సెప్టెంబ‌ర్ 17. విలీన‌మా..? విద్రోహ‌మా..? విమోచ‌నా..?? ఇదెప్ప‌టికీ అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌. ఒక్కొక్క‌రు ఒక్కోలా దీన్ని అభివ‌ర్ణించుకుంటారు. ఎవ‌రి అవ‌స‌రాలు వారివి. కానీ బీజేపీ తొలిసారిగా ఈ తేదీని విమోచ‌న దినంగా అధికారికంగా నిర్వ‌హించాల‌ని యోచించ‌డం.. అందుకు అన్ని ఏర్పాట్లు చేయ‌డంతో టీఆరెస్‌, ఎంఐఎం పార్టీలు దిగిరాక త‌ప్ప‌లేదు. ఏకంగా అస‌దొద్దీన్ ఓవైసీ తొలిసారిగా నిజాంది నిరంకుశ పాల‌న అని ఒప్పుకున్నాడు.దీన్ని విమోచ‌న దినంగా కాకుండా జాతీయ స‌మైక్య‌త దినంగా పాటించాల‌ని కోరాడు. దీంతో పాటు సీఎం కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పాడు. 17, 18, 19 తేదీల్లో జాతీయ స‌మైక్యత దినంగా పాటించాల‌ని ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

ఉద్య‌మ స‌మ‌యంలో ఇదే కేసీఆర్ ఎందుకు…. ఏపీ ప్ర‌భుత్వం సెప్టెంబ‌ర్ 17ను తెలంగాణ విమోచ‌న దినంగా పాటించ‌దు ..? అని ప్ర‌శ్నించాడు. తెలంగాణ వ‌స్తే త‌ప్ప‌కుండా అధికారంగా విమోచ‌న దినంగా దీన్ని పాటిస్తామ‌ని కూడా చెప్పాడు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాట మార్చాడు. ఎంఐఎంతో దోస్తీ అవ‌స‌రంగా కాగా.. సుస్థిర ప్ర‌భుత్వం పేరుతో కేసీఆర్ త‌న పాత మాట‌ను మార్చేశాడు. ఇప్పుడు బీజేపీ పుంజుకుంటుంది. ఎక్క‌డిక‌క్క‌డ టీఆరెస్‌ను క‌ట్ట‌డి చేస్తోంది. ఎంఐఎం దోస్తానాను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటుంది. సెప్టెంబ‌ర్ 17ను అధికారంగా నిర్వ‌హిచేందుకు స‌ర్వ శ‌క్తులు ఇక్క‌డ మోహ‌రించింది. దీంతో కేసీఆర్ , ఓవైసీ దిగిరాక త‌ప్ప‌లేదు.