సైదాబాద్ చిన్నారి రేప్, హత్య నిందితుడు రాజు ఆత్మహత్య.. చర్చ ఇప్పట్లో ఒడిసే ముచ్చటలా కనిపించడం లేదు. తెలంగాణ సర్కార్ మెడకు ఈ దారుణ కేసు చుట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది రాజకీయ రంగు పులుముకున్నది. దిశ కేసులా ఇది కూడా అందరినీ ఆగ్రహావేశాలకు లోను చేసింది. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాల్సిందేననే అభిప్రాయలు సర్వత్రా వెల్లడయ్యాయి. వాస్తవంగా నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద పనేం కాదు. అంతటా సీసీ కెమెరాల నిఘా ఉన్న క్రమంలో ఎక్కడో ఓ చోట పోలీసుల కళ్లకు వాడు చిక్కాల్సిందే. చిక్కాడు. అయితే దీనికి పుల్ స్టాప్ ఎలా పెట్టాలి? కేసు తీవ్రతను ఎలా తగ్గించాలి. కొద్ది సమయంలోనే దీని చర్చకు కూడా పుల్ స్టాప్ పడిపోవాలి.జనం తొందరగా మరిచిపోవాలి. ఎలా అని ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించింది.
దిశ ఎన్‌కౌంటర్ పై జనం మంచిగానే స్పందించినా.. మేథావి వర్గం, మానవ హక్కుల సంఘం .. అవి చేయాల్సిన పని అవి చేశాయి. కానీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఎన్కౌంటర్ ప్రక్రియ సరైన క్రియ కాదు. ఇలా చేస్తే యావత్ దేశం మన వైపు చూస్తుంది. అప్పటి వరకు ఇక్కడ జరిగింది ఏంటో తెలియని వారికీ తెలుస్తుంది. వారిని ఎందుకు అంత క్రూరంగా చంపాల్సి వచ్చిందీ తెలుసుకుంటారు. అలా రాష్ట్రం ఈ విధంగా అందరి నోళ్లలో నానుతుంది. ఒక్కప్పుడు బీహార్, జార్ఘాండ్ తదితర రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు జరిగేవి. అవి చూసి మనం అయ్యో అనుకునేవాళ్లం. వీళ్లు మనుషులేనా? అని తిట్టుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అవి మన దగ్గరే జరుగుతున్నాయి. మన కళ్ల ముందే నిత్యం ఘోరాలు జరిగిపోతున్నాయి. ఆవేశంగా మనమే స్పందిస్తున్నాం. చంపిపాడేయ్యాలి కొడుకుల్ని అని మనమే పళ్లు కొరికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం. ఎన్కౌంటర్ చేసి చంపితే చల్లబడుతున్నాం. తరువాత మన రొటీన్ పనిలో మునిగిపోతున్నాం. కానీ ఇది చరిత్రలో ఉండిపోతుంది. సంఘటనలు మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి.
సర్కార్ నిందితుల ప్రాణాలు పిట్టల్లా కాల్చిపారేసే పరిస్థితే వస్తే.. ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనమే దేశానికి, ప్రపంచానికి చెప్పినవారమవుతాం. అందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నది. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా కేసును రైల్వే ఇలాఖాలో పడేసింది. నిందితుడిని ఆత్మహత్య ఖాతాలోకి తోసేసింది. మనకు కావాల్సింది వాడు చావాలి. దారుణంగా. అలాగే చచ్చాడు.
