దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్యపెరుగుతున్నది. కరోనా తాకిడికి ఎక్కడికక్కడ అన్ని రంగాల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి. కంపెనీలు మూత పడకుండా ఉండేందుకు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. జీతాల్లో కోతలు కోస్తున్నారు. ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారు. ఫలితంగా నిరుద్యోగ సమస్య దేశ వ్యాప్తంగా పెరుగుతూ వస్తున్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఆగస్టు మాసానికి సంబంధించి దేశ వ్యాప్తంగా నిరుద్యోగ శాతాన్ని వెల్లడించింది. ఇందులో దేశ వ్యాప్తంగా 16 లక్షల మంది నిరుద్యోగులుగా మారారని లెక్కలు తేల్చింది. ఇది 8.2 శాతంగా ఉంది. ఏపీలో 6,5 శాతం నిరుద్యోగ సమస్య పెరగగా.. అదే తెలంగాణలో 4.7 శాతంగా ఉందని తేలింది. మున్ముందు థర్డ్‌వేవ్ భయంతో మరెన్ని ఉద్యోగాలు ఊడబీకుతారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఏడాది నుంచీ ఉద్యోగాలు గాలిలో దీపాలుగా మారాయి. అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి ఉంది. వ్యాపారం చేద్దామన్నా కష్టకాలమే దాపురించింది. పెట్టుబడులు దొరకవు. అప్పులు తెచ్చి పెట్టి వ్యాపారాలు చేస్తే .. అవి ఎన్ని రోజులుంటాయో..? తెలియదు. వేరే చోట ఉపాధి వెతుక్కోవడం కూడా గగనమైపోయింది. సెప్టెంబర్,అక్టోబర్ నెలలో ఈ నిరుద్యోగ తీవ్రత మరింత పెరుగుతుందోమోననే భయం కూడా వెంటాడుతున్నది. మరో రెండు నెలలు థర్ఢ్‌వేవ్ తీవ్రత లేదని తేలితే.. అన్ని రంగాల్లో కదలిక రానుంది.