విమోచ‌న దినోత్స‌వం పేరిట బీజేపీ నిర్మ‌ల్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న అమిత్ షా కేసీఆర్ పై ఆచితూచి మాట్టాడాడు. నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చిన‌ట్టు చెయ్యు అన్న‌ట్లుగానే ఆయ‌న ప్ర‌సంగం సాగింది. తెలంగాణ రాక‌ముందు సెప్టెంబ‌ర్ 17ను విమోచ‌న దినంగా పాటించాల‌ని డిమాండ్ చేసిన కేసీఆర్ ఆ త‌ర్వాత ఎందుకు మ‌రిచి పోయాడ‌ని, ఎవ‌రికి భ‌య‌ప‌డుతున్నాడ‌ని ప్ర‌శ్నించాడు. బీజేపీ ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌బోద‌ని స్ప‌ష్టం చేశాడు. పెద్ద విమ‌ర్శ‌ల‌కు, ఆరోప‌ణ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా సూటిగా, సుతి మెత్త‌గా ఆయ‌న ప్ర‌సంగం సాగింది.

బండి సంజ‌య్‌ను ఆకాశానికి ఎత్త‌డం, అసంతృప్తితో ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించాల‌ని నాలుగు మంచి మాట‌లు చెప్ప‌డంతో స‌భ ముగిసింది. ఈ స‌భ ద్వారా బీజేపీ టీఆరెఎస్ ప‌ట్ల ఉన్న త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తుంద‌ని అంతా భావించారు. మొన్న కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న రాష్ట్ర దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గ‌ల్లీలో కొట్టుకుంటారు..

ఢిల్లీలో గ‌లే గ‌లే మిలాయించుకుంటారు అని అంతా భావించారు. ఇది రాష్ట్ర బీజేపీకి ఇబ్బందిక‌రంగా మారింది. దీన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అర్వింద్ అవ‌కాశం ఉన్న ప్ర‌తి చోట ప్ర‌భుత్వం పై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నాడు. కేటీఆర్‌ను టార్గెట్ చేశాడు. నిర్మ‌ల్ స‌భ వేదిక‌గా అమిత్ షా ప్ర‌సంగం టీఆరెఎస్‌కు, బీజేపీకి మ‌ధ్య ఎలాంటి స‌త్సంబంధాలు లేవ‌నే క్లారిటీ వ‌స్తుంద‌ని అంతా భావించారు. కానీ అది రాలేదు. అంతా అనుకున్న‌ట్లుగానే అమిత్ షా త‌న శైలికి విరుద్ధంగా కేసీఆర్‌ను త‌మ‌ల‌పాకుల‌తో బాది భారీ బ‌హిరంగ స‌భ ముగించాడు.

You missed