కురుక్షేత్రంలో కౌరవులకు, పాండవులకు మధ్య భీకర యుద్దం నడుస్తున్నది. గంగ పుత్రుడు భీష్ముని అనంతరం సైన్యాధ్యక్ష పదవిని చేపట్టిన కర్ణుడికి రథ సారథ్యం వహించమని ధుర్యోధనుడు తనకు మామ వరుసైన శల్యుడిని కోరుతాడు. రథ సారథ్యంలో ఆరితేరిన శల్యుడు మొదట్లో శూద్రుడైన కర్ణుడికి సారథ్యం వహించడానికి తిరస్కరిస్తాడు. కానీ, అతి కష్టంపై దుర్యోధనుడు శల్యుడిని సారథ్యం వహించడానికి మెప్పించి ఒప్పిస్తాడు. అసలే దాన వీర శూరుడైన కర్ణుడికి శల్యుడు సారథ్యం వహిస్తే కొంప మునుగుతుందని పాండవుల శిబిరంలో గుబులుపుడుతుంది. శ్రీ కృష్టుడి సూచనల మేరకు పాండవులు రహస్యంగా శల్యుడిని కలుస్తారు. రథ సారథ్యం వహించడానికి తనకు ఇష్టం లేకపోయినా.. ప్రత్యేక పరిస్థితులలో తాను ఒప్పుకోవాల్సి వచ్చిందని శల్యుడు పాండవులతో వాపోతాడు. అప్పుడు పాండవులు వీరు మాట తప్పాల్సిన అవసరం లేదు.. కానీ కర్ణుడికి రథ సారథ్యం వహిస్తూనే తమకు మేలు చేసేలా చూడమని చెబుతాడు. ఇక ఆ తర్వాత కథ తెలిసిందే. రథం నడిపే శల్యుడు కర్ణుడి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా , అర్జునుడు, కృష్ణుడి ప్రతాపం ముందు నువ్వెంత, నీ బతుకెంత అని మానసికంగా దెబ్బ తీసేలా మాట్లాడటం, ఒక చోట రథ చక్రాలను బురదలో ఇరికించే ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత అర్జునుడు కర్ణుడిని హతమార్చడం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌లో కూడా యదాతథ పరిస్థితి కొనసాగుతోంది.
ఒక వైపు యుద్దం ముంచుకొస్తున్న సమయంలో.. కదనరంగంలో దూకాల్సిన కాంగ్రెస్ రథ సారథులు శల్య సారథ్యం వహిస్తున్నారు. పార్టీలో ఉంటూనే పార్టీని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. సీనియర్లం… విధేయులమంటూనే తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. శత్రువులతో చేతులు కలుపుతున్నారు. మన ఊరు – మన పోరు కాస్త….. మన పార్టీ- ఇంటి పోరుగా అన్న తీరుగా తయారయిపోయింది. శత్రువులతో పోరాటం చేయడమోమో కానీ .. వీళ్ల అంతర్గత పోరాటానికే సమయం సరిపోవడం లేదు. ఇది ఇవ్వాళ కొత్తగా వచ్చిన సంస్కృతి కాదు. అనాధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంస్కృతి. ఈ విష సంస్కృతి మరింత మితిమీరిపోయి కాంగ్రెస్‌ను కార్చిచ్చులా కమ్మేస్తున్నది.
అంతో కొంతో ప్రజాధరణ ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లాంటి నాయకులు కూడా ప్రతిపక్షాలతో పోరాటం చేయకుండా.. తమ పార్టీతోనే పోరాడుతాం.. తేల్చుకుంటామని అంటున్నాడు. చివరకు పార్టీనే తన పైన అభ్యర్థిని నిలిపి గెలిపించుకోవాలని సవాలు విసురుతుండడం కలకలం సృష్టిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నాయకత్వ సమస్యతో, అంతర్గత పోరుతో ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఎవరైతే పార్టీకి వెన్నంటి నిలవాలో వాళ్లే వెన్నుపోటు పొడవడం సాధారణంగా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మొదలుకొని జానారెడ్డి, నేటి జగ్గారెడ్డి, పొన్నాల వరకు వ్యక్తిగత ప్రాపకం కోసం పని చేసిన వాళ్లే కానీ, పార్టీని ఏనాడూ భుజాన మోసిన దాఖలాలు లేవని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది. ఒక దశలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు తన ఒక్క నియోజకవర్గం తప్ప .. మిగిలిన ఏ నియోజకవర్గంలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఏనాడూ ప్రయత్నం చేయలేదని ప్రచారంలో ఉంది. ఎన్నికల ఫలితాలు కూడా దానికి అద్దం పట్టాయి. అప్పుడు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు చాలా మంది పార్టీలో శల్య సారథ్యం వహించారనేది కళ్ల ముందున్న దృశ్యాలు.
ఇక రేవంత్‌రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏకకాలంలో టీఆరెస్, బీజేపీపై యుద్దం ప్రకటించి ఉత్సాహంగా ముందుకు కదులుతున్నాడన్న తరుణంలో శల్య సారథుల సమస్య మళ్లీ తెరమీదకు వచ్చింది. రేవంత్‌రెడ్డి తమను విస్మరిస్తున్నాడని, ఒంటెత్తు పోకడ పోతున్నాడని, వ్యక్తిగత నాయకత్వాన్ని బలపర్చుకుంటున్నాడని, పార్టీని కలుపుకుని పోవడం లేదని సీనియర్లు తిరగబడుతున్నారు. తాడో పేడో తేల్చుకుంటామని తెగబడుతున్నారు. విధేయులమంటూనే పక్కలో బల్లెంలో మారుతున్నారు. జగ్గారెడ్డి ఒక దశలో పార్టీకి రాజీనామా చేయడం ఖరారైంది. కానీ శత్రు శిబిరం నుంచి వచ్చిన సంకేతాలతో ఆయన వ్యూహాత్మకంగానే వెనుకడుగు వేసినట్టు ప్రచారం. హరీశ్‌రావును వీహెచ్ రహస్యంగా కలవడం , ఆయనను జగ్గారెడ్డి సమర్థించడం సంచలనం సృష్టించింది.
ఈ యువ నాయకులు, సీనియర్ నాయకులు రెండుగా చీలిపోయారు. యువ నాయకత్వం రేవంత్ రెడ్డి వైపు, సీనియర్లు రేవంత్ వ్యతిరేకవర్గంగా విడిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు పార్టీ గురించి మంచిగా మాట్లాడతారో.. ఎప్పుడు ద్వజమెత్తుతారో ఎవరికీ అర్థం కాదు. పార్టీ ని వీడుతామంటారు. పార్టీని వీడబోమని మరోసారి ప్రకటిస్తారు. తికమక పెట్టడంలో వాళ్ల ను మించిన వారు లేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్లడం ఖాయమని ఆయన్నే ప్రకటించుకున్నాడు. కానీ ఆయన వెళ్లడు. ఎప్పుడు వెళ్తాడో చెప్పాడు. ఎందుకు పార్టీ మారుతాడో చెప్పడు. కానీ పార్టీలో గందరగోళ వాతావరణం సృష్టిస్తాడు. సీనియర్లు పార్టీని వదలరు. పార్టీని బాగు పడనివ్వరు. అని యువ కార్యకర్తలు, నాయకులు అసహనంతో రగలిపోతున్నారు.
పార్టీలో ఉంటూనే, పార్టీలో కీలక పదువుల అనుభవిస్తూనే శల్యుడి మాదిరిగా పార్టీ రథాన్ని రాచబాటలో కాకుండా వంకరటింకర బండిబాటలో నడుపడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని బలహీన పర్చడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏ నాయకుడైనా వ్యక్తిగతంగా తమతో బాగుండాలి కానీ ప్రజాభిమానం పొందడానికి వీలు లేదు. తాము బాగుంటే పార్టీ బాగున్నట్టు వాళ్ల భావన. తమకు అందలం ఎక్కియ్యాలి… పెద్దపీట వేయాలి.. అంతే తప్ప వీరికి మరో ఆలోచన ఉండదు. ఒకవైపు అత్యంత బలమైన అధికార పార్టీని ఎదుర్కోవాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న శక్తి సరిపోదు. బలమైన నాయకత్వంలో నాయకులందరూ ఏకతాటిపై ముందుకురికితే తప్ప అధికార పార్టీని ఎదురించే పరిస్థితి లేదు. రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సీఎల్పీ నేత మల్లు భట్టి కూడా మెత్తబడ్డాడని .. గీతారెడ్డి, శ్రీధర్ బాబు లాంటి వివాదరహితులు కూడా అంటీ ముట్టనట్టుండం.. అసలు పార్టీ ఎక్కడికిపోతుందో , గమ్యం ఎటో అంతు పట్టని పరిస్థితి. రేవంత్ మాటలు తూటాల్లా పేలుతున్నా.. ఆయన సభలకు జనం వస్తున్నా.. అటు ఓట్ల రూపంలో మలచగలిగే రీతిలో పార్టీ యంత్రాంగం ఉందా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి సభ్యత్వాలను నమోదు చేసి రాజకీయ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. కానీ, ఏది ఏమైనా ఇంట్లోనే శత్రువులు ఉంటే యుద్దం చేసేదెట్టా..? విధేయులు పార్టీని ముందుకు పోనిస్తారా..? శల్యుడి సారథ్యంలో కర్ణుడు బలైనట్టు కాంగ్రెస్ బలి కావాల్సిందేనా..? కాంగ్రెస్ శల్య సారథ్యం బీజేపీ కి అనుకూలిస్తుందా..? ముందస్తు ఎన్నికలు ఎదుర్కొనే తరుణంలో కాంగ్రెస్ బోల్తా పడుతుందా..? లేకపోతే యువ నాయకత్వం పార్టీని రక్షిస్తుందా..? మరికొన్ని రోజుల్లో తేలనుంది.
ఎట్టకేలకు జగ్గారెడ్డికి పవర్ కట్
వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కి ఉన్న అదనపు బాధ్యతలు తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆరు పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలను, మహిళా అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తొలగించారు. అధిష్టాన వర్గానికి ఈ బాధ్యతలు తనకు వద్దని ఇది వరకే జగ్గారెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. దమ్ముంటే రేవంత్ రెడ్డి.. రాజీనామా చేస్తా నిలబడతా… కాంగ్రెస్ పార్టీని గెలిపించుకో… అని జగ్గారెడ్డి సవాల్ విసరడం.. వెంటనే బాధ్యతల నుంచి తొలగించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
మ్యాడం మధుసూదన్ (సీనియర్ జర్నలిస్ట్)