(దండుగుల శ్రీ‌నివాస్‌)

మోహ‌న్‌బాబు అడ‌విలో అన్న సినిమాలో ఓ పాటుంది. వీర తిల‌కం దిద్దినావు.. పోరు దారిలో న‌డ‌వ‌మ‌న్నావు.. వంద‌నాల‌మ్మా..అమ్మా వంద‌నాల‌మ్మా!! సూప‌ర్ హిట్ సాంగ్‌. ఇప్పుడు దీన్ని కొంచెం మార్చి పాడాలి రామ‌న్న‌కు. వీర తిల‌కం దిద్దినారు.. ఇదే దారిలో న‌డ‌వ‌మ‌న్నారు..! అని. అవును. ఆయ‌నను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించి వ‌దిలేస్తే.. బ‌య‌ట‌కు రాగానే వీర తిల‌క‌మే దిద్దారు గులాబీలు. ఏదో యుద్ధానికి పోయి విజ‌యం సాధించుకుని వ‌చ్చిన‌ట్టుగా. జాతిని ఉద్ద‌రించి స‌మాజాన్ని మేల్కొల్పో గొప్ప కార్య‌మేదో చేసి తిరిగి వ‌చ్చిన‌ట్టుగా. అట్ల‌నే ఉంది గులాబీ దండు హ‌డావుడి. ఒక‌టి కాదు రెండు కాదు వేల మందివి ఫోన్ ట్యాపింగులు.

అందులో ఎవ‌ర్నీ వ‌ద‌ల్లేదు. వీటి ఆధారాల‌న్నీ ప‌క్కా ఉన్నాయి స‌ర్కార్ ద‌గ్గ‌ర‌. దీనిపైనే సిట్ చెడామడా చ‌మ్డాలెక్క‌దీసే ప‌నికి పూనుకున్న‌ది. విచారిస్తున్న‌ది గంట‌ల‌కొద్దీ. ఒక్క‌రిన్నీ పిలిచి. బావ వంతు అయింది. ఏడు గంట‌లు ఉక్కిరిబిక్కిరి చేసి వ‌దిలారు. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తే అందులో త‌డిచి ముద్దై ఊపిరాడ‌క ఎలాగోలా బ‌య‌ట‌కు వ‌చ్చి హ‌మ్మ‌య్యా బ‌తుకు జీవుడా అనుకుని.. ఏహె ఏంకాలే ఏంకాలే..అంతా ఉత్త‌దేన‌ని బుకాయించాడు. ఈ రాముడూ వెళ్లాడు. ఇదంతా లొట్ట‌పీసు కేసేన‌ని… ఫోన్ ట్యాపింగ్ నిజ‌మేన‌ని రోజుకో మాట మాట్లాడి ఎట్ట‌కేల‌కు విచార‌ణ‌కు వెళ్లాడు. మ‌ళ్లీ ఏడు గంట‌లు. ఊపిరి స‌ల‌ప‌నీయ‌కుండా, ప్ర‌శ్న‌ల పరంప‌ర‌. కీల‌క విష‌యాల గుట్టు లాగారు. ఇలా బ‌య‌ట‌కు రాగానే ఇగో ఇలా వీర తిల‌కం దిద్ది .. వా అన్నా.. వాహ్‌! అన్నారంతా గులామీలు. కాదు కాదు గులాబీలు. ఇంకా ఇసోంటి ప‌నులు ఎన్నో చేసి తెలంగాణ ఖ్యాతిని న‌లుచెర‌గులా ప‌ర‌చాల‌న్న‌దే వారి ఆకాంక్ష‌య్యి ఉంటుంది. మ‌న‌కే స‌రిగ్గా అర్థం కాలేదు. అంతే క‌దా!

Dandugula Srinivas

Senior Journalist

7661066999