ్లుగా సుబేదార్‌గా దేశానికి సేవ‌లందించాడు. విశింత్ సేవా మెడ‌ల్‌ను కూడా అందుకున్నాడు.

 

 

 

 

You missed