(దండుగుల శ్రీ‌నివాస్‌)

నేనెక్కాల్సిన రైలు జీవిత‌కాలం లేటు.. ఈ ప్రసిద్ధ వాక్యం ఆరుద్ర  రాసిన కావ్యం లోనిది. తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంతో రాశారు. కాలం, సమాజం, మనిషి పడే వేదనను ఆయన రైలు ప్రయాణంతో పోలుస్తూ ఈ కావ్యం రాశారు. అప్పుడు, ఇప్పుడు… ఎప్పుడు పేదోడికి సొంతింటి క‌ల నెర‌వేర‌ని క‌ల‌గానే మిగులుతున్న‌ది. పాల‌కులు ఉమ్మ‌డి రాష్ట్రంలోని వారైనా.. తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌నైనా.. ప‌రిస్థితులు మార‌లేదు. పేదోడికి సొంతింటి క‌ల భార‌మ‌వుతూనే వ‌స్తున్న‌ది. ఒక‌వేళ‌.. ఆ పేదోడు సొంతిళ్లు నిర్మించుకున్నాడంటే.. అదంత ఆషామాషీ కాదు. అది పూరి గుడిసెనా? రేకుల ఇల్లా, స్లాబ్ ఇల్లా? అనేది కాదు ముఖ్యం.

ఎవ‌రి స్థాయిలో వారు త‌మ‌కు సొంతుళ్లు ఉండాల‌నుకుంటారు. క‌ల‌లుకంటారు. బ‌లంగా కోరుకుంటారు. అద్దాల మేడ‌లు కావాల‌ని మాత్రం పేదోడెప్పుడూ అత్యాశ‌కు పోడు. పుట్టి పెరిగిన పేద‌రికం ఎలా త‌న జీవితంలో మ‌మేక‌మై క‌ష్టాల‌న్నింటినీ తోడు తీసుకురాగా.. ఓ సొంతిళ్లు ఉంటే చాలు..అని స‌రిపెట్టుకుంటాడు. దాని కోసం ఉన్న కొద్దిపాటి జాగైనా.. అందులో త‌ను చెమ‌టోడ్చి దాచిందంతా పెడ‌తాడు. అప్పులు ఎన్ని పుడ‌తాయో.. ఎక్క‌డెక్క‌డ పుడ‌తాయో అన్నీ చేసేస్తాడు. అది అత‌ని త‌ల‌కుమించిన భార‌మ‌ని తెలిసినా. అవే అప్పులు త‌న‌ను జీవిత‌కాలం పీడిస్తాయ‌ని త‌లుచుకుని నిద్ర‌లేని రాత్రుల‌ను మిగిల్చినా. త‌ప్ప‌దు. చేస్తాడు. క‌డ‌తాడు. ఆ తీర‌ని అప్పులు వెంటాడుతూనే ఉంటాయి జీవితకాలం. అయినా ఆ జీవిలో సొంతింటి సంతోషం జీవం పోస్తూ ఉంటుంది. బ‌తుకుపై ఆశ కల్పిస్తుంది. త‌న సంతానానికి అది తోడునీడ‌గా నిలిచినందుకు త‌నకు తోబుట్టువైనందుకు పోతున్న‌ద‌నుకున్న శ్వాస‌కు కొత్త ఊపిరినిస్తూ ఉంటుంది. అలా జీవిత‌కాలం ఆ ఇంటితో అనుబంధం. క‌ష్టాలొచ్చినా, రోగాలొచ్చినా.. బాధ‌లొచ్చినా.. సంతోషాలొచ్చినా ఈ గూడుతోనే అత‌నికి అనుబంధం పెనువేసుకుని ఉంటుంది. విడ‌దీయ‌లేనంత‌గా. ఎంతంటే త‌న క‌న్న‌త‌ల్లికి త‌న‌కు ఉన్నంత‌గా. త‌ను క‌న్న‌బిడ్డ‌ల‌కు త‌న‌కు ఉన్నంతగా.

ఇప్పుడిదంతా ఎందుకంటే.. రాష్ట్రంలో ఇళ్ల‌ను ఎడాపెడా కూల్చుతున్నారు. అభివృద్ధి మాటున‌. నిబంధ‌న‌ల సాకున‌. పేదోడు సొంతం చేసుకున్న భూమిని లాక్కునే ప్ర‌య‌త్నంలో క‌ట్టుకున్న ఇళ్ల‌ను నిమిషాల్లో నేల‌మ‌ట్టం చేసి విక‌ట్ట‌హాసం చేస్తున్న స‌ర్కార్‌ను చూస్తున్నామిప్పుడు. తాపీగా కూల్చి వారికి ఇందిర‌మ్మ ఇళ్లివ్వండి.. అని సీఎం ఆర్డ‌రేస్తున్నాడు. ఈ ఇందిర‌మ్మ ఇళ్లు ఇవ్వండ‌న‌డ‌మే పెద్ద జోక్‌. ఆ జోక్ వెనుక పేదోడి విషాద‌భ‌రిత‌మైన జీవితం. అవి రావు. వీళ్లు క‌ట్టివ్వ‌రు. అప్పుడు జీవిత‌కాలం ప‌ట్టింది. క‌ట్టుకోవ‌డానికి. ఇప్పుడు జీవిత‌కాల‌మూ ముగుస్తుంది వీళ్లు క‌ట్టించి ఇచ్చేస‌రికి. అవును మ‌రి. సొంతింటి జాగా ఉండాలంటారు. ఉంటే ఓ ఐదు ల‌క్ష‌లిస్తామంటారు. ఆ ఐదు ల‌క్ష‌ల‌కు మ‌రో ఐదు ల‌క్ష‌లు బాకీలు తెచ్చినా.. పీక‌ల్లోతు అప్పుల్లో మునిగినా ఒక్క ఇల్లు పూర్తికాదు. మ‌రి అంత ఈజీనా ఇందిర‌మ్మ ఇల్లు ఇచ్చేస్తున్నాం పో.. అని ద‌య‌చూపి, జాలిచూపి వ‌రం బిచ్చ‌మేసిన‌ట్టు.. ! ఇదే జ‌రుగింది ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల‌లో.

నిన్న‌నే ఓ మీటింగులో సీఎం అంటున్నాడు. ఏమ‌ని? ఇళ్లు కూల్చ‌క‌త‌ప్ప‌దు. సారీ, ఏమ‌నుకోకండి. మీకు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు రెడీగా ఉన్నాయి. అక్క‌డికి పంపుతాం. ఈ మాట ఎన్నిసార్లు చెబుతారు. ఎంత‌మందికి చెబుతారు? ఎంద‌రిని వాటిల్లోకి తోలుతారు. అస‌లు అవి ఎక్క‌డున్నాయి. ఉంటే అందులో జీవించేందుకు అవి రెడీగా ఉన్నాయా? ఉంటే అప్పుడు కేసీఆర్ ఎందుకియ్య‌లేదు. ఇస్తే ఇంకెందుకు అవి మిగిలి ఉన్నాయి. మీరు ఇప్పుడు సిటీలో ఎన్ని ఇందిర‌మ్మ ఇండ్ల‌కు సాంక్ష‌న్ ఇచ్చారు? అందులో ఎన్ని పూర్త‌య్యాయి. మీరిచ్చే ఐదు ల‌క్ష‌ల‌తో ం 30 శాతం మేర‌నైనా ఇళ్లు క‌ట్టుడు అవుతున్న‌దా? ఎంత‌మంది గృహ ప్ర‌వేశం చేశారు. జాగా ఉంటేనే క‌దా ఇందిర‌మ్మ ఇల్లు సాంక్ష‌న్ చేసేది. జాగా లేని పేద‌లు ఎటు పోవాలె. వారికి ఇందిర‌మ్మ ఇల్లు ఎవ‌రు క‌ట్టియ్యాలె? ఈ ప్ర‌శ్న‌ల ప‌రంప‌రం ఇప్ప‌డ‌ప్పుడే ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌. కానీ వీటికి స‌మాధానాలు అప్పుడు కేసీఆర్ ద‌గ్గ‌ర‌లేవు. ఇప్పుడు రేవంత్ ద‌గ్గ‌రా లేవు. హౌసింగ్ స్కీమ్ అంటే వారికి ఓట్లు దండి పెట్టే ఓ అస్త్రం.

పేదోడి బ‌ల‌హీన‌త అదే అని పాల‌కుల‌కు తెలుసు. అటు తిప్పి ఇటు తిప్పి.. అప్పుడంత ఇచ్చినం… ఇప్పుడింతిస్తం.. అని న‌మ్మ‌బ‌లికిన ప్ర‌తీసారి పేదోడు మోస‌పోతూనే ఉంట‌డు. గోస ప‌డుతూనే ఉంట‌డు. జీవిత‌కాలం త్యాగం చేసి క‌ట్టుకున్నా వాటిని కూల్చేందుకు ఏ మాత్రం వెనుకాడ‌కుండా నిర్వాసితుల‌నూ చేస్తారు. చివ‌ర‌గా ఇంకో గొప్ప వాక్య‌మొక‌టి పాల‌కుడు చేసి ముగిస్తాడు. ఇప్పుడు కాక‌పోతే మ‌రెప్పుడు అభివృద్ది చేసుకోలేం. అర్థం చేసుకోండి!అని. జీవితాలే పునాదుల్లో ప‌డి శ‌వాలుగా మారి ఆ క‌టుంబాలు అనాధ‌లైన‌పోయిన‌ప్పుడు నీ అభివృద్ధి ఎవ‌డికి కావాలె…? దీనికి స‌మాధానం లేదు. ఉండ‌దు. పాల‌కులు మారినా.. పేదోడి ఇంటి నిర్మాణం.. ఓ జీవిత‌కాలం. అంతే.

Dandugula Srinivas

Senior Journalist

7661066999