ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరులు మాక్లూర్ సాక్షి విలేకరి పోశెట్టిపై దాడి చేసిన కేసులో.. పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేశారని, వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేయగా… దీనికి విరుద్దంగా పోలీసులు బాధితుడిపైనే కొత్త కేసు కట్టేందుకు రంగం సిద్దం చేశారు. నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావుకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. విఠల్‌రావు చాలా వేదికలపై బాహాటంగానే జీవన్ రెడ్డి చర్యలపై విరుచుకుపడ్డాడు. ఆరోపణలు చేశాడు. విమర్శలూ చేశాడు.
ఇవే విషయాలను సాక్షిలో మాక్లూర్ విలేకరి రాస్తూ వచ్చాడు. దీన్ని మనసులో పెట్టుకుని ఎమ్మెల్యే తన అనుచరులైన రంజిత్, మహేందర్‌లతో విలేకరిపై దాడికి ప్లాన్ చేశాడని, కొత్త వ్యక్తులకు ఉసిగొల్పి దాడికి తెగబడ్డాడని విలేకరి పోశెట్టి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయని స్వయంగా ఎమ్మెల్యేనే ఫేస్‌బుక్ లైవ్‌లో చెప్పుకొచ్చాడు. వారిపై ఏం కేసులు నమోదయ్యోయో తెలియదు కానీ.. ఈ రోజు ఎస్సై ఫోన్ చేసి.. నువ్వే వారిని నీ బైక్‌తో గుద్దావట కదా.. నీపై కేసు పెట్టారు. మా వాళ్లు వస్తున్నారు. నీ బైక్ వివరాలు తీసుకుంటారు.. అని చెప్పడంతో పోశెట్టి షాక్‌కు లోనయ్యాడు.
ఈ దాడిలో తృటిలో తన ప్రాణాలు దక్కాయని, ఆ రేంజ్‌లో పక్కా స్కెచ్ వేసి తనపై దాడికి దిగారని, ఇప్పుడేమో తననే కొత్త కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని లబోదిబోమంటున్నాడు. యూనియన్ లీడర్లకు ఫోన్ చేసి ఇదేం అన్యాయమన్నా.. నేనే వాళ్లను బైక్ గుద్దానట.. ఇంత అధికార దుర్వినియోగమా…? అని నోరెళ్లబెట్టి తన ఆవేదనను వెళ్లగక్కాడు.