బ‌తుకుపోరాటంలో అల‌సిసొల‌సి ఆగిన గుండె

మిట్ట మ‌ధ్యాహ్నం ఆక‌లి దంచుతుంది. రొట్టెలు చేసే కోల‌లు, పిండి రుబ్బే గుత్తి, పీట‌లు మార్కెట్లో అమ్మేందుకు తెచ్చినవి ఇంకా గిరాకీ రాలేదు. నీళ్లు తాగి అరుస్తున్నాడు. జ‌నాల‌ను త‌న‌వైపుకు తిప్పుకునేందుకు ఆరిపోతున్న నోటితో గ‌ట్టిగా అరుస్తున్నాడు. ఓ వైపు ఆక‌లి.. నోరు త‌డారిపోయి ద‌ప్పిక‌… మ‌రోవైపు ఇంటికి ఈ రోజు తీసుకుపోవాల్సిన స‌రుకులు.. ఇంట్లో ఖ‌ర్చుల‌కు పైస‌లు.. అన్నీ మైండ్‌లో తిరుగుతున్నాయి. అన్య‌ప‌దేశంగా గిరాకీని ఆక‌ర్షించేందుకు అరుస్తున్నాడు కానీ మ‌న‌సంతా అక్క‌డ లేదు. ఏవో నిండిపోయిన ఆలోచ‌న‌ల‌తో మ‌న‌సు స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంది. అప్పుడే అనుకోకుండా గుండెలోక‌లుక్కుమ‌న్న‌ది. మెల్ల‌గా నొప్పి స్టార్ట్ అయ్యింది. ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయి. గుండెలో గున‌పం పెట్టి కెలికిన‌ట్టు ఒక్క‌సారిగా భ‌రించ‌లేని బాధ‌. తేరుకుని లేచేలోపే.. అలాగే కూర్చున్న‌వాడు కూర్చున్న‌ట్టుగా వెన‌క్కివాలి కుప్పకూలిపోయాడు. అప్ప‌టి వ‌ర‌కు ఉక్కిరిబిక్కిరి చేసిన ఆలోచ‌న‌లు ఆగిపోయాయి. ఆలోచ‌న‌ల‌తో స‌మానంగా వేగంగా కొట్టుకున్న గుండె ఒక్క‌సారిగా ఆగిపోయింది. అల‌స‌ట లేకుండా నిర్విరామంగా అరిచిన ఆ గొంతు మూగ‌బోయింది. దైన్యం నిండిన ఆ క‌ళ్లు మాత్రం ఆకాశాన నిప్పులు చిమ్ముతున్న సూరీడి కేసి చ‌ల్ల‌గా చూస్తూ ఉన్నాయి.

ఈ రోజు ఆ ఇంట్లోకి స‌ర‌కులు వెళ్ల‌వు. శ‌వ‌మే వెళ్తుంది.
ఖ‌ర్చుల‌కు పైస‌లు రావు.. క‌ళేబ‌ర‌మే వ‌స్తుంది..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఫోటో ఎవ‌రో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైర‌ల్‌గా మారి అంద‌రి గుండెల‌ను తాకి త‌డి చేస్తున్న‌ది.