(దండుగుల శ్రీ‌నివాస్‌)

కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే ప‌ర‌మిత‌మ‌య్యాడు. ఇక్క‌డ బావ‌బామ్మ‌ర్దుల‌దే న‌డుస్తుంది. ఎవ‌రు ఏ నిర్ణ‌యం తీసుకుంటున్నారో తెల‌య‌దు. తోక కుక్క‌నాడిస్తుందో.. కుక్కే తోక‌నాడిస్తుందో ఆ పార్టీ వాళ్ల‌కే అర్థంకాక నెత్తిగోక్కుంటున్నారు. ఏది ప‌డితే అది… లెక్కా ప‌త్రం, వెనుకా ముందు ఆలోచించ‌కుండా మాట్లాడేస్తున్నారు. ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. నిర్ణ‌యాలు తీసేసుకుంటున్నారు. ఆదేశాలు జారీ చేసేసుకుంటున్నారు. వాళ్ల చేష్ట‌లు చూస్తే అధికారంలో ఉన్నామ‌నే భ్ర‌మ‌లో ఉన్నారా? అధికారం పోయింద‌నే ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్నారా?? అర్థం కావ‌డం లేదు. కానీ పిచ్చోడి చేతిలో రాయిలాగే ఉంది బీఆరెస్ ప‌రిస్థితి.

అయితే, ఇక్క‌డ చెప్పుకోవాల్సిన విష‌యం ఇంకొక‌టుంది. బీఆరెస్ నుంచి ప్ర‌ధానంగా మాట్లాడేది ఇద్ద‌రే. బావ‌బామ్మ‌ర్దులు. ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నంలో వారిద్ద‌రు ఒక‌రికి మించి ఒక‌రు పోటీ ప‌డుతున్నారు. ఈ హ‌డావుడిలో తామేం చేస్తున్నామో కూడా వారికి అప్పుడ‌ప్పుడు సోయి త‌ప్పుతున్నారు. వీరు ఆరోప‌ణ‌లు ఇలా చేశారో లేదో.. అధికార‌ప‌క్షం ఇంకా మేల్కొని దానికి బదులిచ్చే లోపే…. క‌విత ఘాటైన కౌంట‌ర్ల‌తో రెడీ అయిపోతున్న‌ది. వాస్త‌వానికి బావ‌బామ్మ‌ర్దులు చేసే ఆరోప‌ణాలు చాలా వ‌ర‌కు ద్వంద్వ ప్ర‌మాణాల‌తో ఉంటున్నాయి. ఈ విష‌యం అధికార ప‌క్షం క‌న్నా.. క‌వితే తొంద‌ర‌గా అర్థం చేసుకుంటున్న‌ది. ఎందుకంటే ప‌దేళ్లూ అధికారంలో ఆమె కూడా భాగ‌స్వామే కాబ‌ట్టి. ముందే ఆమె మంచి క‌సిగా ఉంది. స‌మ‌యం దొరికితే చాలు ఇటు అన్న‌ను, అటు బావను ఏకిపారేయ‌డానికి. దీనికి తోడు బావబామ్మ‌ర్దుల డ‌బుల్ స్టాండ‌ర్డ్ పోక‌డలు, అహం నిండిన నిర్ణ‌యాలు… ఇది క‌విత‌కు మంచిగా క‌లిసి వ‌చ్చింది. క‌విత వీరిని ఆధారాల‌తో స‌హా చేసే థ‌ర్డ్ డిగ్రీ చూసి అటు కాంగ్రెస్ కూడా.. కాగాల కార్యం
గంధ‌ర్వులే తీర్చిన చందంగా వేదిక‌పై నిల‌బ‌డి వేడుక చూస్తున్నారు.

నైనీ మైన్స్ విష‌యంలో అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేసిన హ‌రీశ్‌ను గుంట‌న‌క్క‌తో పోల్చిన క‌విత‌… ఆయ‌న బాగోతాల‌న్నీ ఆధారాల‌తో బ‌య‌ట‌పెట్టింది. ఆ పార్టీలోనే ఉంటూ కేసీఆర్ ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బార్చి.. ఆ పార్టీని మ‌రింత భ్ర‌ష్టు ప‌ట్టించాల‌ని హ‌రీశ్ చూస్తున్నాడ‌ని తేల్చిపారేసింది. బీఆరెస్ అధికారంలో ఉన్న‌ప్ప‌ట్నుంచి సింగ‌రేణి టెండ‌ర్ల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని హ‌రీశ్ కోర‌డాన్ని క‌విత తీవ్రంగా ఆక్షేపించింది. వాళ్లు చేసిన త‌ప్పుల‌ను త‌వ్వి తీయ‌మ‌ని త‌నే చెబుతున్నాడ‌ని, గుంట‌న‌క్క వేశాల‌కు ఇదే తాజా ఉదాహ‌ర‌ణ‌గా ఆమె చెప్పుకొచ్చింది. దీన్ని ప‌ట్టుకుని ఆ వెంట‌నే కేసీఆర్ కూడా ఇదే మాట్లాడ‌టాన్ని… కుక్క‌ను తోకాడిస్తున్న వైనంగా ఆమె చెప్పుకొచ్చింది. హ‌రీశ్ ట్రాన్స్‌లో కేటీఆర్ ప‌డిపోయాడ‌ని, ఇద్ద‌రూ కలిసి పార్టీని నాశ‌నం చేస్తున్నార‌ని కూడా ఆమె వ్యాఖ్యానించింది.

ఇక మీడియా విష‌యంలో కూడా కేటీఆర్‌, హ‌రీశ్‌ల డ‌బుల్ స్టాండ‌ర్డ్ విధానాన్ని బ‌య‌ట‌పెట్టింది క‌విత‌. కేటీఆర్‌పై త‌ప్పుడు కథ‌నాలు రాశార‌ని మొన్న మ‌హాటీవీపై త‌న అనుచ‌రుల‌తో దాడి చేయించాడు. ఎన్టీవీలో ఓ ద‌ళిత ఐఏఎస్ ఆఫీస‌ర్‌పై అక్ర‌మ సంబంధాలంట‌గ‌డుతూ క‌థ‌నం వండివారిస్తే దానిపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటే వ్య‌తిరేకించారు. ఎన్టీవీని బీఆరెస్ స‌మ‌ర్థించింది. అంటే ద‌ళిత ఐఏఎస్ అంటే లెక్క‌లేదా? ఆమె మ‌హిళా ఐఏఎస్ అని కూడా చూడ‌రా? మీకో న్యాయం… ద‌ళ‌త ఐఏఎస్ విష‌యంలో జ‌రిగిన అన్యాయంపై మ‌రో విధాన‌మా? అని కేటీఆర్ తీరును ఎండ‌గ‌ట్టింది క‌విత‌. ఎప్ప‌టిక‌ప్పుడు అధికార‌ప‌క్షం క‌న్నా క‌వితే వీరిద్ద‌రి వ్యాఖ్యానాలు, నిర్ణ‌యాల‌పై ఆమె వెంట‌నే స్పందిస్తున్న తీరు ఆ పార్టీ నేత‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తామొక‌టి త‌లిస్తే మ‌రొటై కూర్చుంటుంది క‌విత వ‌ల్ల అని త‌ల‌లు ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది బావ‌బామ్మ‌ర్దుల‌కు.

Dandugula Srinivas

Senior Journalist

7661066999