సమాచార లోపమో… తెలుసుకోవడంలో నిర్లక్ష్యమో తెలియదు కానీ… కేటీఆర్ కూడా ఈ మధ్య తప్పుల్లో కాలేస్తున్నాడు. ఒకసారి కాదు.. ఇలా జరగుతూనే ఉంది. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇద్దామనుకుని తనే వారి ఉచ్చులో చిక్కుకుంటున్నాడు. తాజాగా ఓ ట్వీట్ కేటీఆర్‌ను నవ్వుల పాలు చేసేలా ఉంది. ఆయనే స్వయంగా ట్వీట్ చేసిన వ్యాక్సిన్ కు సంబంధించిన రెండు ఫోటోలు కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టాయి. ఈ తప్పును ఎత్తిచూపుతూ నెటిజన్లు కేటీఆర్‌ను ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరిగింది? ఏమా ఫోటోలు? ఏమా కథ?
కొంతమంది నర్సులు వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతుల వద్దకే వెళ్లి వ్యాక్సిన్లు ఇచ్చే ఫోటోలవి. రెండు వేర్వేరు ప్రాంతాలవి. సబ్జెక్టు మాత్రం ఒకటే. హెల్త్ వర్కర్లే వారి వద్దకు వచ్చి వ్యాక్సిన్లు వేశారనేది కొత్త విషయం. అందరినీ ఆకట్టుకున్నది. అంతా మెచ్చుకున్నారు. కానీ ఇది కరెక్టుగా ఎక్కడ జరిగిందో తెలియని పరిస్థితి. కానీ కేటీఆర్ మాత్రం ఈ రెండు ఫోటోలు తెలంగాణలోవని క్లారిటీ ఇచ్చాడు తన ట్వీట్‌లో. ఒకటి ఖమ్మంలో, ఇంకొకటి రాజన్న సిరిసిల్లాలో ఇలా టీకాలు వేశారని, కేటీఆర్ నాయకత్వంలో హెల్త్ వర్కర్లు ఎంత బాగా పనిచేస్తున్నారో కదా.! అని అబ్బురపడ్డాడు. వారికి కితాబిచ్చాడు. అంతా బాగానే ఉంది. కానీ ఈ ఫోటోలు తెలంగాణలోకి కావంట. సేమ్ ఇవే ఫోటోలతో విజయసాయిరెడ్డి.. అక్కడ జగన్‌కు ఆకాశానికెత్తుతూ.. ట్వీట్ చేశాడు. ఓ ఇంగ్లీష్ పత్రికలో ఓ ఫోటో విజయనగరం జిల్లా మెంటాడ మండలం, కొంపంగి గ్రామమని రాశారు. ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి .. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ .. కేటీఆర్ ట్వీట్‌పై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తెలియక ఇలాంటివి పోస్టు చేయనేలా? ఇలా నవ్వుల పాలు కానేలా??