హుజురాబాద్ టికెట్‌పై టీఆరెస్‌లో ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇంకా అధిష్ఠానం వద్ద నాకంటే నాకు అని పడిగాపులు పడటం ఆపలేదు ఆ పార్టీ నాయకులు. కేసీఆర్‌ను ఓ వర్గం, కేటీఆర్‌ను మరో వర్గం ప్రసన్నం చేసుకోవడంలో బిజిబిజీగా ఉన్నారు. ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియకున్నా.. అన్ని అస్త్రాలను టీఆర్ఎస్ రెడీ చేసుకొని పెట్టుకున్నది.
అభ్యర్థి గెలుపు సునాయసమేననే అభిప్రాయం నెలకొనెలా వాతావరణం సెట్ చేసి పెడుతున్నాడు కేసీఆర్. టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టికెట్ దాదాపుగా ఖరారయ్యిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… కొత్తగా స్వర్గం రవి అనే టీఆరెస్ నాయకుడి పేరు వినిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆరెస్‌లో చేరిన ఈ రవిది కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామం. లోకల్ అనే బ్రాండ్ తనకు ఉండటంతో పాటు ఇతను కూడా బీసీ. పద్మశాలి కులస్తుడు. ఇప్పుడు కేసీఆర్ ఈ సీటును ఎలాగైనా బీసీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. దీంతో ఇది తనకు ఇవ్వాల్సిందిగా రవి కోరుతున్నాడు. పారిశ్రామికవేత్తగా ఎదిగి కోట్లకు పడగలెత్తిన రవి తనకు టికెట్ ఇస్తే ఈజీగా వంద కోట్ల వరకు ఖర్చు పెట్టుకోగలుగుతానని చెప్పుకుంటున్నాడట.
అధిష్టానం సైతం రవిపై కొంత ఆసక్తి చూపుతుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. గెల్లుకు టికెట్ ఇస్తే ప్రతీ పైసా తామె పెట్టాలె. ఇప్పటికే లీడర్ల కొనుగోళ్లు, కొత్త పథకాల హామీలు, పాత పథకాలకు పరుగులు పెట్టించేందుకు అదనపు బడ్జెట్.. ఇలా సర్కారు చేతి చమురు బాగానే వదిలింది. ఇప్పుడు అభ్యర్థికి కూడా పార్టే కోట్లు పెట్టాలా? వద్దు అనే భావనలో ఉంది. వంద కోట్లు పెట్టేందుకు రెడీ గా ఉన్న రవి కూడా చాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది… ఈ అంశంపై కూడా పెద్ద సారు సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.