ఘర్ ఘర్కు జెండా … అనే నినాదం మోదీ ఇచ్చింది. వజ్రోత్సవ జెండా పండుగ వేడుకలు దేశ వ్యాప్తంగా చేపట్టేందుకు కేంద్రం … బీజేపీ ముందు వరసలో ఉంది. కానీ ఈసారి టీఆరెస్ తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నది. దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదు.. మేమేం తక్కువా కాదు.. అని కేసీఆర్ దీనిపై గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడు. మంత్రులను, ఎమ్మెల్యేలను, జిల్లా యంత్రాంగాన్ని రంగంలోకి దించాడు. సందర్భం కూడా మంచిగా కలిసొచ్చింది కేసీఆర్కు.
బీజేపీ పై సమరశంఖం పూర్తిస్తున్న ఈ ప్రస్తుత తరుణంలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఏ అవకాశాన్నీ చేజార్చుకోవడం లేదు. ఊరేగింపులు, టెన్ కే రన్లు… మొక్కలు నాటే కార్యక్రమం… అన్నింటినీ ముందు వరుసలో పోటీలు పడి చేస్తున్నది టీఆరెస్. ఓ దశలో బీజేపీ శ్రేణులే అవాక్కయ్యేలా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు లోకల్ లీడర్లు… పార్టీ క్యాడర్ అంతా. ఈసారి జెండా పండుగ ఘనంగా జరుగుతున్నది. ఎక్కడ చూసినా మువ్వన్నెల రెపరెపలు గమ్మత్తుగా కనిపిస్తున్నాయి. దేశభక్తి భావాన్ని పెంచుతున్నాయి. ఈ జెండా పండుగ క్రెడిట్ కోసం బీజేపీని ఓవర్టేక్ చేసింది ఇక్కడ టీఆరెస్.