(దండుగుల శ్రీ‌నివాస్‌)

ప్ర‌తిప‌క్ష పార్టీ ఏదైనా ఆందోళ‌న చేస్తే.. స‌ర్కార్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డ‌తాయి. ప‌రేషాన్ ప‌రేషాన్ అయిత‌ది. కానీ ఇక్క‌డ స‌ర్కార్‌తో పాటు మ‌రొక‌రికి కూడా ప‌రేషాన్ ప‌రేషాన్ అవుతున్న‌ది. జ‌నం ఆకాంక్ష‌ల‌ను అనుస‌రించి ఆందోళ‌న నిర్మాణంలో ఆమె… ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని కూడా దాటేసింది. క‌నీసం ఆ ప్రధాన ప్ర‌తిప‌క్షం తేరుకునేలోపు, ఆలోచించేందుకు తీసుకునే స‌మ‌యంలోపే.. అక్క‌డ నుంచి ఏదో ఒక రూపంలో ఆందోళ‌న రూపం క‌ళ్ల‌కు క‌న‌బ‌డుతున్న‌ది. జ‌నం నాడి ఎరిగి న‌డుచుకుంటున్న ఆ చెల్లె ఇప్పుడు స‌ర్కార్‌తో పాటు అన్న‌కు కూడా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న‌ది. వాస్త‌వంగా చెప్పాలంటే ప‌రిపాల‌న‌లో ఎన్నో లోపాలు, ప్ర‌జ‌ల కష్టాలు ఉండ‌నే ఉంటాయి. ప్ర‌స్తుతం ఈ ప‌రిపాల‌న‌లో వ‌ర్ణ‌నాతీత‌మ‌నే చెప్పాలి. మ‌రి ప్ర‌తిప‌క్షాలు ఏమి చేయాలె. నిత్యం ఏదో ఒక రూపంలో ఆందోళ‌న‌ల‌కు దిగాలె. ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచాలె. మెడ‌లు వంచాలె. అనుకున్న‌ది సాధించాలె. ప్ర‌జా విజ‌యంగా జ‌నానికి ఆ ఫ‌లాలు అందించాలె.

కానీ ఇక్క‌డ మాత్రం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంటే.. ఇంకా పార్టీ కూడా ఏర్పాటు కాని, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత మాత్రం య‌మ స్పీడుగా ఉన్నారు ప్ర‌జాందోళ‌న‌ల విష‌యంలో. అవును .. ఆ చెల్లె దూకుడు చూసి ఆ అన్నే అనుకుంటున్నాడు.. వామ్మో ఇదేం దూకుడురా నాయ‌నా..! అని. బ‌య‌ట‌కు అన‌డం లేదు కాబోలు. అంటే సొంత పార్టీ నేత‌లే న‌వ్వుకుంటారు మ‌రి. అవును మ‌రి కారు స్టీరింగు అప్ప‌గించినా.. దాన్ని దూకుడుగా న‌డ‌ప‌డమేమో గానీ, అన్ని ఎన్నిక‌ల‌ల్లో టైర్లు పంక్ష‌ర్చు చేసుకుని తెలంగాణ భ‌వ‌న్ షెడ్‌లోకి వ‌చ్చి సేద తీరేలా చేస్తున్నాడు త‌ప్పితే..అంతకు మంచి మ‌రేం జ‌ర‌గ‌డం లేదు. అది అంద‌రికీ తెలుసు. బాపుతో స‌హా. కానీ కొడుకంటే ప్రేమ‌. ఏం చేసినా బాగు బాగు అనే అనాల‌నే అనిపిస్తుంది బ‌య‌ట‌కు. కానీ ఆయ‌న లోప‌ల మాత్రం త‌ను క‌ల‌లు క‌న్న పుత్రోత్సాహంబైతే క‌నిపించ‌డం లేదు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ప్ర‌జా ఆందోళ‌న‌ల‌ను నిర్మాణం చేయ‌లేక చ‌తికిలప‌డిన ప్ర‌స్తుత సంద‌ర్బంలో ఇంకా పార్టీగా రూపాంత‌రం చెంద‌ని తెలంగాణ జాగృతి మాత్రం వేళ్లూనుకుని ఉన్నాన‌ని చెప్పుకుంటున్న బీఆరెస్‌ను ఓవ‌ర్ టేక్ చేసి ర‌య్యిన దూసుకుపోతున్న‌ది ముందుకు. ఇప్పుడు స‌ర్కార్ కూడా బీజేపీ, బీఆరెస్‌లు పెద్ద‌గా ఆందోళ‌న చేసి ఒత్తిడి తెస్తాయ‌నే భ‌యంతో లేదు. జాగృతి కార్య‌క్ర‌మాలు, ఆందోళ‌న రూపాల‌పై దృష్టి పెట్టింది. ఇదీ సంగ‌తి!