బాలీవుడ్ వెండితెర వేల్పు, మహానటుడు బిగ్ బి ఏమన్నాడో తెలుసా…. మళ్లీ జన్మ అంటూ ఉంటే జర్నలిస్టుగా పుట్టాలని ఉంది… అన్నాడు. ప్రతి ప్రొఫెషన్లో మంచి చెడు రెండు ఉంటాయి. కాకపోతే జర్నలిజంలో పని ఎక్కువ… జీతం తక్కువ…. ఉద్యోగానికి భద్రత ఉండదు. కానీ సమాజాన్ని దగ్గరగా చూసి అర్థం చేసుకునే గొప్ప అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కంటే సామాజికంగా పేరు తెచ్చుకోవడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది.
కానీ, ఇప్పుడున్న జర్నలిజం వింత పోకడలు చూసి బిగ్‌బీ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడో ఏమో. ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారి.. పార్టీల రంగు పులుముకున్న నేటి జర్నలిజం సామాజికంగా ఎంతగా ఉపయోగపడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. నిజాలు నిర్భయంగా రాసే జర్నలిజం లేదిప్పుడు. ఎవరి ఎజెండాను వారు అమలు పరిచేందుకు వారి కోణంలోనే వార్తలు రాసుకునే జర్నలిజమే ఉందిప్పుడు. ఇందులో జనాలు లేరు.. సమాజం లేదు. సమాజ హితం లేదు. సామాజిక కోణం లేదు.