డెంగ్యూతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను సోషల్ మీడియా వేదికగా చంపేస్తున్నారు. అప్పుడే రిప్లు పెడుతూ .. తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. నిజమేమిటో తెలుసుకునే ఓపిక కూడా లేదు. అలా వ్యాప్తి చెందిన తప్పుడు ప్రచారాన్ని అలవోకగా పట్టేసుకుని క్షణాల్లో తమ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసి హమ్మయ్యా అని ఓ పనైపోయిందనుకుంటున్నారు. ఆయన ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు. బాగానే ఉన్నాడు. బతికే ఉన్నాడు. కానీ అది గ్రహించే స్థితిలో లేరు మనవాళ్లు. తెలుసుకునే ఓపికా లేదు.
అందుకే ఇలా ఈజీగా ఓ రిప్ సందేశాన్ని వదిలేసి తమవంతు బాధ్యతను నిర్వర్తించేస్తున్నారు. అలా అవగాహన లేక, అత్యత్సాహంతో ఎవరో చేశారా? అంటే కాదు. బాధ్యత గల వాళ్లే… ఇలాంటి తప్పులు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నిన్న మధ్యాహ్నమే మాజీ ప్రధాని ఇకలేరంటూ సంతాప సందేశాన్ని పంపి నాలుక్కర్చుకున్నాడు. ఎన్ ఆర్ ఐ జ్యోతిరెడ్డి కూడా అదే విధంగా మెసేజ్ చేసింది. చాలా మంది తమ సోషల్ మీడియాలో మన్మోహన్ ఫోటోను వాడుకుంటున్నారు. కొందరు రిప్ కూడా జోడిస్తున్నారు. ఆయన ఇక బతికుండడం అసాధ్యమని అనుకున్నారా? తప్పుడు వార్తలు పట్టుకుని దాన్నే వ్యాప్తి చేసేస్తున్నారా?
గతంలో కూడా ఇదే తరహాలో ప్రముఖులు చనిపోకముందే చనిపోయినట్టు రిప్లు, సందేశాలు ఇచ్చేశారు. ఇది ఓ అలవాటుగా మారింది. పోటీలు పడి మరీ వాస్తవాలు తెలుసుకోకుండా.. ఇలా చనిపోకముందే చంపేస్తున్నారు.