(దండుగుల శ్రీ‌నివాస్‌)

స‌ర్కార్‌కు ఇది ఊహించ‌ని ప‌రిణామం. మొన్న‌టిదాకా ఒక లెక్క‌. ఇప్పుడొక లెక్క‌గా మారింది అక్క‌డ ప‌రిస్థితి. ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల‌లో ఇళ్ల‌ను కూల్చేసి.. పేద కుటుంబాల జీవితాల‌ను ధ్వంసం చేసిన స‌ర్కార్‌పై అంతా తిరగ‌బ‌డ్డారు. ప్ర‌తిప‌క్షాలూ అండ‌గా నిల‌బ‌డ్డాయి. ప‌రామ‌ర్శించాయి. శాప‌నార్ధాలు పెట్టి పోయాయి. డిమాండ్లు చేసి వెనుదిరిగాయి. కానీ న్యాయం జ‌ర‌గ‌లేదు. అక్క‌డ అంబేద్క‌ర్ భ‌వ‌న్‌లో నిరాశ్ర‌యులైన ఆ భూ నిర్వాసితులు ఇక త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌దా? మా బ‌తుకులు రోడ్డు పాలేనా? అని దీనంగా నిద్ర‌లేని రాత్రులు గడుపుతున్న వేళ‌.. తెలంగాణ జాగృతి ఎంట‌రైంది. క‌విత ఎవ‌రి ఊహ‌కంద‌ని విధంగా.. త‌న‌దైన శైలిలో ఆందోళ‌న‌కు దిగారు. అంద‌రితో పాటు ఈమే వ‌చ్చింది.. వెళ్తుంది అని అనుకున్న స‌ర్కార్‌కు ఊహించ‌ని షాక్‌. ఆప‌న్న‌హ‌స్తం కోసం .. న్యాయం కోసం దైన్యంగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబాల్లో చిగురించిన ఆశ‌. త‌మ‌కు తోడుగా నిలిచిన శ‌క్తిగా జాగృతిని చూశారు అక్క‌డి వారంతా. స‌ర్కార్‌లో క‌ద‌లిక తెచ్చేలా క‌విత నిరంత‌ర ఆందోళ‌న‌, నిర‌స‌న అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని ఒక్క‌సారిగా వేడెక్కించింది. స‌ర్కార్‌కు సెగ త‌గిలేలా చేసింది. కొత్త ఉద్య‌మానికి ఊపిరి పోసింది. ఇక‌పై భ‌విష్య‌త్‌తో తెలంగాణ‌లో ఎలాంటి పోరాటాలు జ‌రుగాలో, జ‌రుగుతాయో అద్దం ప‌ట్టింది. పేద‌ల పాలిట య‌మ‌పాశాలైతున్న పాల‌కుల దుర్నీతిపై క‌దం తొక్కాలంటే, న్యాయం జ‌ర‌గాలంటే ఇలాంటి ఖ‌మ్మం పోరాటాలే శ‌ర‌ణ్య‌మ‌ని చెప్పారు క‌విత‌. వెలుగుమ‌ట్ల పోరాటం ఓ స‌ర్కార్‌కు ఓ గుణ‌పాఠం నేర్పాలె. ఈ పోరాటాల స్పూర్తి తెలంగాణ అంతా పాకాలె… ఇప్పుడు చ‌ర్చంతా ఖ‌మ్మం చుట్టే. ఇదే ప‌రిస్థితి నెల‌కొంటే మ‌రింత ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తుతాయ‌ని భావించిన స‌ర్కార్ ఆమెను ఉద‌యం ఆరుగంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. క‌విత‌తో పాటు డీఎస్పీ మ‌హ‌రాజ్ విశార‌ద‌న్ మ‌హరాజ్‌, నిరాహార దీక్ష చేప‌ట్టిన వారిని అరెస్టు చేసి ఖ‌మ్మం పోలీసులు హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అయినా త‌ను దీక్ష కొన‌సాగిస్తాన‌ని ప్ర‌క‌టించారు క‌విత‌. వెలుగుమ‌ట్ల బాధితుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు దీక్ష కొన‌సాగిస్తాన‌ని, వెలుగుమ‌ట్ల‌లో బాధితుల‌కు ఇళ్లు క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చే వ‌ర‌కు పోరాడుతాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

వెలుగుమ‌ట్ల‌ వెలుగు రేఖ జాగృతి
ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల అట్టుడికింది. ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాల‌కు క‌విత బాస‌టగా నిలిచారు. పందుల దొడ్డిలో వేసిన‌ట్టు బాధిత ఆడ‌బిడ్డ‌లంద‌రినీ అక్క‌డే ఉన్న అంబేద్క‌ర్ భ‌వ‌న్‌లో కుక్కేసింది స‌ర్కార్‌. అక్క‌డికి వెళ్లి చూసిన క‌విత మ‌న‌సు చ‌లించింది. స‌ర్కార్‌పై ఆమె విరుచుకుప‌డింది. క‌నీసం మెడిక‌ల్ క్యాంపులు ఏర్పాటు చేయ‌కుండా, భోజ‌న వ‌సతి క‌ల్పించ‌కుండా స‌ర్కార్ వారిని హీనంగా చూస్తున్నద‌ని మండిప‌డ్డారు. ఒక్క ఆడ‌బిడ్డ ఏడిస్తేనే ఆ ఇళ్లు బాగ‌ప‌డ‌ద‌ని ఆమె ప‌రోక్షంగా కేసీఆర్ , ఆ కుటుంబంపై దుమ్మెత్తి పోసిన క‌విత‌.. ఇంత మంది ఆడ‌బిడ్డ‌ల‌ను ఏడిపిస్తున్న కాంగ్రెస్ స‌ర్కార్‌కు, ఖ‌మ్మం నాయ‌కుల‌కు త‌గ‌ల‌క‌పోద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేటీఆర్‌ను కూడా ప‌రోక్షంగా ఆమె తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల బాధ‌లు ఇలా చూసి ప‌రామ‌ర్శించి వెళ్లిపోయిన కేటీఆర్‌కు వీళ్లు ఓ ఎగ్జిబిష‌న్‌లా క‌నిపిస్తున్నార‌ని అన్నారు. గ‌తంలో బీఆరెస్ చేసిన పాపాల‌ను క‌డుక్కోవాల‌ని చూస్తున్న‌ద‌ని వారి త‌ప్పిదాల‌ను ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌స్తావించారు.

ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాదు…

త‌ను రావ‌డం ఆల‌స్య‌మైనా.. ఎక్క‌డున్నా పేద‌లు, బాధితుల ప‌క్షానే నిల‌బ‌డ‌తాన‌ని, ఇక్క‌డ స‌మ‌స్య ప‌రిష్కారం కాకుండా వెళ్లేదేలేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఎక్క‌డైతే పేద‌ల ఇళ్లు కూల్చేశారో.. అక్క‌డే వారికి తిరిగి స్థ‌లం ఇచ్చి, ఇళ్లు క‌ట్టించి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై ఆమె బాధితుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్‌కు ర్యాలీగా వెళ్లారు. అక్క‌డ చౌర‌స్తాపై ధ‌ర్నాకు దిగారు. క‌లెక్ట‌ర్ వ‌చ్చి స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చే వర‌కు క‌దిలేది లేద‌ని భీష్మించుకుని కూర్చోవ‌డంతో పోలీసులు రంగం ప్ర‌వేశం చేశారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య క‌విత‌ను, జాగృతి నాయ‌కుల‌ను, త‌దిత‌రుల‌ను బ‌ల‌వంతంగా అరెస్టు చేసి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. లేడీ పోలీసులు లేకుండా క‌విత‌ను అరెస్టు చేసి తీసుకెళ్ల‌డం ప‌ట్ల జాగృతి నాయ‌కులు, అక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు. రోడ్డుపై బైఠాయించారు.

క‌విత ఉద్య‌మ వ్యూహం.. క్ష‌ణ క్ష‌ణం టెన్ష‌న్‌

పోలీసులు డౌన్ డౌన్ అంటు నినాదాల‌తో ఆ ప్రాంతం హోరెత్తింది. అయినా బ‌ల‌వంతంగా వారంద‌రినీ అరెస్టు చేసి పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. జాగృతి ఆందోళ‌న‌తో ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల అట్టుడికిపోయింది. అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. త‌మ పోరాటం వివిధ రూపాల్లో భ‌విష్య‌త్తులో ఇంకా కొనసాగుతూనే ఉంటుంద‌ని, ప్ర‌భుత్వం దిగి వ‌చ్చి భూనిర్వాసితుల‌కు న్యాయం చేసేదాకా పోరాడుతామ‌న్నారు. ఇవాళ జాగృతి చేసిన పోరాటంతో స‌ర్కార్ పై ఒత్తిడి పెంచిందని భావిస్తున్నామ‌న్న ఆమె.. భూదాన్ భూములు క‌చ్చితంగా పేద‌ల‌కు పంచాల్సిన భూములేన‌ని, అవి వారికి తిరిగి ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. భ‌విష్య‌త్ పోరాటాల‌పై ప్ర‌ణాళిక సిద్దం చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించిన కొద్ది నిమిషాల్లోనే ఆమె అక్క‌డి బాధితుల‌తో క‌లిసి నిర‌వ‌ధిక నిరాహార‌దీక్ష‌కు దిగ‌డంతో అంతా అవాక్క‌య్యారు. స‌ర్కార్‌లో వ‌ణుకు పుట్టింది. ఆమెను బ‌ల‌వంతంగా అరెస్టు చేసి హైద‌రాబాద్‌కు త‌ర‌లించినా .. బాధితుల‌కు న్యాయం జ‌రిగే వర‌కు పోరాటం ఆగ‌ద‌ని క‌విత ప్ర‌క‌టించారు.

Dandugula Srinivas

Senior Journalist

7661066999