సెటిల్మెంట్లు, దందాలే కాదు… ఆ నకిలీ డీఎస్పీ అవతారం వెనుక మరో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీస్ యూనిఫాం అడ్డు పెట్టుకుని ఆర్థిక నేరగానిగా, అక్రమార్కునిగా అవతారమెత్తిన ఈ నకిలీ ఖాకీ ఏడుగురు అమ్మాయిలను చెరబట్టి వారి జీవితాలతో ఆడుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్లు తెలిసింది. కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన నెల్లూర్ స్వామి కొంత కాలంగా పోలీస్ అధికారి అవతారం ఎత్తాడు. డీఎస్పీ ఉద్యోగం చేస్తున్నట్లు బీబీపేట ప్రాంత ప్రజలను నమ్మించాడు. హైదరాబాద్‌లో మకాం పెట్టి అప్పుడప్పడు కారులో తుజాల్‌పూర్‌కు వచ్చేవాడు. ఇక్కడ దోస్తులతో విందు, వినోదాల్లో పాల్గొంటు సెటిల్మెంట్లకు తెరలేపాడు. ఇసుక వ్యవహరంలో తలదూర్చడం, టీఎస్పీఎస్సీలో అంతా తనకు తెలిసిన వారున్నారని నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట్, మెదక్, కరీంనగర్ తదితర జిల్లాల్లో నిరుద్యోగుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేశాడు. కొందరు బాధితులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ నకిలీ ఖాకీ గుట్టు రట్టయింది. బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇంటర్మీడియట్ కూడా పాస్ కానీ స్వామీ పోలీస్ అవతారం ఎత్తితే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చునని ఈ దొంగ వేశానికి దిగాడు. అయితే పోలీసునని నమ్మించి ఇప్పటి వరకు ఏడుగురిని వంచించి పెళ్లిళ్ళు చేసుకున్నట్లు తెలిసింది. ఒకరిని చేసుకున్న తర్వాత డబ్బు, నగలు అంతా గుంజి, వారి నుంచి వీడిపోయి మరొకరిని బుట్టలో వేసుకుని కొత్తగా పెళ్లి నాటకం ఆడేవాడు. మళ్లీ ఇక్కడా అదే తంతు. అలా నిత్య పెళ్లి కొడుకు అవతారం కూడా ఎత్తాడు. ఈ దొంగ పోలీస్ లీలలు ఇంకా ఏమేమి ఉన్నాయో వెలికి తీసే పనిలో పోలీసులు సీరియస్‌గానే ఉన్నారటా. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడికి ఈ స్వామి సమీప బంధువు అవుతాడని తెలిసింది.