(దండుగుల శ్రీ‌నివాస్)

నినాదం బాగుంది. నిజాన్ని స‌ర్కార్ ఒప్పుకున్న‌ది. ప్ర‌జా పాల‌న కోసం… ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తున్నామ‌ని. అందుకే 99 రోజుల పాటు యంత్రాంగాలు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్నాయ‌ని. ఏమాట‌కామాటే… ఒక‌వేళ ఈ నినాదంలో ప్ర‌గ‌తి ప‌థంలో తెలంగాణ అనే విధంగా అర్థం వ‌చ్చేలా ఉంటే మాత్రం ఎవ‌రూ ఒప్పుకునేవారు కాదు. కాంగ్రెస్ లీడ‌ర్ల‌తో స‌హా. అవును. రెండేండ్లుగా స‌ర్కార్ చేసిందేమీ లేదు జ‌నాల‌కు. కేసీఆర్ ప‌రిపాల‌న‌ను కంటిన్యూ చేసే క్ర‌మంలో చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగానే ప‌రిపాల‌న సాగింది. అద‌నంగా ఏమైనా జ‌నానికి మేలు, ఊర‌ట‌ను క‌లిగించే అంశాలున్నాయంటే..అవి.. ఫ్రీ బ‌స్సు, రేష‌న్‌కార్డులు, స‌న్న‌బియ్యం. స‌ర్కార్ ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలోకి వెళ్తోంది.

జ‌నం వ‌ద్ద‌కు పోతున్న‌ది. వారి నాడి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఇప్ప‌టిదాకా అస‌లు స‌ర్కార్‌కు జ‌నాలు ఏమ‌నుకుంటున్నారో.. కూడా తెలియ‌దా? అని అనుకోవ‌డం పొర‌పాటు. తెలుసు. రేవంత్‌రెడ్డికి త‌న బ‌లం, బ‌ల‌హీన‌త రెండూ తెలుసు. కానీ ఏమి చేయలేని నిస్స‌హాయ‌త‌. ఇళ్లు చ‌క్క‌దిద్దుకోవ‌డానికే స‌మ‌యం ప‌ట్టింది. ప‌రిపాల‌న‌ను అవ‌గాహ‌న చేసుకుని ముందుకుపోవ‌డానికే రెండేడ్లు గ‌డిచాయి. ఇక పాల‌న‌పై ప‌ట్టే సాధించాల్సి ఉంది. ఇప్పుడు చేస్తున్న‌ద‌దే. ఈ వంద రోజుల ప్రోగ్రాం కూడా స‌ర్కార్‌కు ఓ ప్రోగ్రెస్ కార్డులాంటిది. క‌చ్చితంగా అందులో పాసు మార్కులు కూడా రావ‌ని రేవంత్‌కు తెలుసు. కానీ జ‌నం మ‌న‌సులోని ప్ర‌శ్న‌లు వినాల‌ని ఆయ‌న అనుకుంటున్నాడు. వాటికి స‌మాధానాలు రెడీ చేసుకోవాల‌ని భావిస్తున్నాడు. అందుకే స‌ర్కార్ ప‌నిత‌నానికి ఈ వంద రోజుల ప్రోగ్రాం ఓ ఎక్స్‌రేగా ప‌నిచేయాలి. కానీ కేసీఆర్ స‌ర్కార్‌లో బాకా ఊదిన‌ట్టు.. సార్ మీ పాల‌న భేష్ సార్.. అబ్బ‌బ్బ జ‌నం ఏం పొగుడుతున్నారు సార్.. మ‌ళ్లీ మ‌ళ్లీ మీరే సీఎంగా ఉండాల‌ని అనుకుంటున్నారు సార్… అని బాజా బ‌జంత్రీల రిపోర్టులు ఇస్తే.. వాటినే సీఎం న‌మ్మితే.. ఇక న‌ట్టేట మునిగిన‌ట్టే.

Dandugula Srinivas

Senior Journalist

7661066999