ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎంపికలో మరోసారి కేసీఆర్ మార్క్ కనిపించింది. ఎప్పుడో పది రోజుల ముందు ఓ లీక్ వదిలాడు. దానిపై చర్చ, రచ్చ కొనసాగేలా చేశాడు. చివరాఖరుకు నేడు నామినేషన్ల చివరి రోజు వరకు కూడా అధికారికంగా జాబితా విడుదల చేయలేదు. ముందుగా ఊహించిన పేర్లతో పాటు కనీసం ఊహకు కూడా రాని పేర్లు కొన్ని వచ్చాయి. అదే కేసీఆర్ మార్క్ ట్విస్ట్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. వెలమ సామాజిక వర్గం నుంచి తక్కళ్లపల్లి రవీందర్రావు, రెడ్డి సామాజిక వర్గాల నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్ రాం రెడ్డిలకు అవకాశం రాగా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి కడియం శ్రీహరి, బీసీ నుంచి బండా ప్రకాశ్‌కు అవకాశం ఇచ్చారు.
నిజామాబాద్ నుంచి ఆకుల లలితకు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో బండా ప్రకాశ్‌కు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అధికారికంగా చివర వరకు వీరి పేర్లను బయటపెట్టకపోయినా.. రెండు రోజుల ముందే వీరికి సమాచారం ఇచ్చారు. ఈ రోజు నామినేషన్లు వేసుకున్నారు. ఈటల రాజేందర్ పార్టీని వీడిన తర్వాత హుజురాబాద్ ఫలితాలతో ముదిరాజ్ సామాజిక వర్గం పూర్తిగా టీఆరెస్‌కు దూరమైందనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చాడు. అందుకు మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలితను చివరి నిమిషంలో పక్కన పెట్టేశారు.
బండా ప్రకాశ్‌కు అవకాశం ఇచ్చి, కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. ఎల్. రమణకు కూడా ఇందులో అవకాశం దొరకలేదు. ఆయనను కేబినెట్లోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. లోకల్ బాడీ నుంచి ఎల్. రమణకు అవకాశం ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీ కవిత పేరు ఎమ్మెల్యే కోటాలో వస్తుందని అనుకున్నారు. కానీ .. నిజామాబాద్ లోకల్బాడీకి చాలా మంది పోటీకి వస్తారు. ఆమెనే తిరిగి కొనసాగించడం బెటర్ అని కేసీఆర్ భావించాడు.
మరోవైపు మాజీ కలెక్టర్‌ను కూడా కేబినెట్లోకి తీసుకంటారు.. రెవెన్యూ శాఖ అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకున్నది. కవితను కూడా మంత్రిగా చేయాలని కేసీఆర్ పై ఒత్తిడి ఉంది. ఎవరికి కేబినెట్ బెర్త్ దక్కుతుందో.. ఎవరిని కేబినెట్ నుంచి తొలగిస్తారో … అంతా అయోమయం గందరగోళంగా ఉంది. అయితే పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉన్న ఆశావాహులు మాత్రం కేసీఆర్ మీద గుర్రుగా ఉన్నారు. ఇక పార్టీ వీడటమే మేలనే అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. ఇది కాంగ్రెస్‌కు కలిసివస్తుందా..? బీజేపీ లాక్కుంటుందా తెలియదు. మున్ముందు రాజకీయ పరిణామాలు చాలా మారనున్నట్టు మాత్రం ఈ ఎన్నికలు సంకేతాన్నిచ్చాయి.