పెళ్లి షాపింగ్ కోసం లక్షన్నర రూపాయలు కలిగిన బ్యాగ్‌ను తీసుకొని వస్తుండగా నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద బ్యాగు మాయమైనట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పెర్కిట్ గ్రామినికి చెందిన గంగామోహన్ కూతురి పెళ్లి ఈ నెల 25న నిశ్చయమైంది. పెళ్లి షాపింగ్ కోసం ఇద్దరు కూతుళ్లతో ద్విచక్ర వాహనం పై గురువారం ఒంటి గంట ప్రాంతంలో నగరంలోని జిల్లా కోర్టు చౌరస్తాకు చేరుకున్నారు.
అక్కడ బిచ్చగాళ్ల తాకిడి ఎక్కువగా ఉండటంతో జేబులో నుంచి పది రూపాయలు తీసి ఇచ్చి అక్కడి నుంచి సింధ్ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లి చూసుకోగా.. డబ్బులు కలిగిన బ్యాగు లేకపోవడంతో సిగ్నల్ వద్ద పడిపోయినట్లుగా అనుమానంతో అక్కడికి వెళ్లి విచారించారు. అక్కడ బిచ్చం అడుక్కుంటున్న మరి కొందరు ఆ బ్యాగు మీరు బిచ్చమేసిన బిచ్చగత్తే చేతిలో చూసినట్లుగా , బ్యాగు దొరకగానే పారిపోయినట్లుగా పేర్కొన్నారు.
దీంతో బాధితులు డయల్ 100కు కాల్ చేయగా పదిహేను నిమిషాల తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ స్థానికులు మాత్రం సంఘటన జరిగిన స్థలం వద్ద సీసీ కెమెరాలు ఉన్నట్లుగా అందులో వీడియో పుటేజ్ ద్వారా దొంగలించిన మహిళను పట్టుకోవచ్చని పేర్కొన్నారు. పోలీసుల చూపిస్తున్న అలసత్వంతో దొంగలు దొరుకుతారో లేరని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.