నమ్మేవాళ్లుంటే మోసం చేసేవాళ్లు పుడుతూనే ఉంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే మార్గంలో ఇది ముందు వరుసలో ఉంది. భక్తి, ఆథ్యాత్మికం ముసుగులో దొంగబాబాలు చెలరేగిపోతున్నారు. అసలు దొంగబాబాలు, మంచి బాబాలు అని కాదు. ఏ బాబాలను నమ్మకుండా ఎవరి పరిధిలో వారు భక్తిని పరిమితం చేసుకుంటే ఈ బాధలుండవు. ఈ మోసాలూ జరగవు.
టీవీల్లో ప్రవచనాలు చూస్తే నష్టం లేదు. ఓకే. కానీ వాళ్లను వెళ్లి కలుద్దాం.. ఏమో జరుగుతుంది? ఆరోగ్యాలు బాగుపడతాయి. ఐశ్వర్యాలు వస్తాయి. భక్తి పేర ఆలోచనలు ఇలా వెర్రితలలు వేస్తే ఇలాగే ఇతరుల చేతిలో ఈజీగా మోసపోతారు. వీరే ఈ మోసగాళ్లకు పెట్టుబడి. ఈజీగా వారి మాటల్లో పడిపోతారు. అడిగింది ఇస్తారు. ఇంత మూఢభక్తి ఎంతటి నష్టాన్ని కష్టాన్ని మిగుల్చుతుందో తెలుసుకోరు. తెలుసుకునే లోపు నష్టం జరిగిపోతుంది. జరిగినా.. తేరుకొని, మేలుకుంటారా? అంటే అదీ ఉండదు. ఇంకో అసలైన బాబా రాకపోతాడా? మా బాధలు తీర్చకపోతాడా? ఎదురుచూస్తావుంటారు. అన్వేషిస్తూ ఉంటారు. మరోసారి మోసపోవడానికి. టెక్నాలజీ ఇంత పెరిగింది. అయినా ఇంకా ఈ బాబాల బాగోతాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి.
గతంలో పోల్చితే చాలా తగ్గాయి. కానీ ఇంకా అవి బతికే ఉన్నాయనడానికి ఇగో ఇలాంటి సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. పల్లె జనం అమాయకంగా నమ్ముతున్నారనుకోవడానికి లేదు. పట్న వాసులు, విద్యావంతులు కూడా ఈ మూఢ నమ్మకాలని ఆశ్రయిస్తున్నారు. అందుకే ఆశ్రమాల బాబాల కోసం అన్వేషిస్తున్నారు. వెతికి మరీ పట్టుకుని కాళ్లపై సాష్టాంగపడుతున్నారు. జీవితం ధన్యమైపోయిందని.. అడిగినవన్నీ ఇచ్చేస్తున్నారు.