(దండుగుల శ్రీ‌నివాస్‌)

కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆయ‌న వ్య‌వ‌సాయ శాఖ మంత్రి. సీనియ‌ర్ లీడ‌ర్. కానీ ఆయ‌న కూర్చున్న కొమ్మ‌నే న‌రుక్కునే త‌త్వం. ఆది నుంచి ఆయ‌న నైజ‌మంతే. ఆయ‌నే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ఈ స‌ర్కార్‌లో ఆయ‌న చేసిన భిన్న కామెంట్లు, ప్ర‌క‌ట‌న‌లు.. రైతుల‌నే కాదు.. ప్ర‌భుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేశాయి. ఈ విష‌యాలు.. వార్త‌లుగా చాలా సార్లు వాస్త‌వం వెబ్‌సైట్‌లో వ‌చ్చాయి కూడా. ఇప్పుడు ఖ‌మ్మంలో జ‌రిగిన పేద‌ల ఇళ్ల కూల్చివేత‌ల ద్వారా మ‌రోసారి తుమ్మ‌ల వార్త‌ల్లో కేంద్ర‌బిందువ‌య్యారు. ఈ ఉమ్మ‌డి జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా…ఎవ‌రికి వారే య‌మునా తీరు. పొంగులేటి శ్రీ‌నివాస్ అన్నీ తానై అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లోపార్టీ, ప్ర‌భుత్వ భారాన్ని మోస్తూ వ‌స్తున్నాడు. కానీ తుమ్మ‌ల బ‌రువు బాధ్య‌త‌లు మోసే విష‌యంలో వెనుకుంటాడు. అంతా చేసినంక ఆ ఫ‌లితాలు నావేన‌ని ముందుంటాడు. అలాంటి తుమ్మ‌ల చేసిన అనాలోచిత‌, దుందుడుకు, అల‌వాటు దోర‌ణి ప‌ని స‌ర్కార్‌కు మ‌చ్చ తెచ్చిపెట్టింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఖ‌మ్మంలో జ‌రిగిన పేద‌ల గుడిసెల నేల‌మ‌ట్టంపై చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లేం జ‌రిగింది? వాస్త‌వాలేమిటి? అనే విష‌యాల్లోకి వెళ్తే….


ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో గల 60 ఎకరాల భూదాన భూమిలో ఈ వివాదం నెలకొంది. 2014లో 62 ఎకరాల భూదాన భూమిలో దాదాపు 18 ఎకరాల్లో ఇండ్లు లేని నిరుపేదలు ఇండ్లు నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నారు. రెండువీరంతా పేద‌లే. దాదాపు రెండు వేల జ‌నాభా ఉన్న 600 కుటుంబాల‌క్క‌డ ఉన్నాయి. తాము నిర్మించుకున్న భూమికి పట్టాలు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు వీరు ఏళ్ల త‌ర‌బ‌డి. అయినా ప‌ట్టాలివ్వ‌లేదు. ప‌దేళ్ల క్రిత‌మే.. అంటే బీఆరెస్ స‌ర్కార్ హ‌యాంలోనే వీటిని కూల్చాల‌ని చూశారు. కొన్ని కుటుంబాలు కోర్టును ఆశ్ర‌యించాయి. కోర్టు స్టే విధించింది. దీంతో కేసీఆర్ స‌ర్కార్ కొంచెం వెన‌క్కి త‌గ్గింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ స‌ర్కార్‌లో కోర్టు స్టే ఇచ్చిన ఇళ్ల‌ను వ‌దిలేసి.. ఏకంగా అక్క‌డ ఉన్న ఇళ్ల‌న‌న్నింటినీ నేల‌మ‌ట్టం చేసేశారు. ఇక్క‌డే స‌ర్కార్‌కు పెద్ద త‌ల‌నొప్పి తెచ్చిపెట్టాడు మంత్రి తుమ్మ‌ల‌. ఇది తుమ్మ‌ల‌కు చెందిన ఖమ్మం నియోజ‌క‌వ‌ర్గ పరిధిలోనిదే.

ఇది తుమ్మ‌ల భూదాహ‌మా? పేద‌ల ఇళ్లను అందుకే నేల‌మ‌ట్టం చేశారా??

వేజల్ల సురేష్ కాంట్రాక్టర్ ఓ కాంట్రాక్ట‌ర్‌. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండ దండలతో అంచెలుగా ఎదిగాడు. చిన్న పాటి రోడ్లకు ప్యాచ్ లు వేసే స్థాయి నుంచి అంచలంచెలుగా కాంట్రాక్టర్ల సిండికేట్‌ను శాసించే సాయికి వెళ్ళాడు. గత 40 ఏళ్లుగా తుమ్మల అనుచరుడుగా ఉంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికి ఏ కాంట్రాక్టు దక్కాలి? ఎవరు ఏ పని చేయాలి? అని నిర్దేశించే స్థాయికి వెళ్ళాడు. ఒక విధంగా తుమ్మల నాగేశ్వరరావుకు బినామీగా ఉంటున్నాడు. వెలుగుమట్ల లో పేదవారి గుడిసెలు కూల్చివేతలో వేజెల్ల సురేష్ హస్తం ఉన్నట్లుగా ఖమ్మం జిల్లాలో జోరుగా ప్రచారంలో ఉన్నది. భూదాన్ భూమి లో పేదవారు గత 25 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. పేదలు తన పట్టా భూములను సైతం ఆక్రమించి గుడిసెలు వేసుకున్నారని వేజల్ల సురేష్ ఆరోపణ. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం అందులో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉండటంతో ఇదే అదనుగా భావించిన కొందరు వ్యక్తులు ప్రభుత్వ సహకారంతో గుడిసెలు కూల్చివేసినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది వాస్త‌వ‌దూరమేమీ కాదు.

మంత్రి పొంగులేటి ప్ర‌మేయం లేదా?

కానీ ఇందులో పొంగులేటి ప్ర‌మేయం లేకుండా ఉంటుందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. రెవిన్యూ మినిష్ట‌ర్ అయిన పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డికి, తుమ్మ‌ల‌కు ప‌డ‌దు. వీరిద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. పొంగులేటి ఆర్డ‌ర్ ఇవ్వ‌నిదే క‌లెక్ట‌ర్ ప‌ర్మిష‌న్ ఎలా ఇస్తాడు? మ‌రి ఆర్డ‌ర్ ఇచ్చే ముందు ఇది పేద‌ల‌కు సంబంధించిన విష‌యం క‌దా.. సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారా? కావాల‌నే ఇది ర‌చ్చ ర‌చ్చై ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పి వ్య‌వ‌హారం అయినా ప‌ర్లేదు.. అని తెల‌సీ ఇవ‌న్నీ తెర వెనుక ఓకే చేసేశారా? అనే అనుమానాలు కూడా అక్క‌డి రాజ‌కీయాల్లో చక్క‌ర్లు కొడుతున్నాయి. ఆధిప‌త్య పోరు వాస్త‌వ‌మేనైనా.. ఇప్పుడు ఇది మంత్రుల స‌మ‌స్య కాదు.. స‌ర్కార్ స‌మ‌స్య‌గా మారింది. నిరుపేద‌ల సొంతింటి స‌మ‌స్య‌గా మారింది. పేద‌ల ఇళ్లు నేల‌మ‌ట్టం చేసేందుకేనా మీ ప్ర‌జాపాల‌న అని నిల‌దీసే స్థాయికి చేరింది. దీని వెనుక క‌ర్త‌, కర్మ‌, క్రియా.. తుమ్మ‌ల‌నే అయినా.. స‌ర్కార్‌కు మ‌చ్చ‌గా మారింది. పేద‌ల‌కు తీవ్ర న‌ష్టాన్ని, క‌డుపు కోత‌ను మిగిల్చింది.

Dandugula Srinivas

Senior Journalist

7661066999