బీజేపీ సీనియర్ లీడర్ యెండల లక్ష్మీ నారాయణ ఆ పార్టీ ఇందూరు రాజకీయాలకు క్రమంగా దూరమవుతూ వస్తున్నాడు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బిగిస్తున్న ఉచ్చులో చిక్కుకొని ఆయన విలవిలలాడుతున్నాడు. ఏకాకిగా మిగులుతున్నాడు. పార్టీకి అంకిత భావంతో పనిచేసి ఎన్నో ఏండ్లుగా పార్టీ భావజాల వ్యాప్తిలో కీలకంగా ఉన్న యెండల లక్ష్మీ నారాయణకు అర్వింద్ బీజేపీలో రాక ముందు మంచి పట్టు ఉండేది. పైస్థాయిలో పలుకుబడి ఉండేది. అధిష్ఠానం వద్ద తనకంటు ఓ ప్రత్యేక కలిగి ఉండేవాడు. కానీ పరిస్థితులు మారాయి.
అర్వింద్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేసి గెలిచిన తదనంతర పరిణామాల నేపథ్యం యెండల లక్ష్మీ నారాయణను దూరం చేస్తూ వచ్చాయి. ఇందూరులో యెండలకు ఆ పార్టీలో ప్రత్యేక అభిమానం ఉంది. అనుచరగణముంది. గతంలో డీ శ్రీనివాస్ పై పోటీ చేసి యెండల గెలిచాడు. ఆ తర్వాత ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయన గెలవలేదు. పార్టీలో కీలకమైన పదవులే ఇస్తున్నా.. ఇందూరు రాజకీయాలకు మాత్రం ఆయనను అధిష్ఠానం కూడా దూరంగా పెడుతున్నట్లు అనిపిస్తోంది.
ముఖ్యమైన కార్యక్రమాలకు తప్ప.. జిల్లాలో ఆయన కనిపించడం లేదు. ఏదో ఒక ఎన్నికకు ఇంచార్జీగా ఇచ్చి పంపుతున్నారు. ఈ పరిణామాలు జిల్లాలోని ఆయన అనుచరగణంలో ఆందోళన కలిగిస్తున్నాయి. క్రమంగా అర్వింద్ నిజామాబాద్ జిల్లా పై పట్టు బిగిస్తున్నాడు. ఏ జిల్లాలో ఎవరూ ఎమ్మెల్యేగా ఉండాలనే నిర్ణయం కూడా ఇప్పటి నుంచే తీసుకుని ఆ మేరకు వారిని వెనుకుండి నడిపిస్తున్నాడు. అర్బన్‌లో ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్‌లో వినయ్ రెడ్డి, రూరల్‌లో కులచారి దినేశ్, బాల్కొండలో మల్లికార్జున్ రెడ్డి, బోధన్ మేడపాటి ప్రకాశ్ రెడ్డి, బాన్సువాడకు మల్యాద్రి రెడ్డి.. ఇలా అన్ని నియోజకవర్గాల్లో తనకు నచ్చిన వారికి, తనతో కలిసి నచ్చిన వారికి మాత్రమే అవకాశం వచ్చేలా చేస్తున్నాడు. దీంతో యెండల వర్గం క్రమంగా బీజేపీ పార్టీకి దూరం కాలేక, యెండలను వీడలేక, పార్టీ మారలేక సతమతమవుతున్నారు.
