ఎస్వీ క్రిష్టారెడ్డి… ఓ మంచి దర్శకుడు. దర్శకుడే కాదు. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం… అన్నీ తానైతాడు. విజయ తీరాలకు సినిమాను తీసుకెళ్తాడు. కడుపుబ్బా నవ్వించే కామెడీ. వీనుల విందైన సంగీతం. ఎక్కడా అసభ్యతకు తావులేని సీన్లు, డైలాగులు. అచ్చంగా ఓ మంచి సినిమా. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఆయన దర్శకత్వంలో వచ్చేవి. కే అచ్చిరెడ్డి, ఎస్వీ క్రిష్టారెడ్డి కాంబినేషన్‌లో ఎన్నో మంచి సినిమాలు. యమలీల, రాజేంద్రుడు-గజేంద్రుడు, శుభలగ్నం, నెంబర్ వన్, మావి చిగురు, ఎగిరే పావురమా… లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలెన్నో తీసిన ఎస్వీ.. పెద్ద హీరోలతోనూ హిట్‌లు సాధించాడు. బాలక్రిష్టతో టాప్ హీరో, నాగార్జునతో వజ్రం.. క్రిష్ణతో నెంబర్ వన్ లాంటి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది.
మారుతున్న ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో విఫలమయ్యాడో.. తనకు ఈ కొత్త ట్రెండ్ సాధ్యం కాదనుకున్నాడో సినిమాలకు దూరమయ్యాడు. చాలా గ్యాప్ తర్వాత తన యమలీల సినిమాను మళ్లీ తీశాడు కథ మార్చి. కొత్త హీరోతో. ఘోరంగా విఫలమయ్యాడు. అసలు అది ఎస్వీ మార్క్ సినిమానేనా..? అనే రీతిలో పల్టీకొట్టాడు. ఆ పై ఇక కనిపించలేదు. ఏవో సినిమా ఫంక్షన్లలో అప్పడప్పుడూ అలా కనిపించేవాడు. కానీ మనిషి మారలేదు. అలాగే ఉన్నాడు. నిబ్బరంగా , నిలకడగా. ఓపికగా. తనూ ఓ దశలో హీరో అవుదామనే ఉగాది, అభిషేకం సినిమాల్లో నటించి తనకు అది అచ్చిరాదనే డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు చా…లా రోజుల తర్వాత ఆర్గానిక్ మామ- హై బ్రీడ్ అల్లుడు సినిమాతో మళ్లీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడు. మళ్లీ అన్నీ తనే. కథ, సంగీతం, స్క్రీన్ ప్లే, మాటలు…. మరి మారిన నేటి తరం ప్రేక్షకుల నాడి పట్టుకున్నాడా..? నిలబడతాడా..? పడిపోతాడా..? చూడాలి.