(దండుగుల శ్రీనివాస్)
ఎన్నో హామీలిచ్చింది కాంగ్రెస్. అవన్నీ అసాధ్యమని తెలిసీ. కానీ కొన్ని ఇందులో భావోద్వేగాలతో ముడిపడిన హామీలున్నాయి. పేదలు భారీగా పెట్టుకున్న ఆశలకు అవి ప్రతిరూపాలుగా ఉన్నాయి. నిజంగా ఆ హామీల అమలు వారికి చేయాల్సిందేననే విధంగానే ఉన్నాయి. మేమున్నాం..మిమ్మల్ని ఆదుకుంటాం..అన్నట్టుగానే కాంగ్రెస్ ఆనాడు హామీలిచ్చింది. ఇందులో ఒకటి ఉద్యమకారులకు ఇంటి స్థలం, పింఛన్. కేసీఆర్ పాలనలో ఎన్నో రంగాలు, మరెన్నో వర్గాలు నిరాధరణకు గురయ్యాయి. నష్టపోయాయి. కోలుకోని విధంగా జీవితాలు చిన్నాభిన్నమై ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఉద్యమకారుల అంశం. అప్పుడాయన పట్టించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ సరైన సమయంలో సరైన విధంగా హామీ రూపంలో స్పందించింది. ముందుకొచ్చింది. బాధపడ్డ హృదయాలు, నష్టపోయిన జీవితాలు నమ్మేశాయి రేవంత్‌ను. అందుకే ఆ పక్షం చేరాయి. ఆ గెలుపులో వీరిదీ హస్తముంది.
మరి రెండేండ్లైంది. ఏమైంది హామీ. పోయినోడు పట్టించుకోలే. వచ్చినోడు విస్మరించాడు. అధికారం అనుభవించి పాపాలు, లోపాలు తెలుసుకోలేనోడు కూడా నోరు మూసుకుండు. అడుగుదామంటే షేమ్‌గా ఫీలవుతున్నట్టున్నాడు రామన్న. అందుకే ఈ హామీ గురించి ఇప్పటి వరకు పల్లెత్తు మాట మాట్లాడలేదు. మాట్లాడడు కూడా. ఎందుకంటే మీరేం చేశారు అప్పుడు? అని నిలదీస్తారని భయం. ప్రశ్నిస్తారనే జంకు. మరెవరు మాట్లాడాలె. ఎవరు మాట్లాడిండ్రు. ఎవరు తోడుగా నిలిచిండ్రు.. అంటే .. కవితనే అని చెప్పాలి. అవును.. ఆమె సర్కార్ ఇచ్చిన అన్ని హామీలపై పోరాడుతున్నారు. ఉద్యమకారుల ఇష్యూను ప్రధానంగా తీసుకుని ఫైట్ చేస్తున్నారు కూడా. తన తండ్రికి లేఖ రాసిన విషయం బయటకొచ్చిన సంఘటనలోనే ఆమె ఉద్యమకారుల పక్షాన నిలబడ్డారనేది సుస్పష్టం. ఆ తరువాత వేదికేదైనా.. సందర్భం వచ్చిన ప్రతీసారి ఉద్యమకారులకిచ్చిన హామీని పట్టించుకోండనే ఆమె మాట్లాడుతూ వస్తున్నారు.
ఉద్యమకారుల ఆత్మగౌవర సభ కూడా పెట్టింది దీనికోసమే. మొత్తానికి కవిత పొగకు కలుగులోంచి ఎలుకల్లా ఇచ్చిన హామీలు బయటకు వస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రకటించాడు. హామీ నెరవేర్చేక్రమంలో 250 గజాల స్థలం పరిశీలన అని…కానీ పింఛన్ గురించి మాట్లాడలే. సబ్ కమిటీ అన్నాడు. తప్పించుకోవడానికి ఇదో మార్గంగా కూడా సర్కార్ ఈ మధ్య ఈ సబ్‌కమిటీ స్ట్రాటజీ వాడుతున్నది. అందుకే ప్రకటన రాగానే మురిసిపోవద్దు. జరిగిన నష్టం కళ్లముందే ఉన్నది. జరగాల్సిన ప్రతిఫలం వచ్చే వరకు పోరాడుతూనే ఉండాలి. గుడ్డిగా నమ్మే పరిస్తితి లేదు. అందులోనూ ఇప్పుడున్న వాతావరణంలో. ఈ పరిపాలనలో.
