ఒకేసారి జరిగిన రెండు సంఘటనలు.. మీడియా ముసుగు విప్పాయి. అసలు రూపం బయట పెట్టాయి. పూర్తిగా వ్యాపారాత్మకంగా మారిన మీడియా వైఖరి రోజు రోజుకూ ఎలా దిగజారి పోతుందో తెలియజెప్పాయి. ఒకటి సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్. మరొకటి చైత్ర అనే చిన్నారి దారుణంగా రేప్‌కు గురై హత్యగావింపబడడం.

షరామామూలుగా సాయిధరమ్ తేజ్ ఘటన జరుగగానే మీడియా మొత్తం అక్కడ వాలిపోయింది. క్షణక్షణం వార్తలనందిస్తూ ప్రతి క్షణం ఉత్కంఠను రేకెత్తించింది. చేతినిండా పని దొరికింది మీడియాకు. కెమెరా కంటి నిండా దృశ్యాలు దొరికాయి. ఇక కుమ్మేసుకున్నారు. బ్రేకింగ్‌లు గుమ్మరించుకున్నారు. ప్రత్యేక కథనాలు పరిచేసుకున్నారు. పోటాపోటీగా కవరేజీలో తన్నుకున్నారు. ఒకరిని మించి మరొకరు దిగజారారు. ఒకరి కంటే ఒకరం దిగజారిపోయామని ఎవరికి వారే నిరూపించుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లోనే సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి ఓ కామాంధుడి చేతుల్లో పడి దారుణంగా రేప్‌కు గురై హత్య గావింపబడితే అటు వైపు పోయిన దిక్కు లేదు. చూపిన దిక్కుమాలిన ఛానల్ ఏది లేదు. కనీసం బ్రేకింగ్ వేసిన బేకార్ మీడియా లేదు.

సోషల్ మీడియా మాత్రం మీడియా బట్టలు విప్పింది. సాయిధరమ్ తేజ్ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ.. నిద్రాహారాలు మాని అహోరాత్రులు కష్టపడుతున్నట్లు తమ రెట్టింగుల కోసం నటిస్తున్న జిత్తుల మారి నక్క వినియాల మీడియా బుద్ధిని బయట పెట్టింది. నెటిజన్లు చీల్చి చెండాడారు. రాజకీయ పార్టీలకు కూడా అప్పటి వరకు పట్టలేదు. నాయకులు కూడా అసలు పట్టించుకోలేదు. సోషల్ మీడియా కొరడా తీసుకుని ఛళ్లుఛళ్లు మని వీపు పై విమానం మోత మోగిస్తే గానీ బుద్ధి రాలేదు. కెమెరాల దృష్టాంతా ఇప్పుడు సైదాబాద్ వైపు మళ్లాయి.

బాధితుల కంటనీరు కెమెరా కంటికి కనిపిస్తున్నాయి. ఆ బాధితుల కంఠఘోష ఆ కర్కష టీవీ ఛానళ్ల చెవులకు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు సాయిధరమ్ తేజ్ తెరమరుగైపోయాడు. కాలర్‌బోన్ ఆపరేషన్ అయిందో లేదో తెలియదు. డిశ్చార్జ్ అయ్యాడో లేదో సమాచారం లేదు. హాస్పిటల్ చుట్టూ తారల తోరణం ఎలా ఉందో కనిపెట్టే కెమెరా లేదు. ఎప్పటికప్పుడు బ్రేకింగులు లేవు. ఆఖరికి టీవీ 9 కూడా ఆ ఛాయాలకు వెళ్లడడం లేదంటే సోషల్ మీడియా దెబ్బ మామూలుగా లేదన్నమాట.

You missed