(దండుగుల శ్రీ‌నివాస్‌)

బీసీ నేత‌గా, ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్టు క‌ష్ట‌ప‌డి పార్టీలో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగిన బొమ్మ మ‌హేశ్‌కుమార్ గౌడ్ త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని, డిప్యూటీ సీఎంగా చాన్స్ ఇస్తున్నార‌ని గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఆయ‌న బ్రేక్ వేశారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇష్టం లేద‌ని, కీల‌క‌మైన పీసీసీ చీఫ్‌గానే ఉండ‌ద‌లుచుకుంటున్న‌ట్టు అధిష్టానానికి త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పారు. దీంతో ఈ ప్ర‌చారానికి ఇక తెర‌ప‌డిన‌ట్టే. అధిష్టానం ఆశీస్సుల‌తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి స‌హ‌కారం, మ‌ద్ద‌తు మ‌హేశ్‌కుమార్ గౌడ్‌కు మెండుగా ఉన్నాయి. రేవంతుకు కూడా మ‌హేశ్‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని కోరిక ఉంది. పీసీసీ చీఫ్‌గా అయ్యేందుకు త‌న స‌హ‌కారం ఎంతో ఉంది. స‌హ‌జంగానే అధిష్టానంతో మంచి సంబంధాలున్న మ‌హేశ్‌కు … ఇక్క‌డ రేవంత్ ఆశీస్సులు కూడా తోడ‌య్యాయి. దీంతో ఆయ‌న‌కు పీసీసీ చీఫ్ ద‌క్కింది.

అప్పట్నుంచి ఈ ఇద్ద‌రు ఇటు ప్ర‌భుత్వాన్ని, పార్టీని స‌మాంత‌రంగా ముందుకు తీసుకుపోతున్నారు. ఈ రెండింటిని బ‌లోపేతం చేస్తూ పోతున్నారు. ఈ క్రమంలో ఇద్ద‌రి స‌మ‌న్వ‌యంగా బాగానే ఉంద‌నే సంకేతం అధిష్టానానికి ఉంది. కానీ సీఎం రేవంత్‌.. మ‌హేశ్‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవ‌డం ద్వారా బీసీకి ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్ట‌వుతుంద‌ని, డిప్యూటీ సీఎంగా చేసి త‌న‌కు స‌పోర్టుగా ఉంచుకోవాల‌ని చూశారు. కానీ సుతిమెత్త‌గా ఈ అవ‌కాశాన్ని తిర‌స్క‌రించారు మ‌హేశ్‌. త‌న‌కు పీసీసీ చీఫ్‌గానే ఉండ‌ద‌లుచుకున్నాన‌ని అధిష్టానానికి త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పారు. కాగా, ఒకే ఒక బెర్త్ ఖాళీగా ఉన్న మంత్రివ‌ర్గంలో త్వ‌ర‌లో దీన్ని భ‌ర్తీ చేయాల‌ని కూడా అధిష్టానం భావిస్తున్న‌ద‌ని, మంత్రుల శాఖ‌ల ప్ర‌క్షాళ‌న చేయాల‌ని కూడా అనుకుంటున్న‌ద‌ని మ‌హేశ్ మీడియాకు వివ‌రించారు. దీంతో మ‌రో రెడ్డికే అవ‌కాశం ద‌క్కేలా ఉంద‌నే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది.

Dandugula Srinivas

7661066999