ఆర్థిక సంక్షోభం పక్కలో పొంచిన బల్లెంలా ఉంది భారత్‌కు. కరోనా దెబ్బతో దేశాలకు దేశాలే ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితులు వచ్చాయి. పొరుగున్న దేశాలు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. శ్రీలంక, పాకిస్తాన్ తదితర దేశాల్లో ఆర్థిక సంక్షోభంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. భారత్‌కు ఇంకా ఈ ముప్పు రాకున్నా.. పరిస్థితులు ఇలాగే ఉంటే మనమూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకతప్పదు. వ్యవసాయం, సంబంధిత రంగాల ఆధారంగా అంతో ఇంతో ఆర్థికంగా భారత్ నిలదొక్కుకుంటున్నది.
రియల్ ఎస్టేట్ రంగం ఒకటే ఇప్పుడు నిలకడగా ఉంది. అన్ని రంగాలూ దివాళా తీశాయి. థర్డ్ వేవ్ కరోనా తర్వాత కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ ఎకనామిక్ ప్యాకేజీ పేరుగొప్ప ఊరు దిబ్బలా మారింది. ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించేవిధంగా కాకుండా .. ఈ ప్యాకేజీ ఎవరెవరికి ఇచ్చిందో.. ఆ లెక్కలేమిటో కూడా ఎవరికీ తెలియదు. పేరు మాత్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ. అవెటు పోయాయో సామాన్యడికే కాదు.. ఆర్థిక నిపుణులకు కూడా లెక్కతెలియదు. అదంతా ప్రచారార్బాటంగానే మిగిలింది తప్ప .. ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా, ఉపాధి కల్పన చేసే విధంగా ఉపయోగపడలేదు. అసలు ప్రభుత్వం అటువైపే ఆలోచన చేయడం లేదు. పరిశ్రమలకు రాయితీలిచ్చింది.
అసలు డిమాండ్ లేకుండా పోయిన పరిశ్రమలు ఇప్పడప్పుడే కోలుకోవడం కష్టం. ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ (మౌలిక వసతుల కల్పన) పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం లేదు. హోమ్‌లోన్‌ను 6.75 శాతం నుంచి 3 శాతానికి తగ్గిస్తే ఎంత మంది గృహ నిర్మాణాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలు జరిగితే ఈ ఒక్క రంగంపై 250 రకాల రంగాలు ఆధారపడి ఉంటాయి. ఈ రంగాల వారందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పరోక్షంగా నిరుద్యోగ సమస్యల కూడా తీర్చినట్లవుతుందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయంగా ఉంది. కానీ ఈ వైపుగా కేంద్రం ఏనాడూ చొరవ చూపలేదు. సబ్సీడీ స్కీమ్‌ల పేరుతో ఆదాయాన్ని కోల్పోతున్న ప్రభుత్వానికి ఇన్‌కమ్ గ్యాప్ చాలా ఉంది. దీన్ని పూడ్చే ప్రయత్నం చేయడం లేదు.
చాలా రకాల వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇప్పటికీ భారత్ చైనాపైనే ఆధారపడి ఉంది. ఒక్కదానిపైనే ఆధారపడి ఎదరుచూసే బదులు మన దగ్గరే స్పెషల్‌కారిడార్ జోన్లను ఏర్పాటు చేసి మనమే వాటిని తయారు చేసే విధంగా ఎదిగితే.. ఇలాంటి ఆలోచనలు మనం చేయం. కానీ చిన్నదిలో చిన్నదైన వియాత్నాం మాత్రం ఆ ప్రయోగాలు చేస్తూ ఫలితాలు సాధిస్తున్నది. ఇలాంటివి చూసైనా మనం పద్దతులను మార్చుకుంటామా అంటే మారదు. మనకు రాజకీయం కావాలి. ఎంత పంచామనే లెక్కలు ఘనంగా ఉండాలి. అవి ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడకపోయినా సరే. ప్రభుత్వానికి ప్రచార మైలేజీ వస్తే చాలు.