(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
మేరా బూత్ సబ్సే మజ్బూత్.. ఇది భారతీయ జనతా పార్టీ మౌళిక నినాదం. కానీ తెలంగాణలో బీజేపీ నాయకుల తీరు మేరా బూత్ సబ్సే బేకార్ అన్నట్టుగా తయారయ్యింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కమలం.. పంచాయతీ ఎన్నికల్లో చేతులెత్తేసింది. కనీసం బలమున్న చోట కూడా గెలవలేకపోయింది. గెలుపు కోసం పోరాడుతున్న క్యాడర్‌కు, లోకల్ లీడర్లకు రాష్ట్ర అధిష్టాన వర్గం నుంచి రవంత ప్రోత్సాహం కూడా లభించలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు కూడా అదే బాటలో ఎవరికి వారే గోదారి తీరే అన్నట్టు వ్యవహరించారు. ఫలితంగా రాజకీయ ప్రాబల్యం ఉన్న బీజేపీ నాయకులు కూడా ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. గెలిచే చోట ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఎంతో కొంత బలమున్న హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ కూడా ఘోర పరాభవాన్ని చవి చూసింది. మొదటి విడత పంచాయతీల్లో 200 లోపు సీట్లతోనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాల్సి వచ్చింది. 5 శాతంలోపే విజయాన్ని దక్కించుకున్నది. అది కూడా స్థానిక సమీకరణలు, అభ్యర్థి ప్రాబల్యం, పరపతి వల్ల గెలిచినవే. అది సహజం. పంచాయతీ ఎన్నికలు వ్యక్తలు బలాబలాలపైనే ఆధారపడి ఉంటాయి. ఇది వాస్తవం.
కానీ, ఆయా ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, బడానాయకులు మేము ఉన్నామని అండగా నిలిస్తే… కనీసం ప్రాబల్యం ఉన్న చోట అభ్యర్థులు సునాయసంగా గెలిచే అవకాశాలుంటాయి. అందుకు ఉదాహరణగా సిద్దిపేటను తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ గెలుపు వంద లోపు ఓట్లతేడానే ఉంటాయి. వంద, రెండు వందల ఓట్ల కోసం పెద్ద నాయకులు భరోసా ఇస్తే ఆర్థికంగా కానీ, నైతికంగానే భరోసా ఇస్తే బలమైన వ్యక్తులు కొద్ది తేడాతో గెలిచే అవకాశాలుంటాయి. పంచాయతీ ఎన్నికల్లో పది నుంచి 20 శాతం వరకు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు సమన్వయం, సహకారం మీద ఆదారపడి ఉంటాయి. ఈ పంచాయతీల్లో ఏ ఒక్క చోట కూడా ఈ సమన్వయం కనిపించలేదు. పార్టీ పట్టించుకోలేదు. రాష్ట్ర నాయకత్వం సమావేశం ఏర్పాటు చేసి నిలబడండి… కలబడండి..గెలవండి మేమున్నామని పిలుపివ్వలేదు. భరోసా అసలే లేదు.
ఫలితంగా గెలవాల్సిన చోట కూడా బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. మేరా బూత్ సబ్సే మజ్బూత్ అన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ ఘోర నాయకులు ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలుగా ఓడిపోతున్న వ్యక్తులు ఎంపీలుగా గెలుస్తున్నారు. ఎంపీలు మంత్రులవుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వ్యూహం లేదు. హోం వర్క్ అసలే లేదు. పార్లమెంటులో మాట్లాడే సత్తా లేదు. ఇదీ బీజేపీ నాయకుల మీద ఉన్న అపప్రద. మొదటి నుంచి కూడా ఇదే అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. జాతీయ వ్యవహారాల్లో బీజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ కూడా విసిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోతోనే, హిందూత్వ నినాదం మీదనో, జాతీయ సమగ్రత పేరిటనో గెలుస్తున్నారు. స్థాన బలం కోల్పోయి, స్థానిక ఎన్నికల్లో ఓడిపోయి పార్టీని నిర్వీర్య పరుస్తున్న నాయకులను జాతీయ స్థాయిలో బీజేపీ బలంగా ఉండాలన్న ఒక అభిప్రాయంతోనే ఎంపీలుగా గెలిపించుకుంటున్నారని పార్టీ కార్యకర్తలకు కూడా ఒక బలం అభిప్రాయం ఏర్పడింది. ఎంపీ ఎన్నికల్లో గెలవడం మా స్థానిక నాయకత్వ బలం కాదు… జాతీయ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమని కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
కనీసం గెలిచిన తరువాత కూడా బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలన్న కనీస ధర్మాన్ని అగ్రనాయకులు మరిచిపోతున్నారని తీవ్ర ఆగ్రహంతో కార్యకర్తలున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ సరిగా పనిచేయని ఎంపీలకు క్లాస్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కానీ, ఇదే ప్రధాని ఇప్పటికి రెండు సార్లు హిందూత్వ నినాదంపై మాత్రమే గెలవడం సరికాదు.. ప్రజల్లోకి వెళ్లండి.. ప్రజల మనుసులను గెలవండి… స్థానిక ప్రజలతో మమేకం కండి అని రెండు సార్లు పిలిపిచ్చారు. కానీ రాష్ట్ర నాయకుల్లో కదలిక రాలేదు. కనీసం కొన్ని అంశాల మీద కూడా హోం వర్క్ చేయకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం, గాలి మాటలు మాట్లాడటము, ఒక వ్యూహం లేకపోవడం .. ఇవన్నీ అంశాలు ప్రధానికి కూడా కోపం తెప్పించాయి. ఒకరిద్దరు బాగానే మాట్లాడుతున్నప్పుటికి వాళ్లకు రాష్ట్ర అధినాయకత్వం నుంచి ప్రోత్సాహం లేదు. కార్యకర్తలకు ఉత్సాహం లేదు. ఇదే క్రమంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవాలకు రాష్ట్ర నాయకత్వమే భాధ్యత వహించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవకపోయినా.. కనీసం పరువు దక్కించుకోలేకపోయామని అసంతృప్తితో రగులుతున్న కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర నాయకత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేల తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతున్నారు.
ఇదిలాగే కొనసాగితే కార్యకర్తలే ఛలో ఢిల్లీ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండవ విడతలోనైనా కనీసం పరువుదక్కించుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. ప్రధాని మోడీ మరింత క్లాస్ పీకి ఉండాల్సిందని కూడా భావిస్తున్నారు.
