కరోనా వేళ తీసుకున్న అప్పులు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఉపాధి లేక అప్పులు చేస్తే చివరికి అదే అతని ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకున్నది. నాందేవ్‌వాడకు చెందిన నాగరాజు … శ్రీనివాస్ అనే అతని వద్ద 1.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అవి సమయానికి తీర్చలేదు. అప్పు తీర్చమని ఒత్తిడి పెంచసాగాడు. బుధవారం లక్ష్మీనారాయణ అతన్ని వెంటబెట్టుకొని నాగరాజు ఇంటికి వచ్చాడు శ్రీనివాస్. ఈ రోజు కచ్చితంగా నా అప్పు తీర్చాల్సిందేనని ఇంటి గడప వద్ద కూర్చున్నారు. గలాటా చేశారు. చుట్టుపక్కల వారు చూస్తున్నారని ఎంత మొత్తుకున్నా వినలేదు. ఇస్తారా? లేదా? అని గట్టిగా అరవడంతో … నాగరాజు భార్య అవమాన భారంతో వెంటనే తన మెడలోని పుస్తెల తాడుని తీసిచ్చింది. వారు వద్దనలేదు. చటుక్కున దాన్ని లాక్కుని .. మీరు అప్పు తీర్చేవరకు ఇది మా దగ్గరే ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
తన భార్య మెడలోని పుస్తెలతాడు తీసివ్వడంతో నాగరాజుకు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అవమానభారంతో వెంటనే పక్కగదిలోకి వెళ్లి డోర్ వేసుకొని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దర్వాజాను ఎంత బాదినా అది తెరుచుకోకపోవడంతో ఇంటి ఓనర్‌కు విషయం చెప్పింది. ఓనర్ గడ్డపారతో తలుపులు పగలగొట్టాడు. అప్పటికే నాగరాజు చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న నాగరాజు అత్తగారి తరపు బంధువులు మూడోటౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. సత్వరం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరిద్దరిపై టౌన్ ఎస్సై సంతోష్ 306 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. ఇద్దరు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామన్నాడు.