(దండుగుల శ్రీ‌నివాస్‌)

పెద్దాయ‌న ఫామ్‌హౌజ్ వీడి బ‌య‌ట‌కు రాడు. ప‌ల్లెత్తు మాట అన‌డు. అన్నీ కొడుకు కేటీఆర్ డైరెక్ష‌న్‌లోనే సాగుతున్నాయి. తిట్ల పురాణ‌మైనా.. ఇంకేదైనా! మ‌రి ప‌దే ప‌దే రేవంత్ నోట కేసీఆర్ గురించే ప్ర‌స్తావ‌న వ‌స్తుంది. అదీ ఆయ‌న ఆరోగ్యం గురించి. ఒక్క‌సారి కాదు.. చెప్ప‌లేన‌న్ని సార్లు. ఓట‌మి త‌రువాత ఆయ‌న ఆరోగ్యం క్షీణించింది అనే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. అందులో వాస్త‌వం లేక‌పోలేదు. వ‌య‌సు రీత్యా .. గ‌తంలోనే ఆయ‌న‌ను వేధిస్తున్న వ్యాధుల కార‌ణం… పార్టీ ఓట‌మి.. ఇంటా బ‌య‌టా మ‌న‌శ్శాంతి లేని రాజ‌కీయాలు.. ఇవ‌న్నీ ఆయ‌న్ను మాన‌సికంగా, శారీర‌కంగా వేధిస్తున్నాయి. తాజాగా మ‌రోసారి కూడా రేవంత్ నోట కేసీఆర్ ఆరోగ్యం గురించి కామెంట్లు వ‌చ్చాయి. ఆయ‌న ఆరోగ్యంగా ఉండాల‌ని, శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని, యోగా చేయాల‌ని, ప్ర‌వ‌చ‌నాలు వినాల‌ని.. ఇలా సాగాయి ఆయ‌న మాట‌లు. ఆశీర్వ‌చ‌నాల్లా. కానీ అవి వెట‌కారం జోడించిన మాట‌లేన‌ని… ప‌రోక్షంగా అవి ఆయ‌న్ను మ‌రింత‌గా ఇబ్బంది పెట్టి మాన‌సిక ప్ర‌శాంత‌త లేకుండా చేసే ప‌లుకులేన‌ని అంద‌రికీ తెలుసు.

ఏ స‌మ‌స్య‌పైనా కేసీఆర్ కామెంట్లు చేయ‌డం లేదు. ఆ మ‌ధ్యెప్పుడో ఫామ్‌హౌజ్‌లో క‌లిసిన కొంద‌రితో మాట్లాడిండు. నేను లేస్తే మ‌నిషిని కాను అనే రీతిలో. నా దెబ్బ ఎట్లుంట‌దో తెలుసుక‌దా.. మాములుగా ఉండ‌దు..అని గులాబీ ద‌ళాన్ని ఉత్సాహ‌ప‌రిచేందుకు కాబోలు అన్న‌ట్టున్నాడు. ఆ త‌రువాత చాల రోజుల‌కు ప్రెస్‌మీట్ పెట్టాడు. ఇక ఊరుకునేది లేదు. తోలు తీస్తం… అని వార్నింగ్ ఇచ్చాడు స‌ర్కార్‌కు. ఆ త‌రువాత మ‌ళ్లీ ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇలా కేసీఆర్ మాట్లాడిన ప్ర‌తీ సంద‌ర్భంలో.. అసంద‌ర్భంలో కూడా రేవంత్ ఆయ‌న్ను వ‌ద‌ల్లేదు.

అస‌లు కేసీఆర్ అనే ప‌దం లేకుండా తిట్టు లేకుండా, విమ‌ర్శ లేకుండా రేవంత్ స్పీచ్ ఉండ‌దు. ఇక మొన్న‌టికి మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచార‌ణ పేరుతో జ‌రిగిన ర‌చ్చ అంతాఇంతా కాదు. జాతిపిత అన్నందుకు బాగానే హ‌ర్ట్ అయ్యాడు రేవంత్‌. తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టి తిట్టి వ‌దిలాడు. తాజాగా మ‌ళ్లీ ఆయ‌న ఆరోగ్యం గురించి అవే కామెంట్లు చేశాడు రేవంత్‌. ఇదిప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. అంటే ఆయ‌నేం చెప్ప‌ద‌లుచుకున్నాడు. కేసీఆర్ ఆరోగ్యం బాగ‌లేదు. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని తెలంగాణ స‌మాజానికి సంకేత‌మిస్తున్నాడా? కేటీఆర్‌పై ఎట్లాగు ఆశ‌లు లేవు. కేసీఆర్ పై అంతో ఇంతో ఆశ‌లు పెట్టుకున్న జనానికి ఆయ‌న ఇక రాడు, లేవ‌డు, ఇంత‌కు ముందు కేసీఆర్‌లా ఉండ‌డు.. అని ఏవేవో సంకేతాలు ఇవ్వ‌ద‌లుచుకున్నాడా? ఆ బీఆరెస్ శ్రేణుల మ‌నోధైర్యాన్ని మ‌రింత‌గా దిగ‌జార్చే ప్ర‌య‌త్న‌మా? ఆ పార్టీకి ఉన్న కాస్తో కూస్తో ఉన్న పునాదుల‌ను కూడా స‌మూలంగా పెకిలించే ప‌న్నాగ‌మా?

మొత్తానికి రేవంత్ నోట కేసీఆర్ ఆరోగ్యం గురించి టాపిక్ వ‌చ్చిందంటే అది క‌చ్చితంగా రాజ‌కీయ వ్యూహంలో భాగ‌మే త‌ప్ప‌… ఆయ‌నను ఆరోగ్య ప్రాప్తి ర‌స్తు అని ఆశీర్వ‌దించిన‌ట్ట‌యితే కాదు… అని అనుకుంటున్నారంతా. ఇక ఈ ఆరోగ్యం విష‌యం… రేవంత్ ఆయ‌న‌కు చెప్పే సూక్తులు, ముందు జాగ్ర‌త్త‌లు మానేస్తే మంచిదేమో. జనానికి ఇది క్లారిటీగా అర్థ‌మైతే.. ఇంత దిగ‌జారుడు కామెంట్లా అని ప‌రిస్థితి కూడా వ‌స్తుంది. ఏదైనా మితంగా వాడితేనే మంచిది. అమిత‌మైతే అన‌ర్ధ‌మే సుమా!

Dandugula Srinivas

Senior Journalist

7661066999