Defend against viral diseases with an adequate defensive system. 3D Rendering

ఫైనాన్షియ‌ల్ ఎమ‌ర్జెన్సీ! ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి! భార‌త రాజ్యాంగంలో ఉండి, ఇప్ప‌టిదాకా అమ‌లు కానీ ఒక ముఖ్య‌మైన నిబంధ‌న‌. దేశం మొత్తంలో కానీ లేదా ఒక‌టో రెండో రాష్ట్రాల్లో గానీ అవ‌స‌ర‌మైతే ప్ర‌యోగించే అవ‌కాశం రాజ్యాంగం ప్ర‌కారం ఉంది. భార‌త‌దేశంలో మొత్తంగా కానీ లేదా ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డిందా? అయి తే దానికి కార‌ణం ఏ పార్టీ? ఏ నాయ‌కుడు? ఈ పుండు ఇప్పుడే పుట్టిందా? లేదా చాలా కాలం క్రితం మొద‌లై నానాటికీ పుచ్చిపోతూ ఇప్పుడు కాలు తీసేయాల్సిన గాంగ్రీన్ ఆప‌రేష‌న్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందా? అనేది రాజ‌కీయ చ‌ర్చ‌. దీని విష‌యంలో ఎవ‌రి అభిప్రాయాలు వారికుంటాయి. రాజ‌కీయ రొచ్చు వ‌ద్దుకానీ… ఒక‌వేళ ఇలాంటి స్థితి ఉత్ప‌న్నం అయితే ఏమి జ‌రుగుతుంది?
ఇలాంటి ఎమెర్జెన్సీ విధిస్తే ప్ర‌ధానంగా న‌ష్ట‌పోయేది ప్ర‌భుత్వ ఉద్యోగులు. వారి జీతాల్లో భారీ కోత విధించ‌వ‌చ్చు. నిర‌స‌న తెలిపే అవ‌కాశం, స‌మ్మె చేసే హ‌క్కు ఉండ‌దు. పెన్ష‌న‌ర్లు కూడా న‌ష్ట‌పోవ‌చ్చు. సంక్షేమ ప‌థ‌కాల్లో భారీ కోత విధించ‌వ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్త‌కూడ‌దు అని ఆశిద్దాం. మ‌రెందుకీ ప్ర‌స్తావ‌న‌? క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచంలోని అన్ని అనేక దేశాల ఆర్థిక స్థితి దారుణంగా దెబ్బ‌తిన్న‌ది. మ‌న దేశం దీనికి మిన‌హాయింపు కాదు. ఒక‌టో లాక్‌డౌన్‌కే మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ బాగా దెబ్బ‌తిన్న‌ది. ఇక రెండో వేవ్‌లో ల‌క్ష‌ల కుటుంబాల ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యార‌య్యింది. దీనికి తోడు రెండో లాక్‌డౌన్‌. ఆర్థిక వ్య‌వ‌స్థ ప్రాథ‌మిక సూత్రాలు చాలా మందికి అర్థం కావు. ప్ర‌భుత్వాల ద‌గ్గ‌ర కామ‌ధేనువో, క‌ల్ప వ్రుక్ష‌మో ఉంద‌ని చాలా మంది అనుకుంటారు. ప్ర‌జ‌ల ఆర్థిక స్థితి బాగాలేన‌ప్పుడు ప్ర‌భుత్వాల ఆదాయం ప‌డిపోతుంది. ఇప్పుడు ఇదే స్థితి దేశంలో ఉంది. దీనికి తోడు కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోవ‌డం, ఆదాయానికి మించి సంక్షేమం పేరుతో ఖ‌ర్చుచేయ‌డం.
సంక్షేమం అవ‌స‌ర‌మే. కానీ ప‌రిమితి దాటి ఖ‌ర్చులు చేయ‌డం మొద‌లుపెడితే? ఒక ప‌క్క ఆదాయం త‌గ్గిపోతున్న‌ది. మ‌రోప‌క్క ఖ‌ర్చులు పెరిగిపోతున్నాయి. ఇది నేటి స్థితి. నిజానికి ఇది ఇప్పుడు పుట్టిన పుండు కాదు. ఎప్ప‌టి నుంచో ఇంతింతై వ‌టుడింతై అని పెరుగుతూ వ‌స్తున్న‌ది. కార‌ణం ఎవ‌రు? ప్ర‌జ‌లే! నాకేంటి అనుకునే మ‌న‌స్త‌త్వం. కొన్నేళ్ల క్రితం మాట‌. టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఓ మిత్రుడు చెప్పిన మాట‌.ప్ర‌భుత్వ టీచ‌ర్లు కూడా (అంద‌రూ కాదులెండి… క‌నీసం కొంతమంది) ఓటు వెయ్య‌డం కోసం డ‌బ్బు అడుగుతారు. డ‌బ్బిచ్చిన వాడికే ఓటు. ఒక్క ఓటుకు ఐదు నుంచి ప‌దివేలు ఖ‌ర్చుపెట్టి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన వారు ఏమి చేస్తారు? ప్ర‌జాసేవ చెస్తార‌నుకోవ‌డం అమాయ‌క‌త్వ‌మ‌వుతుంది. ఖ‌ర్చు పెట్టిన డ‌బ్బుకు మూడింత‌లు వసూలు చెయ్య‌టానికి ప్ర‌ణాళిక‌లు వేస్తారు. ఒక అధికారిని ఒక పోస్టులో నియ‌మించేట‌ప్పుడు లంచం తీసుకుని పోస్టింగ్ ఇస్తాడు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి. డ‌బ్బిచ్చి పోస్టింగ్ పొందిన అధికారి తొలిరోజు నుంచే వ‌సూలు చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. ప్ర‌తి ప‌నికీ ఓ రేటు. దానికో వ్య‌వ‌స్థ‌. ఎవ‌డికీ మిన‌హాయింపు లేదు. ఉండ‌దు. కోటి ఇచ్చి ఈ పోస్టు పొందిన‌..ఇందులో నేను ఉండేది మ‌హా అంటే రెండేళ్లు.. ఈ లోగా సంపాదించుకోవ‌ద్దా? అని స‌మాధానం. వ‌సూలు మ‌హా వ్య‌వ‌స్థ‌. కంటికి కనిపించ‌ని విశ్వ‌రూపం దీనిది. ఇలాంటిది ఉంద‌ని తెలిసిన వారు, దీనిలో భాగ‌స్వాములు దీన్ని ఎరుగ‌న‌ట్టే న‌టిస్తారు. మ‌హాన‌ట‌న‌. చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే…? అధికారి ఎందుకు లంచం తీసుకున్నాడు? స్థానిక నాయ‌కుడికి లంచం ఇచ్చి పోస్టు సంపాదించుకున్నాడు క‌నుక‌. స్థానిక నాయ‌కా! ఎందుకిలా? అంటే… ప్ర‌జ‌ల‌కు డ‌బ్బిచ్చి గెలిచాను క‌నుక‌. అంటే ఆది, అంతం ప్ర‌జ‌లే. ఎన్నిక‌ల‌ప్పుడు ఐదువేలు నేరుగా పొంది… అయిదు సంవ‌త్స‌రాలు ప‌రోక్షంగా అంత‌కు ప‌దిరెట్లు లంచాల రూపంలో, ప‌న్నుల రూపంలో క‌ట్ట‌డ‌మే నేటి సామాన్యుడి ప‌రిస్థితి. ఇది అర్థం కాదు. అర్థం అయినా ఏమీ చేయ‌లేని స్థితి.
దీనికి తోడు ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే అధికార పార్టీలు మితిమీరిన హామిలిస్తాయి. అలా ఇస్తేనే గెలుస్తాయి. ఒక‌పార్టీ ఒక హామీ ఇస్తే దానికి పోటీగా మ‌రోపార్టీ రెండు హామీలిస్తుంది. త‌మిళ‌నాడులో రెండు పార్టీల మ‌ధ్య గెలుపు ఓట‌ములు చావుబ‌తుకు స‌మ‌స్య‌గా వున్న‌కాలంలో ఇది మొద‌ల‌య్యింది. క్ర‌మేపీ అన్ని ప్రాంతాల‌కు, అన్ని పార్టీల‌కు విస్త‌రించింది. ఎవ‌రు ఎక్కువ‌? ఎవ‌రు త‌క్కువ‌? అనేకానీ ఎవ‌రూ మిన‌హాయింపు కారు. కులం, మ‌తం, ప్రాంతం.. వీటి ఆధారంగా ఉద్రేకాలు రెచ్చ‌గొట్టడం.. మితిమీరిన ఖ‌ర్చు.. ఎన్నిక‌ల హామీలు.. ఎలాగో ఒక‌లాగ నెట్టుకుంటూ వ‌చ్చింది వ్య‌వ‌స్థ ఇన్నాళ్లు. ఇప్పుడు బోడిగుండుపై స‌మ్మెట‌పోటులాగా క‌రోనా సంక్షోభం.

ఈ సంక్షోభ స‌మ‌యంలోనైనా రాజ‌కీయ పార్టీలు, నాయ‌కులు క‌నీసం రెండు సంవ‌త్స‌రాలు రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను నిల‌బెట్ట‌డంపై ద్రుష్టి పెట్టాలి. కానీ క‌నుచూపు మేర‌లో ఇలాంటి అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. క‌నీసం ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న రావాలి. లేక‌పోతే ఆర్థిక నావ‌కు ప‌డ్డ చిల్లు మ‌న‌ల్ని ముంచేస్తుంది. ఇలా జ‌ర‌గ‌క‌పోతే.. ఇప్ప‌టికైనా మేలుకోక‌పోతే…
కులాల‌కు, మ‌తాల‌కు, ప్రాంతాల‌కు , పార్టీల‌కు అతీతంగా అంద‌రూ మున‌గ‌డం ఖాయం

(అమ‌ర్‌నాథ్ వాసిరెడ్డి)

You missed