పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. స్పీకర్. పాపం పెద్దమనిషిని పెద్ద మనిషిలా ఉండనీయకుండా హుజురాబాద్ ఎన్నికల కోసం పెట్టి రెడ్డి ఆత్మగౌరవ సభను జమ్మికుంటలోపెట్టి పోచారంను పిలిచారు. పాపం పోచారంకు మైకు దొరకక ఎన్నిరోజులైందో కదా..! మంచి వక్త. ఓ గంట రెండు గంటలు మాట్లాడితే గానీ తనవి తీరదు. అలాంటి మనిషిని కేసీఆర్ స్పీకర్‌కు పరిమితం చేసి నోటికి తాళం వేశాడు. చాలా సందర్బాల్లో తనకు స్పీకర్ ఇవ్వడాన్ని అసంతృప్తిగా ఫీలవుతూనే ఉన్నాడు.
నిన్న జమ్మికుంటలో రెడ్ల సభలో .. ఎందుకో పేరు చివరన రెడ్డి పెట్టుకోవడానికి భయపడుతున్నారు అని అన్నాడు. అదేందీ? రెడ్డి అని చెప్పుకోవడానికి భయపడుతున్నారా? ఎందుకో..? మళ్లీ ఆయనే అన్నాడు. మనమేమన్నా దొంగతనం చేశామా? రెడ్డిగా పుట్టినందుకు గర్వపడాలె అని. సాయం చేసే గుణం ఉంటే గింటే మనకే ఉంటుందని ఓ కితాబుకూడా ఇచ్చేసుకుని జాతిలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఇలా రెడ్ల గురించి పోచారం మాట్లాడటం ఇదే కొత్తేం కాదు. మొదటిదీ కాదు. ఆ మధ్య రవీంద్రభారతిలో గిట్లనే ఓ రెడ్ల సభకు వచ్చి సేమ్ గివే డైలాగులు కొట్టాడు. మరీ ఇంతలా కులపిచ్చి ఉంటే ఎలా సారు. మీ కులమేమన్నా అణగారి, అవమానాల పాలై, ఛీత్కారాలకు గురై, ఆర్థికంగా ఎదగక బక్కచిక్కి పోయి, రాజకీయంగా ఎదగలేక అణగదొక్కబడి, సమాజికంగా బహిష్కరణలకు గురై…. ఇలాంటివేమీ లేవే. మరీ అంతలా ఎందుకు బాధపడుతున్నాడో మన స్పీకర్ సారు.
ఏ ఊకో వయా..! రెడ్ల మీటింగుకు పోయి.. గిట్టగాకపోతే ఇంకెట్ల మాట్లాడతరు అంటరా..! మరీ ఇంతలా మాట్లాడింది ఎవరూ లేరు బాసు. చూస్తే పెద్ద మనిషి. అందునా స్పీకరు.. ఎందుకో ఈ మాటలు ఆయన హోదాకు , హుందాతనానికి సరిపోలేవనిపిస్తుంది బాసు. నన్ను తిట్టుకున్నా సరే. మొన్నా మధ్య వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఓ సభలో రెడ్ల పురాణాన్నే వల్లెవేశాడు. రెడ్ల వల్ల కలిగిన ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. జాతికి చేసిన మేలును వివరించాడు. కాంట్రాక్టర్ల పేర్లతో సహా రెడ్లను జ్ఞాపకం చేసుకుని తరించిపోయాడు. ఈ పెద్ద మనుషులకు నరనరాన ఈ కులం పిచ్చి జీర్ణించుకుపోయి ఉంటుంది కాబోలు. రెడ్డి అని తోక పెట్టుకుని వీరి వద్దకు పోతే తొందరగా పనులు చేపిపెడతారు అనుకుంటా. రెడ్డి అనే పేరు వినేందుకు చెవులు కూడా కోసుకుంటారనుకుంటా. సరే వాళ్ల కులం వాళ్లిష్టం. మధ్యలో నీకెందుకు రాబై నొప్పి.. అంటారా? సరే. పోనీలే. మనం కొన్ని ఇలా చూస్తూ ఉండాలి. వింటూ ఉండాలి.
మీ పేరు చివరగా ఆ తోకలుండాలె.. ఆ పోలీసు స్టేషన్లల్ల మా ఫోటోలుండాలె.. అని గోరటి రాసింది ఈ సందర్బంగా గుర్తు రావడం అసమంజసమేమీ కాదనుకుంటా.