మొన్న‌టి వ‌ర‌కు క‌రోనాతో బందైన సినిమా టాకీసులు ఇప్పుడు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికీ థియేట‌ర్లు తీయ‌డం లేద‌ని అనుకుంటున్నారు. క‌రోనా భ‌యం త‌గ్గి చాలా నెల‌లు అవుతున్న‌ది. జ‌నాలు సాధార‌ణ జీవ‌నస్థితికి వ‌చ్చేశారు. అంత‌టా అన్నీ ప‌నులు జ‌రుగుతున్నాయి. కానీ థియేట‌ర్లు మాత్రం తెరుచుకోవ‌డం లేదు. దీనికి కార‌ణం ఆంధ్ర సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డే. అదేంటీ.. థియేట‌ర్ల‌కు ఆయ‌న‌కు సంబంధ‌మేంది? అనుకుంటున్నారా? అక్క‌డ రాజ‌కీయ స‌మీక‌ర‌ణ, పంతం, ప‌ట్టింపులు సినీ ఇండ‌స్ట్రీ కొంప‌ముంచాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఏర్ప‌డిన రాజ‌కీయ విభేదాలు వ‌కీల్‌సాబ్‌తో ముదిరి పాకాన ప‌డ్డాయి. దీంతో జ‌గ‌మొండి అయిన జ‌గ‌న్ థియేట‌ర్ల టికెట్ రేట్ల పంజా విసిరాడు. కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ధ‌ర‌ల‌న్నీ మినిమం రేట్లుగా మార్చేశాడు. అత్య‌ధిక టికెట్ ధ‌ర రూ. 70, అత్య‌ల్పంగా రూ. 20గా ధ‌ర నిర్ధారించాడు. ఈ దెబ్బ‌తో సినీ ఇండ‌స్ట్రీకి ఉరి పెట్టినంత ప‌నైంది. ఇప్ప‌టికే క‌రోనా కోలుకోనియ్య‌కుండా దెబ్బ కొడితే జ‌గ‌న్ ఈ ర‌కంగా అంత‌కు రెట్టింపు దెబ్బ తీశాడ‌ని సినీ పెద్ద‌లు గగ్గోలు పెడుతున్నారు. వంద‌ల కోట్లు వెచ్చించి సినిమాలు తీస్తే ఈ ధ‌ర‌ల‌తో ఎట్లా గ‌ట్టెక్కేదీ? క‌చ్చితంగా దివాలా తీయాల్సిందే. ఈ విష‌యం జ‌గ‌న్‌కూ తెలుసు. కానీ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. దీంతో కొత్త సినిమాలు రావ‌డం ఆగిపోయింది. కోట్లు పెట్టి సినిమాలు తీయాల‌న్న కోరిక‌ను ఆదిలోనే తుంచేసుకుంటున్నారు నిర్మాత‌లు. అక్క‌డ థియేటర్ల బంద్ కొన‌సాగుతున్న‌ది.

తెలంగాణ‌లో రేప‌టి నుంచి థియేట‌ర్లు తెరుచుకోనున్నాయి. కానీ సినిమాల్లేవు. ఉన్నా అవి చిన్నాచిత‌క‌వే. దీంతో అన్ని థియేట‌ర్లు తెరుచుకోవ‌డం లేదు. ఇక్క‌డ రేట్ల స‌మ‌స్య లేదు. 110, 80, 50 రేట్ల‌ను తీసుకుంటున్నారు. కేటీఆర్ పార్కింగ్‌కు 30, 20, 10 టికెట్ వ‌సూలు చేసుకోవ‌చ్చ‌ని ప‌ర్మిష‌న్ కూడా ఇచ్చాడు. అంత బాగానే ఉంది. సినిమాలు తీసేవారు లేరు.. కొత్త భారీ సినిమాలు ఇప్ప‌ట్లో వ‌చ్చేట‌ట్టూ లేవు. దీంతో అర‌కొర సినిమాలు, అర‌కొర జ‌నం, అర‌కొర ఆదాయంతో తెలంగాణ థియేట‌ర్లు నెట్టుకురానున్నాయి. ఇష్క్‌, తిమ్మ‌రుసు త‌ప్ప పెద్ద సినిమాలు లేవు.

 

రాజ‌మౌళీ త్రిపుల్ ఆర్ సినిమా ఇక ఇప్ప‌ట్లో రాదు. ఆంధ్ర‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారాలి. జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని మార్చుకోవాలి. కొత్త సినిమాలు తీయాలి. అప్పుడు మార్కెట్లోకి అవి రావాలి. అప్ప‌టి దాకా ఓటీటే దిక్కు. సినీ ఇండ‌స్ట్రీకి లేదు ఏ దిక్కు.